కేరళలో ఇస్లామిక్ స్టేట్ మద్దతుదారులు అరెస్టు!
తిరువనంతపురం: ప్రపంచదేశాలను గడగడలాడిస్తున్న ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్) ఉగ్రవాదులకు మద్దతుదారులుగా అనుమానిస్తున్న నలుగురిని కేరళ పోలీసు అధికారులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.
తిరువనంతపురం ఎయిర్ పోర్టులో ఇద్దరిని, కోజికొడ్ ఎయిర్ పోర్టులో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని పోలీసు అధికారులు చెప్పారు. గతంలో వీరు ఉగ్రవాదులకు సహకరిస్తున్నారని వెలుగు చూడటంతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వీరిని ఆ దేశం నుంచి బహిష్కరించిందని అధికారులు అన్నారు.
తరువాత కేరళలో మకాం వేసిన వీరు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులకు మద్దతుదారులుగా ఉంటూ యువతను ఆ వైపు ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నారని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గతవారం హైదరాబాద్ విమానాశ్రయంలో దుబాయ్ వెళ్లేందుకు ప్రయత్నించిన ఓ మహిళా ఉగ్రవాదిని పోలీసులు అరెస్టు చేశారు.

నిక్కీ జోసెఫ్ గత జనవరిలో అరెస్టు అయిన మొయినుద్దీన్ అనే ఉగ్రవాది ప్రియురాలు అని విచారణలో వెలుగు చూసింది. నిక్కీ జోసెఫ్ హైదరాబాద్ చేరుకుని పలువురుని ఐఎస్ఐఎస్ లో చేర్చేందుకు ప్రయత్నిస్తున్నదని గుర్తించిన అధికారులు ఆమె మీద నిఘా వేసి చివరికి అరెస్టు చేశారు.
నిక్కీ జోసెఫ్ ఇచ్చిన సమాచారం మేరకు కేరళలో ఈ నలుగురిని అదుపులోకి తీసుకున్నారని తెలిసింది. పోలీసుల అదుపులో ఉన్న వారి పేర్లు, వివరాలు వెల్లడించడానికి కేరళ పోలీసు అధికారులు నిరాకరించారు.
ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాన్ అండ్ సిరియాలో చేరేందుకు భారత్ నుంచి గల్ఫ్ దేశాలకు వెళుతూ ఇప్పటి వరకు 30 మందికి పైగా అరెస్టు అయ్యారు. అదే విదంగా కోల్ కతా నుంచి అనేక మంది ఐఎస్ఐఎస్ వైపు ఆకర్షితులు అవుతున్నారని ఇంటిలిజెన్స్ అధికారులు గుర్తించారు.












Click it and Unblock the Notifications