కర్ణాటకలోలో మూడో ఒమిక్రాన్ కేసు: 20 మంది కాంటాక్టులు: దక్షిణాదిపై పంజా
బెంగళూరు: ప్రాణాంతక కరోనా వైరస్‌కు చెందిన ఒమిక్రాన్ వేరియంట్.. విజృంభణ మొదలు పెట్టినట్టే కనిపిస్తోంది. అనూహ్యంగా ఆ వేరియంట‌్‌కు సంబంధించిన పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. గంట వ్యవధిలో మూడు కొత్త కేసులు వెలుగులోకి రావడం- పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ కొత్త మహమ్మారి దక్షిణాది రాష్ట్రాలపై పంజా విసిరేలా ఉంది. ఇప్పటిదాకా నమోదైన ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య 36కు చేరుకుంది. కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, ఢిల్లీ, ఏపీ, హర్యానాల్లో కేసులు రిజిస్టర్ అయ్యాయి.
తాజాగా కర్ణాటకలో మరో కేసు నమోదైంది. ఇప్పటిదాకా కర్ణాటకలో ఒమిక్రాన్ వేరియంట్‌కు చెందిన రెండు కేసులు మాత్రమే రికార్డయ్యాయి. తాజాగా ఈ సంఖ్య మూడుకు పెరిగింది. మరో పాజిటివ్ కేసు నమోదైనట్లు కర్ణాటక వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కే సుధాకర్ తెలిపారు. దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన 34 సంవత్సరాల వ్యక్తికి ఒమిక్రాన్ వేరియంట్ సోకినట్లు చెప్పారు. స్వల్ప వ్యవధిలో ఈ కేసుల సంఖ్య పెరగడం కలకలం రేపుతోంది.

అతనితో 20 మంది కాంటాక్ట్ అయ్యారని సుధాకర్ చెప్పారు. ఆ వ్యక్తి కుటుంబానికి చెందిన అయిదుమంది శాంపిళ్లను వైద్యారోగ్య శాఖ అధికారులు సేకరించామని, జీనోమ్ సీక్వెన్స్ కోసం వాటిని పంపించామని అన్నారు. ఈ అయిదుమందినీ ప్రైమరీ కాంటాక్ట్‌గా గుర్తించినట్లు స్పష్టం చేశారు. ఒమిక్రాన్ సోకిన వ్యక్తి, ఆ అయిదుమందిని కలిసిన సెకెండరీ కాంటాక్టులు 15 మంది ఉన్నారని వివరించారు. మొత్తంగా 20 మంది నుంచి నమూనాలను సేకరించినట్లు చెప్పారు.
ఒమిక్రాన్ వేరియంట్ తొలి రెండు కేసులు నమోదైంది కర్ణాటకలోనే. ఆ తరువాత వాటి సంఖ్య పెరగలేదు. పెరగకుండా ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలను తీసుకుంది. తొలి కేసు నమోదైన తరువాత.. అది వ్యాప్తి చెందకుండా కట్టడి చేయగలిగింది. దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన వ్యక్తి దాని బారిన పడటం, అతని ద్వారా మరో 20 మందికి అది సోకే ప్రమాదం నెలకొని ఉండటం ఆందోళనకు గురి చేస్తోంది. ఆ వ్యక్తిని ఐసొలేషన్‌లోకి పంపించామని, ప్రభుత్వం ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నామని మంత్రి సుధాకర్ తెలిపారు.

కాగా- ఒమిక్రాన్ కేసులు పెరగకుండా కర్ణాటక ప్రభుత్వం ఇప్పటికే ముందు జాగ్రత్త చర్యలను తీసుకుంది. కేరళ, మహారాష్ట్రలతో సరిహద్దులను మూసివేసింది. ఈ రెండు రాష్ట్రాల నుంచి కర్ణాటకలో అడుగు పెట్టేవారు ఆర్టీపీసీఆర్ నెగెటివ్ సర్టిఫికెట్‌ను అందజేయాల్సి ఉంటుంది. బెంగళూరులోని మాల్స్, సినిమా థియేటర్లలో డబుల్ డోస్ తీసుకున్న వారికి మాత్రమే ప్రవేశాన్ని కల్పించింది. వ్యాక్సిన్ వేసుకోని, సింగిల్ డోస్ టీకా తీసుకున్న వారిని షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లు, మల్టీప్లెక్స్‌లల్లో అనుమతించట్లేదు.












Click it and Unblock the Notifications