కరోనా థర్డ్ వేవ్.. సెకండ్ వేవ్ అంత ప్రభావం ఉండకపోవచ్చు, కానీ..: ఐసీఎంఆర్
పుణె: సెప్టెంబర్ నుంచి అక్టోబర్ నెలల మధ్య కాలంలో మనదేశంలో కరోనావైరస్ మూడో దశ ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని ఇప్పటికే అంచనా వేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ కరోనా థర్డ్ వేవ్.. సెకండ్ వేవ్ కన్నా.. తక్కువ ప్రభావాన్ని కలిగివుంటుందని భారత వైద్య పరిశోధన మండలి (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ -ఐసీఎంఆర్) వెల్లడించింది.

థర్డ్ వేవ్ ప్రభావం అంతగా ఉండకపోవచ్చు కానీ..
ఐసీఎంఆర్ ఎపిడమాలజీ, కమ్యూనికేబుల్ డిసీజెస్(ఈసీడీ) అధిపతి డాక్టర్ సమరిన్ పాండ్రా ఈ విషయంపై మాట్లాడారు. థర్డ్ వేవ్ మొత్తం దేశ వ్యాప్తంగా ఉండే అవకాశాలు కూడా లేవని ఆయన తెలిపారు. ఈ విషయాన్ని ఎవరూ కూడా చెప్పలేదన్నారు. పలు రాష్ట్రాలు, జిల్లాలకు మాత్రమే థర్డ్ వేవ్ పరిమితమయ్యే అవకాశం ఉందని ఆయన చెప్పారు. జిల్లాలు, రాష్ట్రాలకు సంబంధించిన నిర్దిష్ట డేటాను పరిశీలించిన అనంతరమే దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంటుందని డాక్టర్ సమరిన్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా ఆంక్షలను సడలించడం, ప్రజలు కూడా కరోనా నిబంధనలను పాటించకపోవడం లాంటి చర్యలతో కేసులు మరోసారి ఆ ప్రాంతాల్లో భారీగా పెరిగే అవకాశం ఉంటుందని తెలిపారు.

దేశ వ్యాప్తంగా ప్రభావం ఉండకపోచ్చు..
ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే కరోనా నిబంధనలను ఎవరూ పాటించడం లేదని తెలుస్తోందన్నారు డాక్టర్ పాండా. అయితే, వ్యాక్సిన్లు తీసుకోవడం వల్ల కొంత ఇమ్యూనిటీ పెరగడం, వైరస్ ప్రభావం సహజంగా తగ్గిపోవడం, మరోవైపు డెల్టా తీవ్ర ప్రభావం చూపడం, వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం లాంటి అంశాలు మూడో దశపై ప్రభావం చూపుతాయాన్నారు. కరోనా సెకండ్ వేవ్‌లో జిల్లాల వ్యాప్తంగా అత్యధిక కేసుల నమోదు, వ్యాప్తి ఉందని.. అయితే మూడో దశలో ఆ స్థాయిలో ప్రభావం ఉండకపోవచ్చని డాక్టర్ పాండా అభిప్రాయపడ్డారు.

పెరుగుతున్న కరోనా కేసులు.. ఆ ఒక్క రాష్ట్రంలోనే..
ఇది ఇలావుండగా, గత కొద్ది రోజులుగా దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. దేశంలో కేసులు పెరగడానికి ఒక్క కేరళ రాష్ట్రంలోనే అత్యధిక కేసులు నమోదు కావడం కారణంగా తెలుస్తోంది. తాజాగా, 24 గంటల వ్యవధిలో దేశ వ్యాప్తంగా 42,909 కొత్త కేసులు వెలుగుచూశాయి. ఇందులో దాదాపు 70 శాతం కేసులు ఒక్క కేరళ నుంచే ఉండటం గమనార్హం. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 14,19,990 మందికి పరీక్షలు నిర్వహించగా.. 42,909 మందికి కరోనా సోకినట్లు తేలింది. ముందురోజు కేసుల(45,083)తో పోలిస్తే నేడు కేసులు కాస్త తగ్గినప్పటికీ.. 40వేల పైనే ఉండటం ఆందోళనకలిగిస్తోంది. తాజా కేసులతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3.27 కోట్లకు చేరింది.

కేరళలో తగ్గని ఉధృతి.. పెరిగిన యాక్టివ్ కేసులు
కేరళలో కరోనా ఉధృతి ఆందోళనకరంగా మారింది. ఆదివారం కేరళలో 29,386 కొత్త కేసులు వెలుగుచూశాయి. దేశంలో నమోదైన మొత్తం కొత్త కేసుల్లో 69.5 శఆతం ఒక్క ఈ రాష్ట్రంలోనే ఉన్నాయి. అయితే, మరణాలు కాస్త తగ్గుముఖం పట్టాయి. నిన్న మరో 380 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో మరణాల సంఖ్య 4,38,210కు చేరింది. గత 24 గంటల్లో 34,763 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు మహమ్మారి నుంచి కోలుకున్నవారి సంఖ్య 3.19 కోట్లకు చేరింది. రికవరీ రేటు 97.51 శాతానికి చేరింది. కోలుకున్నవారి కంటే కొత్తగా నమోదైన కేసులే ఎక్కువగా ఉండటంతో యాక్టివ్ కేసుల్లో పెరుగుదల నమోదైంది. ప్రస్తుతం దేశంలో 3,76,324 యాక్టివ్ కేసులు ఉన్నాయి. పాజిటివిటీ రేటు 1.15 శాతంగా ఉంది. మరోవైపు దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. దేశంలో ఇప్పటి వరకు 63.43కోట్ల మందికిపైగా డోసులను పంపిణీ చేయడం జరిగింది.












Click it and Unblock the Notifications