కరోనా ఉపశమన మార్గదర్శకాలు ఇంకెప్పుడు: థర్డ్ వేవ్ కూడా ముగిశాకనా?: కేంద్రంపై సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: కరోనావైరస్ మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు పరిహారం అందించడంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిపై సుప్రీంకోర్టు శుక్రవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తాము ఆదేశాలు ఇచ్చినప్పటికీ పరిహారం, మరణ ధృవీకరణ పత్రాల జారీకి మార్గదర్శకాలు రూపొందించకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. మీరు(కేంద్రం) మార్గదర్శకాలు రూపొందించే నాటికి థర్డ్ వేవ్ కూడా ముగుస్తుందేమోననే ఘాటుగా స్పందించింది.
కరోనా మరణాలకు సంబంధించి మరణ ధృవీకరణ పత్రాల జారీ కోసం మార్గదర్శకాలను రూపొందించాలని చాలా రోజుల కిందటే ఆదేశాలు ఇచ్చామని, వాటిని ఇప్పటికే ఒకసారి పొడిగించినట్లు సుప్రీం తెలిపింది. కేంద్రం మార్గదర్శకాలు రూపొందించే నాటికి థర్డ్ వేవ్ కూడా ముగిసిపోతుందని జస్టిస్ ఎంఆర్‌షా, జస్టిస్ అనిరుద్ధ బోస్‌లతో కూడిన ధర్మాసనం కేంద్ర ప్రభుత్వం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది.

అంతేగాక, కరోనాతో మరణించిన బాధిత కుటుంబాలకు పరిహారం అందించాలని తాము జూన్ 30న ఇచ్చిన ఆదేశాలను కేంద్ర ప్రభుత్వం ఎందుకు అమలు చేయలేదని నిలదీసింది. ఆ గడువు సెప్టెంబర్ 8తో ముగియనున్న నేపథ్యంలో ఆ సమయంలోగా పరిహారం చెల్లింపుపై కేంద్రం ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉందని సుప్రీం బెంచ్ స్పష్టం చేసింది. వీటికి సంబంధించి సెప్టెంబర్ 11లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కోర్టు ఆదేశాలన్నీ ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని సుప్రీంకోర్టు ధర్మాసనానికి కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు.
ఇది ఇలావుండగా, భారతదేశంలో కరోనా కేసుల హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. గురువారం రెండు నెలల గరిష్టానికి చేరిన కొత్త కేసులు తాజాగా కాస్త తగ్గినట్లుగా కనిపిస్తున్నాయి. మరోపక్క కరోన థర్డ్ వేవ్ ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. గత 24 గంటల్లో భారతదేశంలో 45,352 కొత్త కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక రోజు 366 మరణాలు నమోదయ్యాయి. దీనితో, దేశం మొత్తం కేసుల సంఖ్య 3,29,03,289 కి పెరిగింది. దేశవ్యాప్తంగా మొత్తం మరణాల సంఖ్య 4,39,895 కి పెరిగింది.
గత 24 గంటల్లో 34,791 కరోనా మహమ్మారి బారినుండి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో కరోనా యాక్టివ్ కేసులు ఇప్పుడు 3,99,778 కి చేరుకున్నాయి. ప్రస్తుతం రికవరీ రేటు 97.45 శాతంగా ఉంది. ఇప్పుడు వరకు దేశవ్యాప్తంగా 3.20 కోట్ల మంది కరోనా మహమ్మారి బారినుంచి కోలుకున్నారు. రికవరీల కంటే కొత్త కేసులు పెరుగుతున్న తీరు భారతదేశానికి ఆందోళన కలిగిస్తుంది. క్రియాశీల కేసుల రేటు 1.22 శాతానికి చేరుకుంది. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం యుద్ధప్రాతిపదికన కొనసాగుతోంది. నిన్న74 .84 లక్షల మందికి వ్యాక్సిన్ డోసులు ఇచ్చారు. ఇప్పటివరకు మొత్తంగా 67.09కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
భారతదేశంలో నివేదించబడిన కొత్త కేసులు మరియు మరణాలలో, నిన్న కేరళలో 32,097 కేసులు మరియు 188 మరణాలు నమోదయ్యాయి. దేశంలో ప్రస్తుతం నమోదవుతున్న కేసుల్లో దాదాపు 80 శాతం కేసులు కేరళ రాష్ట్రం నుండి నమోదు కావడం గమనార్హం. కేరళ రాష్ట్రం తర్వాత మహారాష్ట్రలో గత 24 గంటల్లో 4342 కరోనా కేసులు నమోదయ్యాయి. 55 మంది కరోనా మహమ్మారి కారణంగా మృత్యువాత పడ్డారు ఇక ఆ తర్వాత తమిళనాడులో 1562 కరోనా కేసులు నమోదు కాగా, ఆంధ్రప్రదేశ్లో 1378, కర్ణాటక రాష్ట్రంలో 1240 కరోనా కేసులు నమోదయ్యాయి.












Click it and Unblock the Notifications