నా జీవితమంతా కష్టాలే... నిరాశ చెందడం లేదు: టికెట్ నిరాకరణపై బీహార్ మాజీ డీజీపీ
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నో చిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. డీజీపీ పదవికి రాజీనామా చేసి జేడీయూలో చేరిన మాజీ పోలీస్ బాస్ గుప్తేశ్వర్ పాండేకు చేదు అనుభవం ఎదురైంది. ఆయనకు జేడీయూ టికెట్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ క్రమంలోనే తన వెర్షన్ వినిపించారు గుప్తేశ్వర్ పాండే.
గత నెలలో డీజీపీ పదవి నుంచి స్వచ్చంధ పదవీవిరమణ చేసి జేడీయూలో చేరారు గుప్తేశ్వర్ పాండే. ఇక ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ నుంచి పోటీచేసే 115 మంది అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ ప్రకటించింది. ఇందులో గుప్తేశ్వర్ పాండే పేరు కనిపించకపోవడంతో ఒక్కింత షాక్‌కు గురయ్యారు. అయితే కొన్ని గంటల తర్వాత సర్ది చెప్పుకునే ప్రయత్నం చేశారు. ఇక జాబితాలో 11 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ నిరాకరించింది పార్టీ అధిష్టానం. గుప్తేశ్వర్ పాండేకు టికెట్ నిరాకరించడంపై ఆయనకు చాలామంది ఫోన్లు చేశారు. దీనిపై ఆయన వివరణ ఇచ్చారు.

ఎమ్మెల్యే టికెట్ తనకు ఇచ్చేందుకు నిరాకరించడం జరిగిందని తెలుసుకుని చాలామంది ఫోన్లు చేశారని గుప్తేశ్వర్ పాండే వెల్లడించారు. అయితే దీనిపై తానేమి నిరాశ చెందడం లేదని స్పష్టం చేశారు. తాను కచ్చితంగా ఎన్నికల్లో పోటీచేస్తానని అంతా భావించారని అయితే తాను పోటీ చేయడం లేదని చెప్పారు. దీనిపై ఎవరూ నిరుత్సాహంకు గురికావాల్సిన పనిలేదని అన్నారు. తన జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొని అధిగమించానని గుర్తుచేశారు గుప్తేశ్వర్ పాండే. తన జీవితం ప్రజాసేవకే అంకితం చేస్తానని వెల్లడించారు. ఓపిక వహించి తనకు ఫోన్లు చేయొద్దంటూ కోరారు. బీహార్ ప్రజలకు తన జీవితం అంకితం చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
తనకు జన్మనిచ్చిన బక్సర్ ప్రాంతానికి ఆ ప్రాంతంలోని తల్లులు, సోదరసోదరీమణులకు, యువతకు అన్ని వర్గాల వారికి ఎప్పుడూ రుణపడి ఉంటానని చెప్పిన గుప్తేశ్వర్ పాండే.. తనను ఆశీర్వదించాలని కోరుతూ ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. ఇప్పుడైతే ఎన్నికల్లో పోటీ చేయడం లేదని గుప్తేశ్వర్ గుప్తా చెప్పినప్పటికీ తాను మాత్రం బక్సర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టికెట్‌ను ఆశించినట్లు తెలుస్తోంది. అయితే ఈ సారి బీజేపీతో జతకట్టడంతో బక్సర్ స్థానం బీజేపీకి దక్కింది. బక్సర్ నుంచి బీజేపీ అభ్యర్థి పర్షురామ్ చతుర్వేది బరిలోకి దిగారు.