జమ్మూకాశ్మీర్ ను ఆ మూడు కుటుంబాలే దోచుకున్నాయి: అమిత్ షా
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్ ఎన్నికల ప్రచారంలో దూకుడు చూపిస్తోంది. ఇప్పటికే పలువురు కేంద్రమంత్రులు, బీజేపీ నేతలు జమ్మూకాశ్మీర్‌లో పర్యటిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. తొలి జాబితాతోపాటు మేనిఫెస్టోను కూడా బీజేపీ విడుదల చేసింది. తాజాగా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు గుప్పిస్తూనే కీలక వ్యాఖ్యలు చేశారు.
అసెంబ్లీ ఎన్నికల తర్వాత జమ్మూకాశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. కేంద్రంలోని మోడీ సర్కార్ ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత దేశ జాతీయ జెండా, రాజ్యాంగం కింద జమ్మూకాశ్మీర్‌లో మొదటిసారి ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. కాంగ్రెస్- నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు.

బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తూ అమిత్ షా శనివారం జమ్మూలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్డీఏ సర్కార్ ఉగ్రవాదాన్ని పునురుద్ధరణను అనుమతించదని తేల్చి చెప్పారు. బీజేపీ ప్రభుత్వం కల్పించిన రిజర్వేషన్లతో గుజ్జర్లు, పహారీలు, బకర్ వాల్లు, దళితులతో సహా ఏ వర్గానికి అన్యాయం జరగదని స్పష్టం చేశారు. జమ్మూకాశ్మీర్ లో రాబోయే ఎన్నికలు చారిత్రకమైనవన్నారు. ఎందుకంటే స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మొదటిసారి భారత జాతీయ జెండా, రాజ్యాంగం కింద మొదటిసారి ఎన్నికలు జరుగుతున్నాయని వివరించారు.
గతంలో రెండు జెండాలు, రెండు రాజ్యాంగాల ఆధారంగా జమ్మూకాశ్మీర్ లో ఎన్నికలు జరిగేవని తెలిపారు. ప్రస్తుతం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఒకరే ప్రధాని.. ఆయనే నరేంద్ర మోడీ అని అమిత్ షా వ్యాఖ్యానించారు.
మరోవైపు, నేషనల్ కాన్ఫరెన్స్-కాంగ్రెస్ కూటమిపై అమిత్ షా విమర్శలు గుప్పించారు. జమ్మూకాశ్మీర్‌లో ఎన్డీఏ సర్కార్ 70 శాతం ఉగ్రవాద ఘటనలను తగ్గించిందని తెలిపారు.
అయితే మరోసారి జమ్మూకాశ్మీర్‌ను ఉగ్రవాద ఊబిలోని నెట్టడానికి ఎన్‌సీ- కాంగ్రెస్ కూటమి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఈ కూటమి ఎప్పటికీ జమ్మూకాశ్మీర్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదన్నారు. జమ్మూకాశ్మీర్ తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని పార్టీ కార్యకర్తలకు అమిత్ షా పిలుపునిచ్చారు.
పీడీపీతో కలిసి ఎన్‌సీ, కాంగ్రెస్ కూటమి ఈ ప్రాంతాన్ని ఉగ్రవాద మంటల్లోకి నెట్టేందుకు ప్రయత్నించిందని అమిత్ షా ఆరోపించారు. ఆ మూడు కుటుంబాలే జమ్మూకాశ్మీర్‌ను దోచుకున్నాయని ధ్వజమెత్తారు. ప్రజల హక్కులను కాలరాయడమే లక్ష్యంగా పెట్టుకున్నాయని మండిపడ్డారు. ఆ కూటమి ఒకవేళ అధికారంలోకి వస్తే ఉగ్రవాదం మళ్లీ విజృంభిస్తుందని హెచ్చరించారు. బీజేపీ అధికారంలో ఉంటే టెర్రరిజాన్ని నాశనం చేస్తుందన్నారు. అంతేగాక, ఉగ్రవాదం అంతమయ్యేవరకు పాకిస్థాన్‌తో చర్చలు ఉండవని అమిత్ షా తేల్చి చెప్పారు.












Click it and Unblock the Notifications