టిట్ ఫర్ టాట్: భారత్‌కు వచ్చే బ్రిటన్ పౌరులకు 10 రోజుల క్వారంటైన్, మూడుసార్లు కరోనా టెస్టులు
న్యూఢిల్లీ: భారత్‌లో తీసుకున్న కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను గుర్తించడం లేదన్న బ్రిటన్‌కు గట్టి షాక్ తగిలింది. కోవిషీల్డ్ రెండు డోసులు తీసుకున్నప్పటికీ భారత్ నుంచి బ్రిటన్ వెళ్లే వారికి 10 రోజుల క్వారంటైన్ తప్పనిసరి అంటూ అక్కడి అధికారులు నిబంధనలు పెట్టిన విషయం తెలిసిందే. ఈ నిబంధనలను భారత్ తీవ్రంగా ఖండించింది. వివక్షపూరితంగా ఉందని మండిపడింది.
ఈ విషయంలో వెనక్కి తగ్గకపోతే ధీటుగా స్పందిస్తామని ఇప్పటికే హెచ్చరించిన భారత్.. అన్నంత పనిచేసింది. వెనక్కి తగ్గకపోవడంతో.. బ్రిటన్ నుంచి భారత్ వచ్చే పౌరులపైనా ఆంక్షలు విధంచాలని భారత్ నిర్ణయించింది. ఇందులో భాగంగా బ్రిటన్ పౌరులను 10 రోజులు క్వారంటైన్‌లో ఉంచడంతోపాటు మూడు సార్లు కోవిడ్ పరీక్షలు వంటి ఆంక్షలు అమలు చేయనుంది.

అక్టోబర్ మొదటి వారం నుంచే ఈ నిబంధనలు అమల్లోకి రానున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అక్టోబర్ 4వ తేదీ నుంచి భారత్‌కు వచ్చే బ్రిటన్ పౌరులు 3 ఆర్టీ పీసీఆర్ రిపోర్టులు తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుంది. ప్రయాణానికి 72 గంటల ముందు ఒకసారి, ఎయిర్ పోర్టుకు చేరుకున్న తర్వాత మరోసారి, అనంతరం 8వ రోజు ఇలా మొత్తంగా మూడుసార్లు కరోనా పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది.
భారత్‌కు చేరుకున్న తర్వాత ఇంటి వద్ద/హోటల్‌లో 10 రోజులపాటు తప్పనిసరిగా క్వారంటైన్ లో ఉండాలి. వ్యాక్సిన్ తీసుకున్నారా? లేదా అనే విషయంతో సంబంధం లేకుండా బ్రిటన్ పౌరులకు ప్రతి ఒక్కరికీ ఈ నిబంధనలు పాటించాల్సిందేనని కేంద్ర ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి.
కాగా, ఆస్ట్రాజెనికా, ఫైజర్-ఎన్ బోటెక్, మోడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్ టీకాలను మాత్రమే గుర్తిస్తున్నట్లు బ్రిటన్ ప్రభుత్వం పేర్కొంది. దీంతో భారత్‌లో తయారయ్యే కోవిషీల్డ్ టీకాను గుర్తించడం లేదని నిబంధనల్లో పేర్కొనడం వివాదాస్పదమైంది. ఇలాంటి నిబందనలు వివక్షపూరితమైనవేనని భారత ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. బ్రిటన్ నిబందనలు ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు, గందరగోళానికి దారితీశాయని సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదర్ పూనావాలా వెల్లడించారు. బ్రిటన్ నిబంధనలకు తాజాగా భారత్ నిబంధనలు విధించడం టిట్ ఫర్ ట్యాట్ అని అంటున్నారు విశ్లేషకులు. ఇప్పుడైనా బ్రిటన్ దిగివస్తుందో లేదో చూడాలి.
Recommended Video
ఇది ఇలావుండగా, దేశంలో కరోనా వైరస్ కేసులు స్వల్పంగా పెరుగుతున్నాయి. కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల వ్యవధిలో దేశ వ్యాప్తంగా 15,20 లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 26,727 మందికి కరోనావైరస్ సోకినట్లు తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3.37 కోట్ల చేరింది. గురువారం 277 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు దేశంలో మరణించినవారి సంఖ్య 4,48,339కి చేరింది. గురువారం 28,246 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 3.30కోట్లకు చేరింది. ప్రస్తుతం రికవరీ రేటు 97.86 శాతానికి పెరిగింది. ప్రస్తుతం దేశంలో 2,75,224 యాక్టివ్ కేసులున్నాయి. పాజిటివిటీ రేటు 0.82 శాతానికి తగ్గింది. గురువారంనాడు 64.40 లక్షల మంది కరోనా టీకా వేయించుకున్నారు. దీంతో ఇప్పటి వరకు టీకా తీసుకున్నవారి సంఖ్య 89.02 కోట్లకు చేరింది. మరోవైపు కేరళలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. గురువారం కేరళలో దేశంలో సగానికిపైగా అంటే 15,914 కొత్త కేసులు నమోదు కాగా, 122 మరణాలు సంభవించాయి.












Click it and Unblock the Notifications