బెంగాల్లో సీబీఐ వర్సెస్ మమత-సీబీఐ ఆఫీసుపై రాళ్లదాడి-తనను అరెస్టు చేయాలన్న సీఎం
పశ్చిమబెంగాల్లో 2016లో జరిగిన నారదా స్టింగ్ ఆపరేషన్ కేసులో ఇద్దరు బెంగాల్ మంత్రులను సీబీఐ అరెస్టు చేయడం ఇవాళ తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. మంత్రులు పిర్హద్ హకీమ్, సుబ్రతా ముఖర్జీ, ఎమ్మెల్యే మదన్ మిత్రా అరెస్టుతో సీఎం మమతా బెనర్జీ భగ్గుమన్నారు. మంత్రుల అరెస్టును సీబీఐ ప్రకటించిన కొద్ది గంటల్లోనే కోల్‌కతాలోని సీబీఐ కార్యాలయం నిజాం ప్యాలెస్‌కు చేరుకున్న మమతా బెనర్జీ చేతనైతే తనను అరెస్టు చేయాలని సీబీఐకి సవాల్ విసిరారు.

బెంగాల్లో కాక రేపిన మంత్రుల అరెస్టు
పశ్చిమబెంగాల్లో ఎప్పుడో జరిగిన నారదా స్టింగ్ ఆపరేషన్ కేసులో హైకోర్టు ఆదేశాల మేరకు విచారణ జరుపుతున్న సీబీఐ ఇవాళ మమతా బెనర్జీ కేబినెట్‌లోని ఇద్దరు మంత్రులు ఫిర్హద్ హకీమ్, సుబ్రతో ముఖర్జీతో పాటు ఎమ్మెల్యే మదన్ మిత్రా, కోల్‌కతా మాజీ మేయర్ సోవన్ ఛటర్జీని అరెస్టు చేయడం తీవ్ర కలకలం రేపింది. ఈ అరెస్టులతో రాష్ట్రంతో పాటు మమతా ప్రభుత్వంలోనూ కలకలం రేగింది. దీంతో మంత్రుల అరెస్టుపై అధికార టీఎంసీ విరుచుకుపడింది.

సీబీఐ కార్యాలయంపై రాళ్లదాడి
బెంగాల్ కేబినెట్లో ఇద్దరు మంత్రులతో పాటు ఓ ఎమ్మెల్యే కూడా అరెస్టు కావడంతో టీఎంసీ శ్రేణులు రెచ్చిపోయాయి. సీబీఐ కార్యాలయం వద్దకు భారీగా చేరుకున్నాయి. సీబీఐ, కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడమే కాకుండా రాళ్ల దాడికి దిగాయి. దీంతో పరిస్ధితులు తీవ్ర ఉద్రిక్తంగా మారాయి. అయితే ఈ పరిస్దితిని ముందుగానే ఊహించిన సీబీఐ అధికారులు తమ కార్యాలయం లోపల, బయట భారీ భద్రత ఏర్పాటు చేశాయి. కేంద్ర బలగాలను అక్కడ మోహరించి టీఎంసీ శ్రేణుల్ని అదుపుచేసేందుకు ప్రయత్నించాయి.

బెంగాల్ సీబీఐ కార్యాలయానికి మమత
తన కేబినెట్‌లోని ఇద్దరు మంత్రులతో పాటు అధికార పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే, మాజీ మేయర్ అరెస్టుపై మమత భగ్గుమన్నారు. విషయం తెలియగానే కోల్‌కతాలోని సీబీఐ కార్యాలయం ఉన్న నిజాం ప్యాలెస్‌కు చేరుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్ధితులు ఏర్పడ్డాయి. సీబీఐ కార్యాలయానికి వచ్చిన మమతకు లోపలోకి వెళ్లేందుకు అధికారులు అనుమతించలేదు. దీంతో ఆమె కార్యాలయం వద్దే చేతనైతే తనను అరెస్టు చేయాలని సీబీఐ అధికారులకు, కేంద్రానికీ సవాల్ విసిరారు.
Recommended Video

టీఎంసీపై గవర్నర్, బీజేపీ ఫైర్
బెంగాల్ మంత్రులను సీబీఐ అరెస్టు చేసిన నేపథ్యంలో చోటు చేసుకున్న పరిణామాలపై గవర్నర్ జగ్‌దీప్ ధన్‌కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీబీఐ కార్యాలయానికి సీఎం మమత వెళ్లడంపై స్పందిస్తూ అసలు రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా అమల్లో ఉందా అని ప్రశ్నించారు. కోల్‌కతా సీబీఐ కార్యాలయంపై టీఎంసీ కార్యకర్తలు రాళ్లు విసురుతుంటే కోల్‌కతా పోలీసులు, బెంగాల్ పోలీసు ఛీఫ్ ఏం చేస్తున్నారని గవర్నర్ ప్రశ్నించారు. అటు రాష్ట్రంలో హింసను ప్రేరేపిస్తున్నారని బీజేపీ ఎంపీ దిలీప్ ఘోష్ సీఎం మమతా బెనర్జీపై స్ధానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తాజా పరిణామాల నేపథ్యంలో టీఎంసీ కార్యకర్తలు సంయమనం పాటించాలని టీఎంసీ ఎంపీ, మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ కోరారు.












Click it and Unblock the Notifications