బీజేపీలోకి చేరనున్నట్లు వార్తలు: ఖండించిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ త్రివేది
న్యూఢిల్లీ: తాను బీజేపీలోకి చేరుతున్నానంటూ వచ్చిన వార్తలపై తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నేత దినేశ్ త్రివేది స్పందించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. రూమర్స్ అన్ని సమయాల్లో నిజాలు కావని అన్నారు. మంచి పని చేసిన వారిని పొగడటం తప్పేం కాదని అన్నారు.
తనపై తప్పుడు వార్తలు సృష్టించవద్దని హెచ్చరిక జారీ చేశారు. దేశంలో మదిలో నన్ను పెద్ద వాడిగా భావిస్తున్నారు, కానీ మోడీ, మమతా బెనర్జీ కంటే కాదని అన్నారు. ప్రతి ఒక్కరూ కలిసి ముందుకు సాగాల్సిన తరుణం వచ్చిందని అన్నారు.
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, కేంద్ర మాజీ రైల్వే శాఖ మంత్రి దినేశ్ త్రివేది... దీదీపై అసంతృప్తితో బీజేపీలోకి చేరనున్నట్లు మీడియాలో వార్తలు రావడంతో ఆయన వెంటనే స్పందించారు. 64 ఏళ్ల దినేశ్ త్రివేది పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కత్తా కి సమీపంలో ఉన్న బర్కాపూర్ నియోజక వర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి పార్టీ మెంబర్‌గా కొనసాగుతున్నారు. భారత మాజీ ప్రధాని మన్మోహాన్ సింగ్ ప్రభుత్వ హయాంలో కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా పనిచేశారు. 2012 రైల్వే బడ్జెట్‌లో రైల్వే ఛార్జీలను పెంచినందుకు గాను మరుక్షణమే తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఆదేశాలతో రాజీనామా చేశారు.
గత శుక్రవారం ఆమె కేబినెట్‌లోని మంత్రి మంజుల్ కృష్ణ థాకూర్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలోకి చేరిన విషయం తెలిసిందే. శారదా చిట్‌ఫండ్ స్కాంలో తృణమూల్ కాంగ్రెస్ నేతలను అరెస్టు చేసినప్పటి నుంచి పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications