రాజ్యసభ ఎన్నికలకు ఆరుగురితో టీఎంసీ జాబితా..డెరెక్ ఓబ్రెయన్, సాకేత్ గోఖలేకు చోటు..
ఈ నెలాఖరులో జరిగే రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలకు ఆరుగురు అభ్యర్ధులతో కూడిన జాబితాను తృణమూల్ కాంగ్రెస్ ఇవాళ విడుదల చేసింది. ఇందులో పార్టీ సీనియర్ నేత డెరెక్ ఓబ్రెయిన్ కు మరోసారి అవకాశం కల్పించింది. అలాగే పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్న ఆర్టీఐ కార్యకర్త సాకేత్ గోఖలేకు కూడా అవకాశమిచ్చింది. మిగతా వారిలో సుఖేందు శేఖర్ రాయ్, డోలా సేన్, సమీరుల్ ఇస్లాం, ప్రకాష్ చిక్ బరేక్ ఉన్నారు.
ఇవాళ విడుదల చేసిన టీఎంసీ జాబితాలో ఉన్న రాజ్యసభ అభ్యర్థులలో డెరెక్ ఓబ్రెయిన్ 2011 నుంచి ఎంపీగా ఉన్నారు. అలాగే రాజ్యసభలో టీఎంసీ పక్షనేతగా కూడా ఉన్నారు. సుఖేందు శేఖర్ రే 2012లో రాజ్యసభకు ఎంపికయ్యారు. అలాగే రాజ్యసభలోపార్టీ డిప్యూటీ విప్ గా ఉన్నారు. డోలా సేన్ 2017 నుంచి రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. ఈ ముగ్గురికి మమతా బెనర్జీ మరోసారి ఎంపీలుగా ఎన్నికయ్యే అవకాశం కల్పించారు.

ఈసారి కొత్తగా రాజ్యసభ టికెట్లు ఇస్తున్న వారిలో బంగ్లా సంస్కృతి మంచా అధ్యక్షుడు సమీరుల్ ఇస్లాం, టీఎంసీ అలీపుర్‌దూర్ జిల్లా అధ్యక్షుడు ప్రకాశ్ చిక్ బరైక్, ఆర్టీఐ కార్యకర్త, టీఎంసీ అధికార ప్రతినిధి సాకేత్ గోఖలే ఉన్నారు. రాజ్యసభలో ఓబ్రెయిన్ తో పాటు సుఖేందు శేఖర్ రే, డోలా సేన్‌లతో పాటు, కాంగ్రెస్ ఎంపీ ప్రదీప్ భట్టాచార్య, టీఎంసీ అస్సాం నేత సుస్మితా దేవ్, డార్జిలింగ్ నేత శాంతా ఛెత్రీల పదవీకాలం ముగియడంతో ఈ ఆరు స్థానాలు ఖాళీ అయ్యాయి.
గోవా మాజీ ముఖ్యమంత్రి లూయిజిన్హో ఫలేరో ఏప్రిల్‌లో టీఎంసీ ఎంపీ పదవికి రాజీనామా చేసిన తర్వాత పశ్చిమ బెంగాల్ నుండి ఏడవ రాజ్యసభ స్థానం కూడా ఖాళీగా ఉంది. జూలై 24న ఈ ఆరు స్థానాలకు జరిగే ఎన్నికలతో పాటు ఆ స్థానంలో ఉప ఎన్నిక జరగనుంది. ఈసారి రాజ్యసభ ఎన్నికల్లో డెరెక్ ఓబ్రెయిన్, డోలా సేన్, సుఖేందు శేఖర్, సమీరుల్ ఇస్లాం, ప్రకాష్ చిక్ బరాక్, సాకేత్ గోఖలే ను పార్టీ అభ్యర్ధులుగా ఎంపిక చేయడం సంతోషంగా ఉందని టీఎంసీ ఓ ట్వీట్ లో వెల్లడించింది.












Click it and Unblock the Notifications