ఎంత ధైర్యం: శశికళలను కలుస్తారా , గవర్నర్ నోటీసులు
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత తరువాత అంతటి స్థానంలో కుర్చోవాలని ఆశలు పెట్టుకున్న శశికళకు అన్ని వైపుల నుంచి ప్రతికూల పరిస్థితులు ఎదురౌతున్నాయి. ఇప్పుడు శశికళను కలుసుకున్న తమిళనాడు వైస్ చాన్సలర్లు (వీసీలు) చిక్కుల్లోపడ్డారు.
జయలలిత మరణించిన తరువాత ఆమె స్నేహితురాలైన శశికళ పోయెస్ గార్డెన్ లో ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల 11 మంది వైస్ చాన్సలర్లు పోయెస్ గార్డెన్ చేరుకుని శశికళను కలుసుకుని పలు విషయాలపై చర్చించారు.
ఇప్పుడు ఈ 11 మంది వైస్ చాన్సలర్లకు శశికళను ఎందుకు కలిశారు అంటూ వివరణ కోరుతూ తమిళనాడు రాష్ట్ర గవర్నర్ కార్యాలయం నోటీసులు పంపించింది. రాజకీయపరంగా, ప్రభుత్వ పరంగా ఏ పదవిలో లేని శశికళను మీరు ఎందుకు కలిశారు ? అని సమాదానం ఇవ్వాలని సూచించారు.

వైస్ చాన్సలర్లు అందరూ కలిసి పోయెస్ గార్డెన్ చేరుకుని శశికళను కలవడంతో తమిళనాడులో పెద్ద ఎత్తున విమర్శలు తలెత్తాయి. తమిళనాడు ప్రతిపక్ష నాయకులు స్టాలిన్, పీఎంకే వ్యవస్థాపకుడు రాందాస్, వామపక్షాల నాయకులు శశికళను కలిసిన వైస్ చాన్సలర్లను వెంటనే డిస్మిస్ చెయ్యాలని డిమాండ్ చేశారు.
తమిళనాడు శాసన సభలో ప్రతిపక్ష నాయకుడు స్టాలిన్ ఈ విషయంపై గవర్నర్ కార్యాలయానికి స్వయంగా లేఖ రాశారు. రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాలకు చాల్సలర్ గా ఉన్న గవర్నర్ ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని స్టాలిన్ మనవి చేశారు.
ఈ విషయంలో గవర్నర్ కార్యాలయం ముందడుగు వేసింది. శశికళను వైస్ చాన్సలర్లు ఎందుకు కలుసుకున్నారో చెప్పాలని ఉన్నత విద్యాశాఖకు, వైస్ చాన్సలర్లకు రాజ్ భవన్ అధికారులు నోటీసులు జారీ చేశారని సచివాలయ అధికారులు తెలిపారు. మొత్తం మీద శశికళను ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నించిన వైస్ చాన్సలర్లు ఇప్పుడు చిక్కుల్లోపడ్డారు.












Click it and Unblock the Notifications