ఎన్‌కౌంటర్: ఇద్దరు టాప్ లష్కరే తొయిబా ఉగ్రవాదులు హతం
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో భద్రతా దళాలు-ఉగ్రవాదులకు మధ్య సోమవారం భీకర ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో లష్కరే తొయిబా ఆధ్వర్యంలో నడిచే ది రిసిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్)కి చెందిన ఇద్దరు కమాండర్లు హతమయ్యారు.
మృతులను టీఆర్ఎఫ్ చీఫ్ అబ్బాస్ షేక్, అతడి సహాయకుడు సాకిబ్ మంజూర్‌గా గుర్తించినట్లు కాశ్మీర్ ఐజీ విజయ్ కుమార్ వెల్లడించారు. ఈ ఆపరేషన్ భద్రతా బలగాలకు దక్కిన భారీ విజయమని పేర్కొన్నారు. వీరిద్దరి ఆచూకీపై అందిన సమాచారంతో అలాచీ బాగ్‌లో ఆపరేషన్ చేపట్టినట్లు విజయ్ కుమార్ తెలిపారు.
పది మంది జవాన్లు సాధారణ దుస్తుల్లో వెళ్లి వారిని చుట్టుముట్టారని.. ఈ క్రమంలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారని చెప్పారు. ప్రతిగా భద్రతా బలగాలు కూడా కాల్పులు జరిపి.. ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టాయని తెలిపారు.

గతంలో హిజ్బుల్ ముజాహిదీన్‌తో కలిసి పనిచేసిన అబ్బాస్ షేక్.. రెండేళ్ల క్రితమే టీఆర్ఎఫ్‌లోకి చేరాడు. ఇక మన్సూర్.. గత ఏడాది టీఆర్ఎఫ్‌లో చేరేనాటికి పోస్ట్ గ్రాడ్యూయేట్ విద్యార్ఠి. శ్రీనగర్‌లోనూ, నగరం బయట జరిగిన పలువురు హత్యల్లో వీరిద్దరి ప్రేమయం ఉందన్నారు ఐజీ విజయ్ కుమార్. అంతేగాక, ఉగ్రవాదంలో చేరేలా యువతను ఉసిగొల్పుతున్నారని తెలిపారు. తమ పిల్లలు ఉగ్రవాదుల్లో చేరకుండా నిరోధించాలని తాము ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఇప్పటికే ఎవరైనా ఉగ్రవాదుల్లో చేరితే.. తిరిగి జనజీవన స్రవంతిలోకి తీసుకురావాలని.. ఇలా వస్తే తాము స్వాగతిస్తామని ఐజీ తెలిపారు.
రెండ్రోజుల క్రితం జరిగిన ఎదురుకాల్పుల్లోనూ భద్రతా దళాలు ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. జమ్మూకాశ్మీర్‌లోని రాజౌరిలో గత శుక్రవారం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. కాశ్మీర్‌లోని రాజౌరీ ప్రాంతంలోని థనామండి అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు దాక్కున్నారన్న సమాచారంతో స్థానిక పోలీసులు, భద్రతా బలగాలు సంయుక్త ఆపరేషన్ నిర్వహించాయి.
Recommended Video
ఈ ప్రాంతంలో తనిఖీలు నిర్వహిస్తుండగా.. ఉగ్రవాదులు బలగాలపైకి కాల్పులు జరిపారు. అనంతరం పోలీసులు జరిపిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమైనట్లు జమ్మూకాశ్మీర్ పోలీసులు వెల్లడించారు. కాగా, థానమండి పట్టణానికి దాదాపు 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న పంగై అటవీ ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు. కాగా.. గత కొంతకాలంగా కాశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకాలాపాలను అరికట్టేందుకు బలగాలు ముమ్మరంగా శ్రమిస్తున్నాయి. దీనిలో భాగంగా రాష్ట్రంలోని ప్రాంతాల్లో భారీగా తనిఖీలు చేపడుతున్నాయి.












Click it and Unblock the Notifications