కొంపముంచిన గూగుల్ మ్యాప్.. నదిలో కొట్టుకుపోయిన కారు.. 9 మంది గల్లంతు..
సాంకేతికత పెరుగుతున్న కొద్ది సమస్యల పరిష్కారం సులభతరంగా మారుతుంది. అత్యాధునిక సాంకేతికత సాయంతో పలు రంగాల్లో అద్భుతాలు చేస్తున్నారు. అయితే అదే మారుతున్న సాంకేతికత ఒక్కోసారి ప్రజల ప్రాణాల్ని హరిస్తుంది. అలాంటి ఘటనే తాజాగా వెలుగులోకి వచ్చింది. చాలా మంది ప్రయాణికులు సుదూర ప్రాంతాలు, తెలియని కొత్త ప్రాంతాలకు వెళ్లేముందు గూగుల్ మ్యాప్స్ ఆన్ చేసుకుంటారు. ఆ మ్యాప్ ఆధారంగా ప్రయాణం చేస్తారు. కానీ ఒక్కోసారి సాంకేతికతలో లోపం కారణంగా ప్రయాణికులు సమస్యల్లో చిక్కుకుంటున్నారు. కొన్నిసార్లు ఏకంగా ప్రాణాలు కూడా కోల్పోతున్నారు.
రాజస్థాన్ లోని చిత్తోర్ గఢ్ జిల్లాలో ఈ షాకింగ్ ఘటన జరిగింది. గూగుల్ మ్యాప్స్ ను ఫాలో అయిన ఓ ఫ్యామిలీ ఇప్పుడు గల్లంతయింది. వాళ్లు ప్రయాణిస్తున్న కారు గోతిలో పడిపోయింది. ఆ తర్వాత నీటి ప్రవాహానికి కొట్టుకుపోయింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న 9 మంది గల్లంతు అయినట్లు సమాచారం. పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. నఖేడ గ్రామానికి చెందిన ఓ కుటుంబం మంగళవారం (ఆగస్టు 26) భిల్వారాలోని సవాయిభోజ్ ప్రాంతానికి వెళ్లింది. అదే రోజు రాత్రి తిరుగు ప్రయాణం అయింది. అయితే త్వరగా తమ గమ్య స్థానానికి చేరుకునేందుకు గూగుల్ మ్యాప్ ఆన్ చేశారు. అయితే గూగుల్ మ్యాప్ తప్పుగా చూపించింది. దాన్ని గుడ్డిగా నమ్మిన ఆ కుటుంబం బనాస్ నదిపై ఉన్న సోమి - ఉప్రెడా కల్వర్టు పైకి కారు వెళ్లింది. దీంతో ప్రమాదవశాత్తు కారు అక్కడే ఉన్న గోతిలో పడిపోయింది. దీంతో వరద నీటి ప్రవాహానికి కారు కొట్టుకుపోయింది.

కొంత సమయం తర్వాత నీటి ప్రవాహంలో చిక్కుకున్న ఆ కుటుంబ సభ్యులు కేకలు వేశారు. ఇది విన్న స్థానికులు ఐదుగురిని రక్షించారు. మరో నలుగురు నీటిలోనే గల్లంతయ్యారు. గల్లంతు అయినవారిలో ఇద్దరు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో కారులో మొత్తం 9 మంది ఉన్నారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు గల్లంతైన వారికోసం సహాయక చర్యలు చేపట్టారు. గల్లంతైన వారి ఆచూకి కోసం గాలిస్తున్నారు.












Click it and Unblock the Notifications