Indian Railways: రైలుకూ తప్పని రోడ్డు ట్రాఫిక్ కష్టాలు.. ఇన్‌స్టాలో వైరల్‌గా మారిన పోస్ట్.. రైల్వేశాఖ వివరణ
Bangalore News: సామాన్యుల నుంచి శ్రీమంతుల వరకు దేశంలో హాయిగా ప్రయాణించే సాధనాలు రైళ్లు. అంతకంతకూ పెరుగుతున్న జనాభాకు సరిపోయే విధంగా ఎప్పటికప్పుడు కొత్త రైళ్లను, రైలు మార్గాలను ప్రవేశపెడుతూ విజయవంతంగా రైల్వే వ్యవస్థ పరుగులు పెడుతోంది. సాధారణంగా రైలు వెళ్లే సమయంలో గేటు వేసి రోడ్లపై వాహనాలను నిలిపివేయడం జరుగుతుంది. అయితే ఇటీవల కర్ణాటకలో అందుకు విరుద్ధంగా ఓ విచిత్రం జరిగినట్లు మీడియా నివేదికలు తెలిపాయి.
మున్నెకోలాల రైల్వే గేట్ వద్ద రోడ్డు ట్రాఫిక్‌లో రైలు చిక్కుకుపోయిందని పేర్కొంటూ బెంగళూరుకు చెందిన ఓ ఇన్‌స్టాగ్రామర్ వీడియోను షేర్ చేశారు. రోడ్డుపై వాహనాలు కదలకపోవడంతో రైలు నిలిచిపోయిందంటూ సుధీర్ చక్రవర్తి అనే యూజర్ ఇన్‌స్టాలో వీడియో అప్‌లోడ్ చేశారు. 'కేవలం బెంగళూరులో మాత్రమే సాధ్యమైంది. నేను, మీరు మాత్రమే కాదు రైళ్లు కూడా బెంగళూరు ట్రాఫిక్ నుంచి తప్పించుకోలేవు' అని దానికి క్యాప్షన్ జతచేశారు.

ఇదికాస్తా విచిత్రంగా అనిపించడంతో నెట్టింట వైరల్‌గా మారింది. అయితే ట్రాఫిక్ వల్ల కాదని కేవలం సాంకేతిక లోపం వల్లనే రైలును నిలిపివేశామని సౌత్ వెస్ట్ రైల్వే చివరకు వివరణ ఇవ్వాల్సి వచ్చింది. దానిని తర్వాత పునరుద్ధరించామని స్పష్టం చేసింది. ఇరువైపులా రద్దీగా ఉన్న ట్రాఫిక్‌ను నియంత్రించడానికి గేట్లు తెరిచినట్లు పేర్కొనడంతో కథ సుఖాంతమైంది. అనంతరం ఆ వీడియోను ఇన్‌స్టా నుంచి తొలగించారు.
'రైలు నెం 12557ని LC 133 కంటే ముందు BPHI (బైయ్యప్పనహళ్లి)- CRLM (కర్మేలారం) మధ్య సిబ్బంది రేక్‌ని తనిఖీ చేయడం కోసం నిలపాల్సి వచ్చింది. అసిస్టెంట్ లోకో పైలట్ మరియు ట్రైన్ మేనేజర్‌కి శబ్దం వినిపించడంతో లోకో పైలట్ రైలును ఆపారు. అంతేకాని ట్రాఫిక్ జామ్ కారణంగా రైలు ఆగలేదు' అని సౌత్ వెస్ట్ రైల్వే ప్రకటించింది. అయితే ఈ వీడియో నగరంలోని ట్రాఫిక్ సమస్యలతో పాటు రోడ్ ఓవర్ బ్రిడ్జిల (ROB) ఆవశ్యకతను హైలైట్ చేసింది.












Click it and Unblock the Notifications