ఈ రూట్‌లో నమో భారత్ ట్రయల్ రన్
Namo Bharat express: దేశీయ రైల్వే నెట్‌వర్క్‌లో కీలక మార్పులు చోటు చేసుకుంటోన్నాయి. వందే భారత్‌తో దీనికి తెర తీసింది కేంద్ర ప్రభుత్వం. ఈ సెమీ హైస్పీడ్ ఎక్స్‌ప్రెస్‌కు అనూహ్య స్పందన లభిస్తోన్న నేపథ్యంలో- రైల్వేల్లో మరిన్ని ప్రయోగాలకు శ్రీకారం చుట్టింది.
తాజాగా మరిన్ని సెమీ హైస్పీడ్ రైళ్లు పట్టాలెక్కనున్నాయి. రీజినల్ రైళ్లు ఇవి. దూర ప్రాంతాల మధ్య ఇవి రాకపోకలు సాగించవు. మల్టీ మోడల్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్ (ఎంఎంటీఎస్) తరహాలో రీజనల్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (ఆర్‌ఆర్టీఎస్) కారిడార్‌లలో మాత్రమే ఈ రైళ్లు పరుగులు పెట్టనున్నాయి.

ఇవి రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలో ఉండవు. వీటిని పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్‌ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తొలి సెమీ హైస్పీడ్ ఆర్ఆర్టీఎస్ రైలు ఇదివరకే ఢిల్లీ-ఘజియాబాద్-మీరట్ రీజియన్ పరిధిలో అందుబాటులోకి వచ్చింది. 82 కిలోమీటర్ల కారిడార్ ఇది.
మొదట్లో ఈ రైలుకు ర్యాపిడ్ ఎక్స్ అని పేరు పెట్టారు. ఎన్సీఆర్టీసీ ఈ రైలు సర్వీసులను పర్యవేక్షిస్తుంది. దేశంలో ఆర్ఆర్టీఎస్ వ్యవస్థ కింద ప్రవేశపెట్టబోయే మొట్టమొదటి సెమీ హైస్పీడ్ ఎక్స్‌ప్రెస్ ఇదే. ర్యాపిడ్ ఎక్స్ అనే బ్రాండ్ నేమ్ మీదే వివిధ రీజియన్ల మధ్య దశలవారీగా ఈ రైళ్లు పరుగులు పెట్టనున్నాయి.
ర్యాపిడ్ ఎక్స్ లోగోగా గ్రీన్ లీఫ్‌ను ఎంపిక చేశారు. వాహన కాలుష్యాన్ని తగ్గించడం, పర్యావరణ పరిరక్షణకు గుర్తుగా గ్రీన్ లీఫ్‌ను లోగోగా ఎంచుకున్నారు అధికారులు. డీకార్బనైజేషన్, గ్రీన్ ఎనర్జీకి ఇది రెప్రజెంట్ చేస్తుంది. ఢిల్లీ-నేషనల్ క్యాపిటల్ రీజియన్ పరిధిలో వాహన కాలుష్యం ఏ స్థాయిలో ఉంటోందో తెలిసిన విషయమే.
ఆ తరువాత దీని పేరును కేంద్రం నమో భారత్‌గా మార్చింది. రెండో విడతలో ఢిల్లీ- నేషనల్ క్యాపిటల్ రీజియన్ పరిధిలోని సాహిబాబాద్- న్యూ అశోక్ నగర్ ఆర్ఆర్టీఎస్ స్టేషన్ల ప్రవేశపెట్టబోతోంది. దీనికోసం శనివారం నాడే ట్రయల్ రన్ సైతం ఆరంభం అయ్యాయి. ఈ రెండు స్టేషన్ల మధ్య దూరం 12 కిలోమీటర్లు.
ఈ లైన్‌లో నమో భారత్ రైలును అందుబాటులోకి తీసుకుని రావడం వల్ల న్యూ అశోక్ నగర్ నుంచి మీరట్ సౌత్ ఆర్ఆర్టీఎస్ స్టేషన్ మధ్య 40 నిమిషాల ప్రయాణ సమయం తగ్గుతుంది. అవుటర్ ఢిల్లీ, గ్రేటర్ నొయిడా, మీరట్ వంటి ప్రాంతాల మధ్య రాకపోకలు సాగించే వారికి ఈ రైలు అనువుగా ఉంటుందని ఎన్సీఆర్టీసీ పేర్కొంది.












Click it and Unblock the Notifications