త్రిపురలో ముక్కోణపు పోరు- బీజేపీ ప్రత్యర్ధులుగా లెఫ్ట్-కాంగ్రెస్, తిప్రామోథా !
త్రిపురలో మరోసారి అధికారం నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీకి అక్కడ లెఫ్ట్-కాంగ్రెస్, తిప్రా మోతా కూటమి రూపంలో ఎదురవుతున్న పోటీతో ముక్కోణపు పోరు నెలకొంది.
ఈశాన్య రాష్ట్రం త్రిపురలో ఈ నెల 16న అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందులో ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీకి ఓవైపు లెఫ్ట్-కాంగ్రెస్ కూటమి, మరోవైపు స్ధానిక పార్టీల కూటమి తిప్రా మోతా నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. అంతేకాదు ఈ ముగ్గురి మధ్య ముక్కోణపు పోరు కూడా నెలకొంటోంది. అన్నింటికంటే మించి ఈసారి త్రిపురలో గ్రేటర్ తిప్రా ల్యాండ్ డిమాండ్ జాతీయ పార్టీలకు చుక్కలు చూపిస్తోంది.
60 సీట్లున్న త్రిపుర అసెంబ్లీలో గతంలో 37 సీట్లు సాధించి అధికారం కైవసం చేసుకున్న బీజేపీకి ఈసారి పరిస్ధితులు అంత సానుకూలంగా కనిపించడం లేదు. ఇన్నాళ్లు కేంద్ర, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నప్పటికీ త్రిపురకు బీజేపీ చేసిందేమీ లేదన్న భావన అక్కడి ప్రజల్లో కనిపిస్తోంది. దీంతో పాటే ప్రత్యేక గ్రేటర్ తిప్రా ల్యాండ్ డిమాండ్ కూడా తెరపైకి వచ్చింది. ప్రత్యేక తిప్రాల్యాండ్ ను సాధించేందుకు తిప్రా మోతా పేరుతో స్ధానిక పార్టీలు జట్టుకట్టాయి. దీంతో ఈ డిమాండ్ కీలకంగా మారుతోంది. కానీ ఈ డిమాండ్ కు అటు బీజేపీ కానీ, ఇటు లెఫ్ట్-కాంగ్రెస్ కూటమి కానీ మద్దతివ్వడం లేదు.

ఈ నేపథ్యంలో త్రిపురలో అసెంబ్లీ ఎన్నికల వార్ ముదురుతోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇవాళ రాష్ట్రంలో రెండు ఎన్నికల ర్యాలీల్లో పాల్గొనబోతున్నారు. నెల రోజుల వ్యవధిలో త్రిపురలో షా పర్యటించడం ఇది రెండోసారి. అంతకుముందు జనవరి 5 న, షా రెండు 'రథయాత్ర'లకు హాజరయ్యారు. ఇందులో ఒకటి ఉత్తర త్రిపురలోని ధర్మనగర్ నుండి, మరొకటి దక్షిణ త్రిపురలోని సబ్రూమ్ నుండి చేపట్టారు. అలాగే బీజేపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ఫిబ్రవరి 7న త్రిపురకు రానున్నారు.
అటు స్ధానిక పార్టీల కూటమి టిప్రా మోత తన మేనిఫెస్టోను విడుదల చేసింది. ఇందులో 'గ్రేటర్ టిప్రాలాండ్' కోసం పోరాడతామని, ఆదివాసీల కోసం ప్రత్యేక రాష్ట్రం, గిరిజన మండలికి పోలీసు బలగం, 20 వేల కొత్త ఉద్యోగాలు, లొంగిపోయిన మిలిటెంట్లకు వన్-టైమ్ ప్యాకేజీ వంటి హామీలిస్తోంది. రెండేళ్ల క్రితం గిరిజిన ప్రాంతాల స్వతంత్ర కౌన్సిల్ కు జరిగిన ఎన్నికల్లో ఇదే కూటమి 18 సీట్లు గెల్చుకుని మిగతా పార్టీలకు ముచ్చెమటలు పట్టించింది. దీంతో ఇప్పుడు కూడా తిప్రా మోతా కూటమిపై అంచనాలు పెరిగాయి.












Click it and Unblock the Notifications