టీవీకే విషయంలో వైసీపీ కూడా దిగదుడుపే
తమిళనాడులో సంచలన విజయం సాధించింది.. తమిళగ వెట్రి కజగం (టీవీకే). 234 అసెంబ్లీ స్థానాలు ఉన్న తమిళనాడు అసెంబ్లీలో మొత్తం 108 స్థానాల్లో జెండా ఎగురవేసింది. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. ఏఐఏడీఎంకే- 73, డీఎంకే- 53 స్థానాలకు పరిమితం అయ్యాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మేజిక్ ఫిగర్ కు 10 సీట్ల దూరంలో నిలిచారు విజయ్. కాంగ్రెస్ మద్దతును తీసుకునే అవకాశాలు ఉన్నాయి.
ఈ ఎన్నికల విషయంలో టీవీకే ఓ నూతన అధ్యాయాన్ని రచించింది. విజయ్ నేతృత్వంలోని టీవీకే ఏకంగా 34.92 ఓట్ల శాతాన్ని కొల్లగొట్టింది. ఇది రికార్డు. 2000 సంవత్సరం తర్వాత దేశ ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసిన ఏ పార్టీకి కూడా ఇంత అధిక ఓట్ల శాతం దక్కలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా దీనికి మినహాయింపు కాదు. 2000 సంవత్సరం తర్వాత ఆవిర్భవించి, ఎన్నికల్లో పోటీ చేసిన ఏ పార్టీ కూడా సాధించని రికార్డు ఓట్ షేర్ ఇది. దేశ రాజకీయ చరిత్రలో ఓ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టినట్టయింది.

తొలి ఎన్నికల్లో ప్రభావం చూపిన ఇతర పార్టీల్లో అరవింద్ కేజ్రీవాల్ స్థాపించిన ఆమ్ ఆద్మీ పార్టీ 2013 ఢిల్లీ ఎన్నికలలో పోటీ చేసింది. 29 శాతానికి పైగా ఓట్లను సంపాదించింది. 70 మంది సభ్యులున్న అసెంబ్లీలో ఆప్ అప్పట్లో 28 స్థానాల్లో విజయం సాధించింది. ఎదుర్కొన్న తొలి ఎన్నికలోనే చెప్పుకోదగ్గ స్థాయిలో సీట్లను సాధించింది.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెలకొల్పిన కాంగ్రెస్ నుండి బయటికి వచ్చి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. ఆ తర్వాత 2012లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉప ఎన్నికలను ఎదుర్కొన్నారు. తొలిసారిగా పూర్తిస్థాయిలో అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొన్నది మాత్రం 2014లోనే. ఏపీలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో వైఎస్ఆర్సీపీ పోటీ చేసింది. 27.9 ఓట్ల శాతాన్ని సాధించింది. 67 అసెంబ్లీ, ఎనిమిది లోక్ సభ నియోజకవర్గాల్లో విజయదుందుభి మోగించింది.
దివంగత రామ్ విలాస్ పాశ్వాన్ 2000లో లోక్ జన శక్తి పార్టీ (రామ్ విలాస్) ఏర్పాటైంది. ఈ పార్టీ 2005 బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసి 12.6 ఓట్ల శాతాన్ని పొందింది. 29 చోట్ల విజయం సాధించింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యలోని ఏర్పాటైన అప్పటి తెలంగాణ రాష్ట్ర సమితి 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తొలి ఎన్నికల్లో పోటీ చేసింది. అప్పుడాపార్టీకి దక్కిన ఓట్ల శాతం 6.7.












Click it and Unblock the Notifications