నీకు నేను, నాకు నవ్వు: పెళ్లితో జతకూడిన ఇద్దరమ్మాయిలు
ఉత్తరప్రదేశ్: ఇద్దరు యువతులు తాము పెళ్లి చేసుకుని కలకాలం కలిసి ఉంటామని నిర్ణయించుకున్నారు. ఇద్దరు పెళ్లి చేసుకుంటామని న్యాయవాదుల దగ్గర అఫిడివిట్ తీసుకుని వారి కుటుంబ సభ్యులకు షాక్ ఇచ్చారు. మీరు హాయిగా ఉండండంటూ పోలీసులు వారికి రక్షణ కల్పించారు.
ఉత్తరప్రదేశ్ లోని కాస్ గంజ్ జిల్లాలోని సోరోన్ పట్టణంలో ఈ సంఘటన జరిగింది. అమ్మాయిలు ఇద్దరు మేజర్లు కావడంతో పోలీసులు సైతం ఏమి చెయ్యలేక చేతులు ఎత్తేశారు. 20 నెలల క్రితం ఇద్దరు అమ్మాయిలకు పరిచయం అయ్యింది. ఇద్దరు అప్పటి నుండి నిత్యం ఫోన్ లో మాట్లాడుకుంటూ పార్క్ లలో కలిసేవారు. ఇద్దరు ప్రేమలో పడ్డారు. పరస్పరం ప్రేమించుకున్నారు.

ఇద్దరు పెళ్లి చేసుకొవాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 14వ తేదిన న్యాయవాదులను కలిశారు. తాము ఇద్దరు మేజర్లు అని, పెళ్లి చేసుకుని జీవితాంతం కలిసి ఉంటామని చెప్పారు. న్యాయవాది దగ్గర అఫిడివిట్ తీసుకున్నారు. తరువాత కుటుంబ సభ్యులకు విషయం చెప్పారు.
షాక్ తిన్న కుటుంబ సభ్యులు అమ్మాయిలు ఇద్దరు పెళ్లి చేసుకోవడానికి వీలులేదని చెప్పారు. ఇద్దరు అమ్మాయిలు తప్పించుకుని శనివారం కాస్ గంజ్ పోలీసులను ఆశ్రయించారు. ఇద్దరు ప్రేమించుకున్నామని చెప్పడంతో పోలీసులు షాక్ తిన్నారు. తమ కుటుంబ సభ్యుల నుండి రక్షణ కల్పించాలని మనవి చేశారు.
పోలీసులు ఇద్దరు అమ్మాయిల దగ్గర ఫిర్యాదులు తీసుకుని వారి స్టేట్ మెంట్ నమోదు చేసుకున్నారు. ఇద్దరికి పోలీసులు రక్షణ కల్పించారు. తరువాత ఇద్దరు వివాహం చేసుకున్నారు. ఆదివారం పోలీసు అధికారులు మీడియాతో మాట్లాడుతూ - ఇద్దరు అమ్మాయిలు మేజర్లని, వారికి రక్షణ కల్పించామని అన్నారు. కాస్ గంజ్ జిల్లాలో ఎక్కడ చూసినా వీరి గురించే మాట్లాడుకుంటున్నారు. వారిని చూడటానికి ఉత్సాహం చూపిస్తున్నారు.












Click it and Unblock the Notifications