శ్రీలంక పర్యటన: ప్రధానిపై పెరుగుతున్న ఒత్తిడి
న్యూఢిల్లీ/చెన్నై: ప్రధాని మన్మోహన్ సింగ్ శ్రీలంక పర్యటనను వ్యతిరేకిస్తున్న కేంద్రమంత్రుల సంఖ్య పెరుగుతోంది. శ్రీలంకలో జరగనున్న కామన్ వెల్త్ ప్రభుత్వ అధినేతల సమావేశాని(సిహెచ్ఓజిఎం)కి ప్రధాని మన్మోహన్ సింగ్ పర్యటన రద్దు చేసుకోవాలని తాజా తమిళనాడుకు చెందిన మంత్రి పిఎంఓ నారాయణస్వామి, పర్యావరణ శాఖ మంత్రి జయంతి నటరాజన్‌లు కోరుతున్నారు. ప్రధాని తన పర్యటనను రద్దు చేసుకోవాలని వీరికంటే ముందే మరో కేంద్రమంత్రి జికె వాసన్ కోరారు.
శ్రీలంకలో తమిళులపై జరుగుతున్న దారుణాలకు నిరసనగా భారత్ ఈ సమావేశాన్ని బహిష్కరించాలని కేంద్ర మంత్రులతోపాటు తమిళనాడు రాష్ట్రంలోని పలు రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రధాని తన శ్రీలంక పర్యటన రద్దు చేసుకోవాలని కోరుకుంటున్నట్లు నారాయణస్వామి తెలిపారు. తమిళనాడులోని మెజార్టీ కాంగ్రెస్ మంత్రులు, ఎంపీలు ప్రధాని శ్రీలంక పర్యటనను రద్దు చేసుకోవాలని కోరుకుంటున్నట్లు ఆయన చెప్పారు.

మరో కేంద్రమంత్రి జయంతి నటరాజన్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. చెన్నెలో ఆమె మాట్లాడారు. తన శ్రీలంక పర్యటనను రద్దు చేసుకోవాలని కోరుతూ.. ప్రధాని మన్మోహన్ సింగ్‌కి ఓ లేఖ రాసినట్లు ఆమె చెప్పారు. శ్రీలంకలో తమిళ ప్రజలపై అక్కడి ప్రభుత్వం అవలంభిస్తున్న దుర్మార్గపు చర్యలకు నిరసనగా ప్రధాని తన శ్రీలంక పర్యటనను రద్దు చేసుకుంటారని ఆశిస్తున్నట్లు ఆమె తెలిపారు.
కాగా తమిళనాడు రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ నేత, వాణిజ్య శాఖ మంత్రి ఎస్ నాచియప్పన్ మరో విధంగా స్పందించారు. శ్రీలంకలోని తమిళ ప్రజల సంక్షేమం కోసం ప్రధాని మన్మోహన్ సింగ్ ఆ దేశంలో పర్యటించాలని ఆయన కోరారు. ప్రధాని తన పర్యటనలో శ్రీలంకలో తమిళ ప్రజలు ఎక్కువగా ఉంటున్న ప్రాంతాల్లో పర్యటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అయితే ప్రధాని పర్యటనను నిరసిస్తూ తమిళనాడు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పలువురు ఆందోళనలు చేపడుతున్నారు.












Click it and Unblock the Notifications