సొంత రాష్ట్రంలో ఘోర రైలు ప్రమాదం: అశ్విని వైష్ణవ్ రిజైన్ డిమాండ్: నైతిక బాధ్యత వారిద్దరిదే
భువనేశ్వర్: కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌కు సంభవించిన ఘోర ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగింది. ఈ ఉదయం 233 మంది మరణించినట్లు అధికారులు ప్రకటించారు. సహాయక చర్యలు కొనసాగుతున్న కొద్దీ మరిన్ని మృతదేహాలు బయటపడ్డాయి. మధ్యాహ్నానికి మృతుల సంఖ్య 261కి చేరింది. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటం వల్ల మృతుల సంఖ్య మరింత పెరగొచ్చనే ఆందోళన సర్వత్రా వ్యక్తమౌతోంది.
ఈ ఘటన నేపథ్యంలో- రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తన పదవికి రాజీనామా చేయాలనే డిమాండ్ ఊపందుకుంది. #Resign, #Resignation అనే హ్యాష్ ట్యాగ్స్ ట్రెండింగ్ అవుతున్నాయి. ఈ హ్యాష్ ట్యాగ్ కింద వేల సంఖ్యలో ట్వీట్లు పోస్ట్ అవుతున్నాయి. అశ్విని వైష్ణవ్ సొంత రాష్ట్రం కూడా ఒడిశానే కావడం- దీని తీవ్రతను మరింత పెంచినట్టయింది. రైల్వే భద్రతను కేంద్రం పట్టించుకోవట్లేదంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.

కాగా- రైలు ప్రమాదాలకు నైతిక బాధ్యత వహిస్తూ ఇప్పటివరకు ఇద్దరు రైల్వే శాఖ మంత్రులు మాత్రమే తమ పదవులకు రాజీనామా చేశారు. మరో ఇద్దరు రాజీనామా చేసినప్పటికీ అప్పటి ప్రధానమంత్రులు వాటిని ఆమోదించలేదు. 1956లో అప్పటి రైల్వే శాఖ మంత్రి రెండుసార్లు లాల్ బహదూర్ శాస్త్రి తన పదవికి రాజీనామా చేశారు. తొలిసారి రాజీనామాను అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఆమోదించలేదు.
1956 ఆగస్టులో ఉమ్మడి ఏపీలో జరిగిన ప్రమాదంలో 112 మంది మరణించారు. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ లాల్ బహదూర్ శాస్త్రి రాజీనామా చేశారు. దీన్ని నెహ్రూ అంగీకరించలేదు. రెండోసారి- నవంబర్‌లో తమిళనాడులో జరిగిన మరో ఘోర ప్రమాదంలో 144 మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. అప్పడు ఆయన రాజీనామాను నెహ్రూ ఆమోదించారు.
బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా గతంలో రైల్వే మంత్రిగా పని చేసినప్పుడు చోటు చేసుకున్న ఘోర దుర్ఘటన నేపథ్యంలో రాజీనామా చేశారు. 1999 ఆగస్టు 2వ తేదీన పశ్చిమబెంగాల్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 290 మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. ఆ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ రైల్వే శాఖ మంత్రి నితీష్ కుమార్ తన పదవికి రాజీనామా చేశారు. అప్పటి ప్రధాని రాజీనామాను ఆమోదించారు.

ఆ తరువాత మరెవరూ రాజీనామా చేయలేదు. 2000లో అప్పటి రైల్వే మంత్రి మమత బెనర్జీ రెండుసార్లు రాజీనామా చేశారు గానీ అవి ఆమోదం పొందలేదు. అప్పట్లో ఆమె ఎన్డీఏ భాగస్వామిగా ఉన్నారు. తన హయాంలో రెండుసార్లు రైలు ప్రమాదాలు జరగ్గా నైతిక బాధ్యతగా రాజీనామా చేశారు గానీ అవి ఆమోదం పొందలేదు.
ప్రధాని నరేంద్ర మోదీ హయాంలోనూ ఇదివరకు రెండుసార్లు రైలు ప్రమాదాలు సంభవించాయి. 2016లో కాన్పూర్ సమీపంలో పాట్నా- ఇండోర్ ఎక్స్‌ప్రెస్ 14 కోచ్‌లు పట్టాలు తప్పడంతో 150 మంది మరణించారు. అప్పటి రైల్వే మంత్రి సురేశ్ ప్రభు రాజీనామా చేసినప్పటికీ ప్రధాని మోదీ ఆమోదించలేదు. ఆయనను వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖకు మార్చారు. ఆయన స్థానంలో పియూష్ గోయెల్‌ను అపాయింట్ చేశారు.












Click it and Unblock the Notifications