టూ వీలర్లకూ టోల్ తీత..: ఫాస్టాగ్ తప్పనిసరి- జేబులు ఖాళీ: ముహూర్తం ఖరార్
Toll Plaza: దేశవ్యాప్తంగా ఉన్న టోల్ ప్లాజాలు, ఫాస్టాగ్ ల విషయంలో కేంద్ర ప్రభుత్వం రోజుకో సంచలన నిర్ణయాన్ని తీసుకుంటూ వస్తోంది. జాతీయ రహదారులపై నిర్మించిన టోల్ ప్లాజాల వద్ద వాహనాల రాకపోకలు మరింత సజావుగా సాగడానికి సరికొత్త వ్యవస్థకు శ్రీకారం చుడుతోన్నప్పటికీ.. అది వాహనదారులకు భారంగా పరిణమిస్తోంది.
ఇప్పటివరకు కార్లు, బస్సులు, లారీల వంటి భారీ వాహనాలకే పరిమితమైన టోల్ ఛార్జీలు.. ఇకపై ద్విచక్ర వాహనాలకూ వర్తించబోతోన్నాయి. దీనికి సంబంధించిన కసరత్తును కేంద్రం ఇప్పటికే పూర్తి చేసినట్లు చెబుతున్నారు. టూ వీలర్లపైనా టోల్ ఛార్జీలను వసూలు చేయాలని కేంద్రం నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ఈ విధానం జులై 15వ తేదీ నుంచి అమలులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. టూవీలర్ వాహనదారులకు ఇప్పటివరకు టోల్ ఫీజు ఉండట్లేదు. దీన్ని తొలగించబోతోంది కేంద్రం. టూవీలర్ల నుంచీ టోల్ ఛార్జీలను వసూలు చేయడానికి అవసరమైన ప్రతిపాదనలను రూపొందించినట్లు సమాచారం.
దీనిపై కేంద్రం నుంచి ఇప్పటివరకు అధికారికంగా ఎటువంటి ప్రకటనా రాలేదు. టూవీలర్ వాహనాలను కూడా ఫాస్టాగ్ ద్వారా డిజిటల్ టోల్ వసూలు వ్యవస్థ పరిధిలోకి తీసుకురావాలనే విధానంలో ఇది ఒక భాగం. జూలై 15 నుంచి హైవే ఎంట్రీ పాయింట్ల వద్ద టూవీలర్ వాహనాలకు టోల్ విధానం వర్తిస్తుంది.
ఇకపై టూవీలర్ వాహనదారులు ఫాస్టాగ్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీనిని బ్యాంక్ ఖాతా లేదా డిజిటల్ వ్యాలెట్‌కు లింక్ చేయాల్సి ఉంటుంది. టోల్ చెల్లింపుల కోసం వాహనానికి ప్రత్యేకంగా ఫాస్టాగ్ ను తప్పనిసరిగా అతికించుకోవాలి. టూవీలర్ వాహనాలను టోల్ సిస్టమ్‌లో చేర్చడానికి అనేక కారణాలు ఉన్నాయి.
దేశంలో టూవీలర్ వాహనాల సంఖ్య చాలా ఎక్కువ. ఫోర్ వీలర్స్ తో పాటు టూవీలర్స్ కు కూడా ఒకే విధమైన నియమం ఉండాలని కేంద్రం భావిస్తోంది. టోల్ వసూళ్లను క్రమబద్ధీకరించడానికి, టోల్ బూత్‌ల వద్ద ట్రాఫిక్ తగ్గించడానికి, అన్ని రకాల వాహనాల్లో డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడం అవసరమని కేంద్రం చెబుతోంది.
రోడ్లు సహా మౌలిక సదుపాయాలు మెరుగుపడుతున్నందున, వాటిని ఉపయోగించే ప్రతి ఒక్క వాహనదారు కూడా దాని నిర్వహణకు అవసరమైన ఆర్థిక తోడ్పాటును అందించాలని కేంద్రం భావిస్తోంది. ఈ నిర్ణయం మౌలిక సదుపాయాల నిధుల సమీకరణకు అవసరమని కొందరు భావిస్తుండగా, మరికొందరు రోజువారీ టూవీలర్ ప్రయాణికులకు అదనపు ఖర్చుల గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications