• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బాలాకోట్ వైమానిక దాడికి రెండేళ్లు.. ఈ ప్రశ్నలకు భారత్, పాక్ రెండు దేశాల దగ్గరా సమాధానాలు లేవు

By BBC News తెలుగు
|

యుద్ధ విమానం

తేదీ: 2019 ఫిబ్రవరి 14

ప్రదేశం: పుల్వామా, జమ్మూకశ్మీర్.

ఘటన: పుల్వామాలోని లేత్‌పొరా ప్రాంతంలో శ్రీనగర్- జమ్మూ జాతీయ రహదారిపై సీఆర్‌పీఎఫ్ జవాన్ల వాహన శ్రేణి వెళ్తోంది. అప్పుడు సంభవించిన భారీ పేలుడుతో 40 మంది జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

దేశంలో సార్వత్రిక ఎన్నికలకు సమయం సమీపిస్తున్న తరుణంలో ఇదంతా జరిగింది. ఎన్నికల ప్రచార సరళిని ఆ ఘటన పూర్తిగా మార్చేసింది.

తేదీ: 2019 ఫిబ్రవరి 26

నియంత్రణ రేఖ వెంట భారత్ సైనికేతర, నిఘా వర్గాల రహస్య ఆపరేషన్ చేపట్టింది. వివిధ వైమానిక స్థావరాల నుంచి బయలుదేరిన భారత వైమానిక దళంలోని మిరాజ్-2000 యుద్ధ విమానాలు ఆ దాడులు చేశాయి.

తమ విమానాలు జమ్మూకశ్మీర్‌లోని నియంత్రణ రేఖను దాటి పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తుంక్వా ప్రావిన్సులోని బాలాకోట్‌లో ఉన్న జైష్ ఏ మొహమ్మద్ గ్రూపుకు చెందిన ఉగ్రవాద శిక్షణా శిబిరాలపై క్షిపణులతో దాడి చేశాయని భారత వైమానిక దళ వైస్ మార్షల్ చెప్పారు.

ఆ వైమానిక దాడుల్లో భారీ సంఖ్యలో జైష్ ఏ మొహమ్మద్ గ్రూపుకు చెందిన సీనియర్ కమాండర్లు హతమయ్యారని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విజయ్ గోఖలే తెలిపారు.

భారత యుద్ధవిమానాలు వేసిన పేలుడు పదార్థం పడిన ప్రదేశం అంటూ పాక్ సైన్యం విడుదల చేసిన చిత్రం

మరుసటి రోజు అమెరికా సరఫరా చేసిన ఎఫ్-16 యుద్ధ విమానాలతో పాకిస్తాన్ ప్రతి దాడికి దిగింది. అప్పుడు ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. పాకిస్తాన్‌కు చెందిన ఒక ఎఫ్-16 విమానాన్ని కూల్చేశామని భారత్ చెప్పింది. దానిని పాకిస్తాన్ తోసిపుచ్చింది.

భారత మిగ్-21 విమానాన్ని పాకిస్తాన్ కూల్చివేసింది, వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్‌ను అదుపులోకి తీసుకుంది. రెండు రోజుల తర్వాత ఆయన్ను తిరిగి భారత్‌కు అప్పగించింది.

బాలాకోట్ దాడుల విషయంలో భారత్, పాక్ రెండూ పరస్పరం విరుద్ధమైన ప్రకటనలు, వాదనలు చేశాయి. అయితే, ఇంకా చాలా కీలక ప్రశ్నలకు రెండు వైపుల నుంచీ స్పష్టమైన సమాధానాలు రాలేదు.

బాలాకోట్ మ్యాప్

ప్రాథమిక ప్రశ్నలు:

* ఆ ఆపరేషన్ ద్వారా భారత్ కోరుకున్న లక్ష్యాన్ని సాధించిందా?

* బాలాకోట్‌లో జరిపిన సర్జికల్ దాడుల్లో జైష్ ఏ మొహమ్మద్ శిక్షణా శిబిరం ధ్వంసమైందా?

* బాంబులు ఖచ్చితంగా లక్ష్యాలపైనే పడ్డాయా?

* అక్కడ జరిగిన నష్టం ఏంటి?

* పాకిస్తాన్ వినియోగించిన ఎఫ్-16 యుద్ధ విమానాన్ని ఇతర దేశాలతో జరిగే యుద్ధాల్లో వాడకూడదన్న ఆంక్షలున్నాయా?

* బాలాకోట్‌లో దాడులు జరిగిన ప్రదేశానికి ఎవరూ వెళ్లకుండా ముందు అనుమతి నిరాకరించిన పాకిస్తాన్, నెల రోజులు గడిచిన తర్వాతే జర్నలిస్టులను ఎందుకు అనుమతించింది?

ఇందులో చాలా ప్రశ్నలకు రెండు దేశాల నుంచి ఇప్పటికీ సమాధానాలు రాలేదు.

ఎంతమంది చనిపోయారు?

భారత్‌లో తరచూ దాడులకు పాల్పడుతున్న జైష్- ఏ- మొహమ్మద్ మిలిటెంట్లకు శిక్షణా కేంద్రంగా ఉన్న ఒక మదర్సా తాము జరిపిన వైమానిక దాడిలో ధ్వంసమైందని భారత్ చెప్పింది.

ఆత్మాహుతి దాడులకు శిక్షణ పొందుతున్న అనేక మంది, వారి కమాండర్లు ఆ దాడిలో హతమయ్యారని భారత్ తెలిపింది. అయితే, ఖచ్చితంగా ఎంతమంది చనిపోయారన్న సంఖ్య ఇంకా వెల్లడించలేదు.

ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ, భారత మీడియా సంస్థలు రకరకాల సంఖ్యలు చెప్పాయి. మృతుల సంఖ్య 200 అని కొన్ని సంస్థలు చెప్పాయి, మరికొన్ని సంస్థలు 300 అని ప్రచురించాయి.

ముజఫరాబాద్, ఛకోఠి, బాలాకోట్‌లలోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ వైమానిక దాడులు చేసిందని భారత వార్తా సంస్థ చెప్పింది. కానీ, బాలాకోట్‌లో మాత్రమే దాడులు చేశామని తర్వాత భారత ప్రభుత్వం తెలిపింది.

భారత వైమానిక దళం జరిపిన దాడులు విజయవంతం అయ్యాయని నిరూపించే పక్కా ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని, ఈ దాడులతో అనుకున్న ఫలితం సాధించామని వైమానిక దళ వైస్ మార్షల్ అన్నారు.

అయితే, ఆ ఆధారాలను ఎప్పుడు, ఎలా విడుదల చేయాలో నిర్ణయించాల్సింది రాజకీయ నాయకత్వమని ఆయన వ్యాఖ్యానించారు.

బాలాకోట్‌లో జర్నలిస్టులు

పాకిస్తాన్ వాదన

బాలాకోట్‌లో దాడి చేశామన్న భారత ప్రకటనను పాకిస్తాన్ ఆర్మీ ప్రతినిధి మేజర్ జనరల్ అసిఫ్ గఫూర్ ఫిబ్రవరి 27న మీడియా సమావేశంలో తోసిపుచ్చారు. "మా రాడార్ల సమాచారం ప్రకారం, భారత యుద్ధ విమానాలు మా భూభాగంలోకి రావడానికి నాలుగు నిమిషాలు, తిరిగి వెనక్కి వెళ్లడానికి నాలుగు నిమిషాలు పట్టింది. ఎలాంటి దాడులు చేయలేదు" అని గఫూర్ అన్నారు.

"అసలు వైమానిక దాడులే జరగలేదు. పాకిస్తాన్ వైమానిక దళం ప్రతిఘటించడంతో భారత యుద్ధ విమానాలు వెనక్కి వెళ్లిపోయాయి" అని ఆయన వాదించారు.

సైనికుడు

సమాధానం లేదు

బాలాకోట్‌లోని వైమానిక దాడి ప్రభావిత ప్రదేశానికి వెళ్లేందుకు అంతర్జాతీయ మీడియా సంస్థలకు చెందిన జర్నలిస్టులకు పాకిస్తాన్ ఆర్మీ తొలుత అనుమతి ఇవ్వలేదు. ఎందుకు అనుమతించలేదు? అన్న ప్రశ్నకు ఇప్పటికీ సమాధానం లేదు.

దాడుల తర్వాత నెల రోజులకు విదేశీ జర్నలిస్టులను సైనిక భద్రతతో బాలాకోట్‌లోని జబా పర్వతాలకు పాకిస్తాన్ ఆర్మీ తీసుకెళ్లింది.

నెల రోజుల తర్వాత బాలాకోట్ వెళ్లిన విదేశీ జర్నలిస్టులకు మదర్సాలో పిల్లలు చదువుకోవడం కనిపించింది. ఆ భవనం చెక్కుచెదరకుండా ఉన్నట్లు కనిపించింది. అయితే, ఆ మదర్సా ఏడాది కాలంగా మూతపడి ఉందని స్థానిక పాత్రికేయులు చెప్పడం ఆశ్చర్యకరమైన విషయం.

మరి, ఏడాది కాలంగా ఆ మదర్సా మూసివేసి ఉంటే, దాడి తరువాత విదేశీ పాత్రికేయులు సందర్శించినప్పుడు అది ఎలా పనిచేస్తుంది? అన్న ప్రశ్న తలెత్తుతుంది.

మరోవైపు, తమ వైమానిక దాడిలో నాలుగు భవనాలు ధ్వంసమయ్యాయంటూ సింథటిక్ ఎపర్చర్ రాడార్ (ఎస్‌ఏఆర్) నుంచి అందిన దృశ్యాలను కొద్దిమంది పాత్రికేయులకు భారత అధికారులు చూపించారు.

నాలుగు భవనాలు ధ్వంసమైనట్లుగా ఉన్న హై రెజల్యూషన్ చిత్రాలను భారత వాయుసేన చూపించింది.

దాడి జరిగిన సమయంలో అక్కడ 200 మొబైల్ ఫోన్లు పనిచేస్తున్నట్లు నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఎన్‌టీఆర్‌ఓ) గుర్తించిందని, ఆ సమయంలో అక్కడ మిలిటెంట్లు ఉన్నారనడానికి అదే ఆధారమని భారత్ పేర్కొంది.

ధ్వంసమైన భవనాలకు పూర్తిగా మరమ్మతులు చేసిన తరువాతే విదేశీ జర్నలిస్టులను పాకిస్తాన్ బాలాకోట్‌కు తీసుకెళ్లిందని భారత్ అంటోంది.

పరస్పర దాడుల్లో పాక్‌కు చెందిన ఎఫ్ -16ను భారత యుద్ధ విమానాలు కూల్చేశాయన్న భారత వాదన గురించి పాకిస్తాన్ మాట్లాడటంలేదు.

మొదట ముగ్గురు భారత వైమానిక దళ పైలట్లను అదుపులోకి తీసుకున్నామని పాకిస్తాన్ చెప్పింది. కానీ, తర్వాత ఒక్క అభినందన్‌ మాత్రమే తమ అదుపులో ఉన్నారని పాకిస్తాన్ ఆర్మీ వెల్లడించింది.

భారత మిగ్-21 విమానాన్ని పాకిస్తాన్ కూల్చివేసింది, వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్‌ను కస్టడీలోకి తీసుకుంది.

బాంబులు ఎక్కడ పడ్డాయి?

తమ వైమానిక దాడులతో బాలాకోట్‌లో భవనాలు ధ్వంసమయ్యాయని భారత్ ప్రకటించింది. కానీ, విదేశీ పాత్రికేయులు అక్కడికి వెళ్లినప్పుడు ఆ భవనాలు ధ్వంసమైన ఆనవాళ్లు కనిపించలేదు. మరి, భారత విమానాలు చేసిన దాడులు గురితప్పాయా? అన్నది ప్రశ్నగా మిగిలిపోయింది.

కానీ, జాబా కొండల మీద ఉన్న అడవిలో బాంబు పడినట్లు జర్నలిస్టు గుర్తించారు. అక్కడ కొన్ని చెట్లు ధ్వంసమయ్యాయి.

అడవుల్లో పేలుళ్లు సంభవించినట్లు శబ్దాలు వచ్చాయని సమీప గ్రామాలకు చెందిన ప్రత్యక్ష సాక్షులు చెప్పినట్లు జర్నలిస్టులు తెలిపారు. ఆ దాడుల్లో గాయపడిన ఒక గ్రామస్తుడి వివరాలను కూడా మీడియా కథనాలు వెల్లడించాయి.

బాలకోట్ దాడి జరిగి రెండేళ్లు అవుతున్నా ఇప్పటికీ పరస్పర వాదనలతోనే సరిపెడుతున్నాయి. కానీ, తమ వాదనలకు సంబంధించిన వివరాలను మాత్రం ఎవరూ బయటపెట్టడంలేదు.

బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్‌ ది ఇయర్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Two years after the Balakot airstrikes:India and Pakistan have no answers to these questions
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X