• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Udaipur: ‘తప్పు చేసినవారికి శిక్ష పడుతుంది, మా అందరికీ ఎందుకీ శిక్ష’ - రషీదా బేగం

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
రషీదా బేగం

రెండు భారీ గేట్ల చుట్టూ రెండు డజన్ల మంది రాజస్థాన్ పోలీసులు ఆయుధాలతో నిల్చున్నారు.

అక్కడి సన్నని, ఇరుకైన దారిపైనే అందరి దృష్టీ ఉంది. గత మూడు రోజులుగా అక్కడ కట్టుదిట్టమైన భద్రత ఉండడంతో పిట్ట కూడా తిరగలేని పరిస్థితులు ఉండడమే అందుకు కారణం.

ఉదయ్‌పూర్‌లోని ఈ ప్రాంతాన్ని హాథీపోల్ అంటారు. ముస్లింలు ఎక్కువగా నివసించే ప్రాంతం అది. ఈ ప్రాంతంలోని ఓ వీధిలోనే టైలర్ కన్నయ్య లాల్‌ను ఇద్దరు ముస్లింలు గొంతు కోసి చంపేశారు.

ప్రస్తుతం ఈ ప్రాంతమంతా కర్ఫ్యూ ఉంది. కన్నయ్య లాల్‌ను హత్య చేసిన ఇద్దరు ముస్లిం యువకులను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అదుపులోకి తీసుకుని విచారిస్తోంది.

ఉదయ్‌పూర్ సహా రాజస్థాన్ వ్యాప్తంగా ఇంటర్నెట్ సర్వీసులు నిలిపివేశారు. రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. కన్నయ్య లాల్ హత్య తరువాత బలవంతంగా ఇళ్లలోనే ఉన్న ప్రజలంతా ఇప్పటికీ ఆ ఘటన వల్ల కలిగిన షాక్ నుంచి కోలుకోలేదు.

కన్నయ్యలాల్‌ను చంపిన ఇద్దరూ ముస్లింలు. మొహమ్మద్ ప్రవక్తపై బీజేపీ నేత నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలకు ప్రతీకారంగానే తాము ఈ హత్యకు పాల్పడ్డామని ఆ ఇద్దరూ చెప్పారు. అంతేకాదు... కన్నయ్య లాల్‌ను చంపుతున్నప్పుడు అదంతా వీడియో కూడా తీశారు.

రియాజ్ హుస్సేన్

ఉదయ్‌పూర్ ముస్లింలలో భయాందోళనలు

కన్నయ్యలాల్ హత్య తరువాత పరిస్థితులతో ఉదయ్‌పూర్ ముస్లింలు అసౌకర్యంగా ఉన్నారు. అక్కడి పాతబస్తీకి చెందిన రియాజ్ హుస్సేన్ కన్నయ్యలాల్ హత్య తరువాత రాత్రి అక్కడ పోగయిన జనాన్ని, వారి ఆగ్రహాన్ని స్వయంగా చూశారు.

''మీరిప్పుడు నిల్చున్న చోటే మా ఇంటి ముందు నా వాహనాలను ధ్వంసం చేశారు. పక్కింటివారికి చెందిన మరో మూడు వాహనాలు తగులబెట్టారు. ఈ దేశంలో హిందూముస్లింల సఖ్యతను మర్చిపోతున్నారు'' అన్నారు రియాజ్ హుస్సేన్.

2011 జనాభా లెక్కల ప్రకారం.. రాజస్థాన్‌లోని ముస్లిం జనాభాలో 10 శాతం మంది ఒక్క ఉదయ్‌పూర్‌లోనే నివసిస్తున్నారు.

కన్నయ్యలాల్ హత్య తరువాత ముస్లింలు నివసించే ప్రాంతాలలో ఎక్కడికి వెళ్లినా స్థానికులు బహిరంగంగా ఏ విషయమూ మాట్లాడడానికి భయపడుతున్నారు.

కెమెరా ముందుకు రావాలంటేనే వెనుకాడుతున్నారు. ఇళ్ల తలుపులు, కిటికీలు మూసి లోపలే ఉంటున్నారు. కెమెరాల ముందు మాట్లాడినప్పుడు ఎవరికీ తాము ముస్లిం పేరుతో కనిపించకూడదని కోరుకుంటున్నారు.

రద్దీగా ఉండే కహర్‌వాడీ ప్రాంతంలో తన ఇంటి అరుగు మీద కూర్చున్న మొహమ్మద్ ఫిరోజ్ మన్సూర్‌ను కలిశాం.

''ఇలాంటి ఘటనలకు, సామాన్యుల రోజువారీ జీవితానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ ఘటనలకు కొందరే కారణం. కానీ, సామాన్యులు కూడా దాని వల్ల ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఇక్కడ ఉండడానికి చాలా భయంగా ఉంది. కానీ, ఇల్లూవాకిలి విడిచిపెట్టి ఒక్కసారిగా ఎక్కడికిపోతాం?'' అన్నారు మన్సూర్.

ఫిరోజ్ మన్సూర్

ఏడాదిలో రాజస్థాన్ ఎంతలా మారిపోయిందంటే..

నిజానికి రాజస్థాన్‌కు మత కల్లోలాల చరిత్ర పెద్దగా లేదు. గత ఏడాది కరౌలీ, జోధ్‌పూర్, అల్వార్‌లలో మతపరమైన హింస చోటుచేసుకుంది. ఇప్పుడు తాజాగా ఉదయ్‌పూర్‌లోనూ ఉద్రిక్త వాతావరణం ఉంది. ఇవన్నీ సామాన్యులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. మైనారిటీలలోనూ భయాలున్నాయి.

ఉదయ్‌పూర్ పాతబస్తీలో ఉండే గులాబ్ బానో తన పిల్లల భవిష్యత్‌పై ఆందోళన చెందుతున్నారు. మతపరమైన హింసాత్మక పరిస్థితులు వారిపై ఎలాంటి ప్రభావం చూపుతాయో అని భయపడుతున్నారు.

''ఇలాంటి పరిస్థితులు నేను ఎన్నడూ చూడలేదు. చాలా భయంగా ఉంది. ఇంటి పట్టునే ఉండేవాళ్లం కాబట్టి ఇదంతా చూస్తుంటే భయంగా ఉంది. పిల్లలు బెదిరిపోయారు. స్కూళ్లు కూడా మూతపడ్డాయి. కరోనా కారణంగా చాలాకాలంగా మూతపడిన స్కూళ్లు ఇప్పుడు మళ్లీ మూసివేశారు. పిల్లల చదువులు ఏమవుతాయో'' అన్నారామె.

గులాబ్ బానో

'ప్రతీకార దాడులు జరుగుతాయేమో'

కన్నయ్యలాల్ హత్య తరువాత వెల్లువెత్తిన ఆగ్రహం ఇంకా కనిపిస్తోంది. నిందితులు పోలీసుల కస్టడీలో ఉన్నారు. దర్యాప్తు జరుగుతోంది.

అయితే, కన్నయ్యలాల్ అంత్యక్రియల సమయంలో బుధవారం కర్ఫ్యూ ఉన్నప్పటికీ పెద్దసంఖ్యలో ప్రజలు చేరుకుని శ్రద్ధాంజలి ఘటించారు.

కన్నయ్య హత్యకు నిరసనగా శుక్రవారం ఉదయ్‌పూర్‌లో భారీ ర్యాలీ తలపెట్టారు. ఈ ర్యాలీలో కనీసం 8 వేలమంది పాల్గొంటారని అంచనా.

శక్తిసింగ్

హిందూ జాగరణ్ మంచ్ యువజన విభాగానికి చెందిన శక్తిసింగ్ మాట్లాడుతూ... ''హిందూ సమాజం భయపడాల్సిన అవసరం లేదు. ఎవరూ ఎలాంటి అపోహలు పడొద్దు. లౌకికత్వం కారణంగా భారత్ ఇకపై ఇబ్బందులు పడదు. ఉదయ్‌పూర్‌లోని హిందూ సమాజం అందరితో కలిసే ఉంది, ఇతర మతాలవారికి ఎల్లప్పుడూ అండగా నిలిచింది. అలా అని మీరు పట్టపగలే మా వాళ్లను చంపేసి వెళ్లిపోవచ్చని అనుకోవద్దు'

అల్లర్లు, హింసకు పరిధులేవీ ఉండవు. సామాన్యులే ఎక్కువగా బాధితులవుతారు. కన్నయ్య లాల్ హత్య జరిగిన ప్రాంతంలోనే పుట్టిపెరిగిన వారిలో వృద్ధులు కూడా ఇప్పుడు భయంతో వణుకుతున్నారు.

57 ఏళ్ల రషీదా బేగం కూరగాయలు విక్రయిస్తుంటారు. ''తిండీనీళ్లూ లేకుండా గడుపుతున్నాం. ఏం చేస్తాం? ఎక్కడికి వెళ్తాం? బయటకు వెళ్తే పోలీసుల చేతిలో లాఠీ దెబ్బలు తినాల్సి ఉంటుంది. ఇలాంటి వాతావరణం చూడడం ఇదే మొదటిసారి. ఇప్పుడేం చేయాలి? తప్పు చేసిన వారికి శిక్ష పడుతుంది. ఒంటి చేత్తో చప్పట్లు కొట్టలేం. ఇతరులకు కూడా ఎందుకీ శిక్ష?'' అన్నారామె.

గత కొన్నేళ్లుగా భారత్‌లో మత హింస పెరిగింది. విద్వేష ప్రసంగాలు, సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలకూ ఈ హింసకు సంబంధం ఉందనేది కొందరి అభిప్రాయం.

ఉదయ్‌పూర్‌లో ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులు ముందెన్నడూ లేవు. ఉదయ్‌పూర్‌కు ప్రశాంత నగరంగా ప్రపంచమంతా పేరుందని విశ్రాంత ఇంజినీర్ హాజీ మొహమ్మద్ బక్ష్ అన్నారు. ''ఇక్కడి ప్రజలు చాలా ప్రేమగా, ఆప్యాయంగా ఉంటారు. రాణా ప్రతాప్ కాలంలో హకీమ్ ఖాన్ సూరీ ఆయన సేనాధిపతిగా ఉన్నప్పటి నుంచి కూడా సామరస్యం ఉంది. కానీ, ఇప్పుడు కొందరు రాజకీయ నాయకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఈ స్నేహపూర్వక వాతావరణాన్ని చెడగొడుతున్నారు'' అన్నారాయన.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Udaipur: ‘Those who do wrong will be punished, why should all of us be punished’ - Rashida Begum
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X