సనాతన ధర్మంపై వెనక్కు తగ్గని ఉదయనిధి స్టాలిన్; పురందరేశ్వరి ఫైర్!!
సనాతన ధర్మాన్ని నిర్మూలించండి అంటూ తమిళనాడు మంత్రి ఉదయ నిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపిన విషయం తెలిసిందే. ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలతో బిజెపి నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలువురు ఉదయనిధి స్టాలిన్ పై మండిపడ్డారు.
ఉదయనిది స్టాలిన్ వ్యాఖ్యలతో సనాతన ధర్మాన్ని అవమానించారని పెద్ద ఎత్తున కేసులు సైతం నమోదు చేస్తున్నారు. అయినప్పటికీ ఏ మాత్రం తగ్గని ఉదయనిది స్టాలిన్ ఇక ఈ కేసులన్నింటినీ పార్టీ హైకమాండ్ సలహా మేరకు చట్టపరంగా ఎదుర్కొంటానని పేర్కొన్నారు. తన వ్యాఖ్యలపై విమర్శలు ఎదురవుతున్నప్పటికి తాజాగా తన వ్యాఖ్యలను సమర్థిస్తూ ట్వీట్ చేశారు.

పెరియార్, అన్నా, కలైంజర్, పెర సిరియార్ సిద్ధాంతాల విజయం కోసం కృషి చేయాలని, సామాజిక న్యాయం కలకాలం వర్ధిల్లాలని ఉదయ నిధి స్టాలిన్ ఈరోజు ట్వీట్ చేశారు. మణిపూర్ లాంటి అతిపెద్ద సమస్యలు వదిలేసి తన వ్యాఖ్యలతో బీజేపీ రాజకీయం చేస్తుందని ఆయన మండిపడ్డారు. కేవలం ప్రజలను తప్పుదోవ పట్టించడమే లక్ష్యంగా బిజెపినేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. ఈ వివాదాన్ని ఎవరూ పట్టించుకోనవసరం లేదని ఆయన శ్రేణులకు సూచించారు.
కాగా సనాతన ధర్మం పై ఉదయనిది స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై ఏపీలోని బీజేపీ నేతలు కూడా స్పందిస్తున్నారు. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందరేశ్వరి ఉదయనిది స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం పెదవడ్లపూడి లో పర్యటించిన ఆమె, స్థానిక ఆలయంలో కృష్ణాష్టమి వేడుకలలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఉదయనిది స్టాలిన్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఆయన తక్షణం తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని సూచించారు. అతి పురాతనమైన సనాతన ధర్మంపై ఈ విధంగా వ్యాఖ్యలు చెయ్యటం సమంజసం కాదన్నారు. అంతేకాదు టీటీడీ బోర్డు సభ్యుల నియామకం పై కోర్టులో విజయం సాధించామని, తాము వేసిన పిల్ ఆధారంగానే కోర్టు వివరాలు కోరిందని పురందరేశ్వరి తెలిపారు.












Click it and Unblock the Notifications