ఈ విద్యా సంవత్సరం సెప్టెంబర్ నుంచేనా?: యూజీసీ కమిటీలు కీలక సూచనలివే
న్యూఢిల్లీ: కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా విద్యా సంస్థలు, విశ్వవిద్యాలయాలు మూతపడిన విషయం తెలిసిందే. అంతేగాక, విద్యార్థులకు నిర్వహించాల్సిన పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి. ఈ క్రమంలో విద్యాసంవత్సరం నిర్వహణ, ఆన్‌లైన్ విద్యపై ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలో సిఫార్సు చేయాలంటూ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషణ్(యూజీసీ) ఇటీవల రెండు కమిటీలను ఏర్పాటు చేసింది.
ఈ శుక్రవారం ఈ కమిటీలు తమ నివేదికలను అందజేశాయి. ఏటా జులైలో ప్రారంభమయ్యే నూతన విద్యాసంవత్సరం ఈసారి మాత్రం సెప్టెంబర్‌కు జరపాలని హర్యానా యూనివర్సిటీ వీసీ ఆర్సీ కుహాడ్ నేతృత్వంలోని మొదటి కమిటీ సూచించింది.

సరైన వసతులు ఉంటే విశ్వవిద్యాలయాలు ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించాలి. లేని పక్షంలో లాక్‌డౌన్ ముగిశాకే పరీక్షలు నిర్వహించాలని ఇగ్నో వీసీ నాగేశ్వరరావు సారథ్యంలోని రెండో కమిటీ స్పష్టం చేసింది. కాగా, మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రస్తుతం ఈ రెండు కమిటీల నివేదికలను పరిశీలిస్తోంది.
విద్యా సంవత్సరంపై పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటామని మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. జేఈఈ, నీట్ పరీక్షలను జూన్‌లో నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. అయితే, ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితుల ప్రభావంపైనా సమీక్షించాల్సిన అవసరం ఉందని తెలిపారు.
దేశంలో కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు దేశ వ్యాప్తంగా మే 3 వరకు లాక్ డౌన్ పొడిగించిన విషయం తెలిసిందే. ఆ సమయానికి కరోనా అదుపులోకి వస్తే లాక్ డౌన్ ఎత్తివేసే అవకాశం ఉంది. లేదంటే లాక్ డౌన్ పొడిగించడమా? లేక సడలింపులు కల్పించడమా? అనే విషయంపై కేంద్రం సమాలోచనలు చేస్తోంది.












Click it and Unblock the Notifications