మొన్నే ప్రారంభించిన మోదీ - రైల్వే ట్రాక్ పేల్చివేతకు కుట్ర..!!
అహ్మదాబాద్: ప్రస్తుతం గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికల వేడి పతాక స్థాయికి చేరుకుంటోంది. పోలింగ్ గడువు సమీపిస్తోన్న కొద్దీ అన్ని పార్టీలు కూడా తమ ప్రచార జోరును పెంచుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సొంత రాష్ట్రం కావడం వల్ల- అందరి దృష్టీ ఈ ఎన్నికలపైనే నిలిచింది. అధికారాన్ని నిలబెట్టుకోవడానికి భారతీయ జనతా పార్టీ విస్తృత ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తోంది. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ దీనికి ఏ మాత్రం తీసిపోని విధంగా ప్రచార ఉధృతిని కొనసాగిస్తోన్నాయి.
ఈ పరిస్థితుల మధ్య కలకలం చోటు చేసుకుంది. గుజరాత్‌లోని అసర్వా, రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ రైల్వే ట్రాక్‌ను పేల్చివేయడానికి గుర్తు తెలియని వ్యక్తులు ప్రయత్నించారు. ఈ ఘటనలో పట్టాలు దెబ్బ తిన్నాయి. రెండుగా చీలిపోయాయి. అసర్వా- ఉదయ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ ఇదే ట్రాక్‌పై బయలుదేరాల్సిన కొన్ని గంటల ముందు రైల్వే సిబ్బంది దీన్ని గుర్తించారు. వెంటనే అధికారులను అప్రమత్తం చేశారు. దీనితో ఉదయ్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌ను సమీపంలోనే ఉన్న దుంగార్పూర్ రైల్వేస్టేషన్‌లో నిలిపివేశారు.
ఈ ట్రాక్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సరిగ్గా 13 రోజుల కిందటే ప్రారంభించారు. పేలుడుకు నాలుగు గంటల ముందు ఇదే మార్గంలో ఓ ఎక్స్‌ప్రెస్ వెళ్లింది. దెబ్బ తిన్న పట్టాలను రైల్వే, పోలీసు అధికారులు సందర్శించారు. సంఘటన స్థలం నుంచి డిటోనేటర్లు, గన్‌పౌడర్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీనితో ఇది విద్రోహ చర్యగా ప్రాథమికంగా నిర్ణయించారు. గుర్తు తెలియని వ్యక్తులు ఉద్దేశపూరకంగా రైల్వే ట్రాక్‌ను పేల్చివేసి ఉండొచ్చని భావిస్తున్నట్లు చెప్పారు.

దీన్ని ఉగ్రవాద కోణంలో చూస్తోన్నామని అన్నారు. విధ్వంసక చర్యతో పాటు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తోన్నామని పేర్కొన్నారు. ట్రాక్‌ను పునరుద్ధరించడానికి తక్షణ చర్యలను చేపట్టామని, ఉదయ్‌పూర్ పోలీసు సూపరింటెండెంట్ వికాస్ శర్మ తెలిపారు. రైల్వే ట్రాక్ కమ్ బ్రిడ్జిని డిటోనేటర్లతో పేల్చివేయడానికి కుట్ర పన్నారని.. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని రాజస్థాన్ పోలీస్ డైరెక్టర్ జనరల్ ఉమేష్ మిశ్రా, జిల్లా కలెక్టర్ తారాచంద్ మీనా తెలిపారు.
రాజస్థాన్ పోలీసుకు చెందిన యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) ఘటనాస్థలికి చేరుకుంది. కుట్రలో ఉగ్రవాద కోణంపై ఏటీఎస్ విచారణ చేపట్టింది. పక్కా ప్రణాళికతో పేలుడు జరిగినట్లు అనిపించిందని వికాస్ శర్మ తెలిపారు. డిటోనేటర్లన్నీ శక్తిమంతమైన సూపర్ 90 కేటగిరీకి చెందినవని చెప్పారు. బాంబ్ స్క్వాడ్, ఫోరెన్సిక్ బృందాలు ఘటనాస్థలికి చేరుకుని ఆధారాలు సేకరించాయని, దీనిపై త్వరలోనే మరిన్ని వివరాలను వెల్లడిస్తామని అన్నారు.












Click it and Unblock the Notifications