అన్‌లాక్ 3.0: రాత్రి కర్ఫ్యూ పూర్తిగా ఎత్తివేత, సినిమా హాళ్లకు నో, జిమ్స్‌కు ఓకే
న్యూఢిల్లీ: లాక్‌డౌన్ నిబంధనలను క్రమంగా సడలిస్తూ వస్తున్న కేంద్ర ప్రభుత్వం తాజాగా అన్‌లాక్ 3.0 మార్గదర్శకాలను విడుదల చేసింది. ఆగస్టు 1 నుంచి రాత్రి పూట కర్ఫ్యూను ఎత్తివేస్తున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. దీంతోపాటు జిమ్‌లు, యోగా కేంద్రాలకు అనుమతిస్తున్నట్లు పేర్కొంది.

అన్‌లాక్ 3.0 మార్గదర్శకాలు
అయితే, ఎక్కువగా జన సంచారం ఉండే స్కూళ్లు, కాలేజీలు, సినిమా థియేటర్లు తెరవడంపై నిషేధం కొనసాగుతుందని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు మరిన్ని సడలింపులతో కూడిన అన్‌లాక్ 3.0 మార్గదర్శకాలను కేంద్ర హోంశాఖ బుధవారం జారీ చేసింది.

జిమ్స్‌కు ఓకే..
ఆగస్టు 1 నుంచి వీటికి అనుమతి:
లాక్‌డౌన్ ప్రారంభం నుంచి దేశంలో కొనసాగుతున్న రాత్రివేళ కర్ఫ్యూను పూర్తిగా ఎత్తివేస్తున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది.
జిమ్‌లు, యోగా కేంద్రాలు ఆగస్టు 5 నుంచి తెరుచుకోవచ్చని తెలిపింది.
ఇక భౌతిక దూరం పాటిస్తూ స్వాతంత్ర్య దినోత్సవానికి సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చని తెలిపింది.

అన్‌లాక్ 3.0లోనూ అనుమతిలేనివి:
స్కూళ్లు, కాలేజీలు, కోచింగ్ సెంటర్లను ఇప్పుడే తెరిచేది లేదని కేంద్రం స్పష్టం చేసింది.
ఆగస్టు 31 వరకు వీటిపై ఉన్న నిషేధం యథాతథంగా అమలౌతుందని తెలిపింది.
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో సంప్రదింపుల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
మెట్రో రైళ్లు, సినిమా హాళ్లు, స్విమ్మింగ్ హాల్స్, ఎంటర్టైన్మెంట్ పార్కులు, బార్లు, ఆడిటోరియాలు వంటివి తెరవడంపై నిషేధం కొనసాగుతుందని కేంద్రం స్పష్టం చేసింది.
రాజకీయ, క్రీడా, సామాజిక, సాంస్కృతిక సభలూ, సమావేశాలకు అనుమతి లేదని తేల్చి చెప్పింది. కంటైన్మెంట్ జోన్లలో మాత్రం ఆగస్టు 31 వరకు లాక్‌డౌన్ కొనసాగుతుందని బుధవారం రాత్రి విడుదల చేసిన తాజా మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది.

16 లక్షలకు చేరువలో కరోనా కేసులు
కాగా, దేశంలో కరోనా పాజిటివ్ కేసులు కూడా భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు 15,67,614 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 5,25,344 యాక్టివ్ కేసులున్నాయి. 10,07,249 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 34,593 మంది కరోనా బారినపడి మరణించారు.












Click it and Unblock the Notifications