భారత యువతులు సరదా కోసం శారీరక సంబంధాలు పెట్టుకోరు: ఎంపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
భోపాల్: మధ్యప్రదేశ్ హైకోర్టు ఓ కేసు విషయంలో కీలక వ్యాఖ్యలు చేసింది. భారతీయ యువతులెవరూ సరదా కోసం శారీరక సంబంధాలు పెట్టుకోరని హైకోర్టు వ్యాఖ్యానించింది. పెళ్లి చేసుకుంటానని నమ్మకంగా చెబితే తప్ప.. ఇలాంటి వాటికి అంగీకరించరని స్పష్టం చేసింది.

పెళ్లి పేరుతో మహిళపై పలుమార్లు అత్యాచారం
యువతులతో సంబంధం పెట్టుకోవాలని భావించే పురుషులెవరైనా పర్యవసానాలు కూడా గమనించాలని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఉజ్జయినికి చెందిన ఓ వ్యక్తి పెళ్లి చేసుకుంటానని నమ్మించి 2018 అక్టోబర్ నుంచి ఓ మహిళపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే, అతడు వేరే అమ్మాయిని వివాహం చేసుకుంటానని గత జూన్ నెలలో చెప్పడంతో ఆమె ఆత్మహత్యకు యత్నించింది.

ఇష్ట ప్రకారమే శారీరక సంబంధం పెట్టుకున్నామన్న నిందితుడు
ఈ నేపథ్యంలో సదరు వ్యక్తిపై అత్యాచారం కేసు నమోదు చేసిన పోలీసులు.. అరెస్ట్ చేశారు. నిందితుడు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా.. మధ్యప్రదేశ్ హైకోర్టు ఇండోర్ బెంచ్‌కు చెందిన జస్టిస్ సుబోధ్ అభయంకర్ విచారణ జరిపారు. ఆమెకు 21 ఏళ్లు నిండాయని, ఇష్ట ప్రకారమే తనతో శారీరక సంబంధం పెట్టుకుందనే నిందితుడు చేసిన వాదనను న్యాయమూర్తి అంగీకరించలేదు.

భారత యువతులు సరదా కోసం శారీరక సంబంధాలు పెట్టుకోరు..
భారత్ ఒక సాంప్రదాయవాద సమాజమని, భారతీయ యువతులు పెళ్లి చేసుకుంటాననే వాగ్ధానం ఇస్తే తప్ప, ఓ వ్యక్తితో శారీరక సంబంధానికి అంగీకరిస్తారని, లేదంటే అలా చేయరని న్యాయమూర్తి సుబోధ్ వ్యాఖ్యానించారు. భారతీయ యువతకులకు అది ఒక సరదా కాదని స్పష్టం చేశారు. పురుషులు.. ఇలాంటి సంబంధాలు పెట్టుకునే ముందు ఆ తర్వాతి పరిణామాల గురించి కూడా ఆలోచించుకోవాలని హెచ్చరించారు.
'సంప్రదాయాలకు విలువ ఇచ్చే సమాజం మనది. అలాంటిది పెళ్లి కానీ యువతులు దిగజారి ప్రవర్తించే స్థితికి ఇంకా చేరుకోలేదు. పెళ్లి చేసుకుంటారని, ఏదో ఒక హమీ మీద తప్పించి.. సరదా కోసం ఇలా శారీరక సంబంధం పెట్టుకోరు. అలాగే నిజాన్ని నిరూపించడానికి ప్రతీసారి బాధితులు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అలా సంబంధం పెట్టుకోవాలని భావించే పురుషులెవరైనా తదుపరి పర్యవసానాలను కూడా గమనించాలి' అని జస్టిస్ సుబోధ్ అభయంకర్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది.

పెళ్లి కాకుండా తల్లైతే మహిళల పరిస్థితి ఏంటి?
వివాహం చేసుకుంటానని నమ్మించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన నిందితుడు.. ఇప్పుడు తాను ముస్లింనని, ఆమె హిందువు కాబట్టి ఆమె తల్లిదండ్రుల తమ వివాహానికి అంగీకరించడం లేదని చెప్పుకొచ్చాడు. అయితే, బాధితురాలు తనను వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేసినప్పటికీ నిందితుడు అందుకు అంగీకరించకపోవడం గమనార్హం. ఈ క్రమంలోనే బాధితురాలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
నిందితుడు మరో యువతిని పెళ్లి చేసుకుని బాధితురాలికి అన్యాయం చేస్తుండటంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధితురాలు ప్రాణం తీసుకునేందుకు కూడా వెనుకాడకపోవడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోందని వ్యాఖ్యానించింది.
నిందితుడికి ఈ కేసులో బెయిల్ ఇవ్వడం కుదరని తేల్చి చెప్పింది. పెళ్లి కాకుండా గర్భం దాల్చితే సమాజంలో మహిళ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఊహించడం కూడా కష్టమేననని వ్యాఖ్యానించింది.












Click it and Unblock the Notifications