బక్రీద్‌పై ఉక్కుపాదం! రోడ్లపై నమాజ్, జంతు బలులు నిషిద్ధం
ఉత్తర ప్రదేశ్‌లో పవిత్ర బక్రీద్ (ఈద్ అల్-అధా) పండుగ వేడుకల నిర్వహణపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సర్కారు అత్యంత కఠినమైన ఆంక్షలను విధించింది. పండుగ సందర్భంగా ఎట్టి పరిస్థితుల్లోనూ రోడ్లపై నమాజ్ చేయడం గానీ, బహిరంగ ప్రదేశాలలో జంతు బలులు (ఖుర్బానీ) ఇవ్వడం గానీ అనుమతించేది లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని పండుగ సాంప్రదాయాలను చట్టబద్ధమైన పరిమితులకు లోబడే నిర్వహించాలని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఉన్నతాధికారులను ఆదేశించారు.
ఆదివారం నిర్వహించిన ఉన్నత స్థాయి శాంతిభద్రతల సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ జిల్లా పరిపాలనా విభాగాలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. నమాజ్ లేదా ప్రత్యేక ప్రార్థనలను కేవలం సాంప్రదాయ మసీదులు, ఈద్గాల ప్రాంగణాల లోపల మాత్రమే నిర్వహించాలని స్పష్టం చేశారు. ఏ ఒక్కరి వల్ల కూడా సాధారణ ట్రాఫిక్‌కు అంతరాయం కలగకూడదని, రోడ్లను దిగ్బంధించి ప్రార్థనలు చేయడానికి వీల్లేదని తేల్చి చెప్పారు. ప్రార్థనలు చేసుకునే వారి సంఖ్య ఎక్కువగా ఉంటే, ఒకేసారి కాకుండా విడతలవారీగా (షిఫ్టుల పద్ధతిలో) ప్రార్థనలు ముగించుకోవాలని సీఎం సూచించారు.

నిర్దేశిత ప్రాంతాల్లోనే 'ఖుర్బానీ'..
బక్రీద్ పండుగలో అత్యంత కీలకమైన జంతు బలుల ప్రక్రియను కేవలం ముందుగా నిర్ణయించిన, సాంప్రదాయకంగా ఆమోదం పొందిన ప్రాంతాల్లో మాత్రమే నిర్వహించడానికి అనుమతి ఉంటుందని అధికారులు వెల్లడించారు. బహిరంగ ప్రదేశాల్లోగానీ, ప్రజా రవాణా మార్గాల్లో గానీ జంతువులను వధించకూడదని సీఎం ఆదేశించారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అక్రమ వధశాలలపై నిఘా ఉంచాలని, లైసెన్స్ ఉన్న శాలలు కూడా తమ పరిమితికి మించి జంతువులను ఉంచకుండా పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. పండుగ రోజుల్లో మాంసాన్ని బహిరంగంగా విక్రయించడాన్ని పూర్తిగా నిషేధించారు.
వ్యర్థాల నిర్వహణపై ప్రత్యేక అలర్ట్..
జంతు బలుల అనంతరం మిగిలిపోయే వ్యర్థాలు, అవశేషాల వల్ల ప్రజారోగ్యానికి హాని కలగకుండా, మతపరమైన ఉద్రిక్తతలకు తావులేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని యోగి సర్కారు ఆదేశించింది. మున్సిపల్ కార్పొరేషన్లు, స్థానిక సంస్థలు పారిశుధ్య నిర్వహణపై నిరంతరం అప్రమత్తంగా ఉంటూ, వ్యర్థాలను వెంటనే తొలగించేలా శాస్త్రీయ రవాణా వ్యవస్థను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.













Click it and Unblock the Notifications