తొలిసారి అసెంబ్లీ బరిలో యోగి: నామినేషన్ దాఖలు: ఆ కంచుకోట నుంచే: అమిత్ షా తోడుగా
లక్నో: అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వేడి క్రమంగా పతాకస్థాయికి చేరకుంటోంది. నాలుగు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండటంతో.. ఈ ఎన్నికలకు ప్రాధాన్యత ఏర్పడింది. అందులోనూ దేశ రాజకీయ స్థితిగతులను ప్రభావితం చేయగల సామర్థ్యం ఉన్న అతి పెద్ద రాష్ట్రం ఉత్తర ప్రదేశ్ కూడా అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోండటంతో అందరి దృష్టీ దీనిపై పడింది. ఉత్తర ప్రదేశ్ సహా ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్‌లల్లో ఏడు దశల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నిర్వహించనుంది ఈసీ.
Recommended Video
తొలిదశ ఫిబ్రవరి 10వ తేదీన ఆరంభమౌతుంది. చివరి దశ పోలింగ్ మార్చి 7న ఉంటుంది. అదే నెల 10వ తేదీన ఓట్ల లెక్కింపును నిర్వహించేలా షెడ్యూల్‌ను విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘ. ఉత్తర ప్రదేశ్‌లో ఏడు దశల్లో పోలింగ్ ఉంటుంది. ఫిబ్రవరి 10, 14, 20, 23, 27, మార్చి 3, 7 తేదీల్లో 15,05,82,750 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అధికారం ఎవరిని వరిస్తుందనేది అదే నెల 10వ తేదీన తేలుతుంది.

ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు ఈ ఎన్నిక ప్రతిష్ఠాత్మకంగా మారింది. 2017 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తిరుగులేని విజయాన్ని సాధించిన అనంతరం అనూహ్యంగా ముఖ్యమంత్రి పదవి ఆయనకు దక్కింది. ఎమ్మెల్యే కూడా కాని యోగి చేతిలో ప్రభుత్వ పగ్గాలను పెట్టింది బీజేపీ అధిష్ఠానం. అప్పటికి ఆయన గోరఖ్‌పూర్ ఎంపీ. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన గోరఖ్‌పూర్ సదర్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేయనున్నారు.
ఈ మేరకు ఆయన కొద్దిసేపటి కిందటే తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఆ సమయంలో ఆయన వెంట పార్టీ మాజీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఉన్నారు. అమిత్ షా తోడు రాగా.. యోగి ఆదిత్యనాథ్ తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు. అంతకుముందు ఆయన ఈ ఉదయం గోరఖ్‌నాథ్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోరఖ్ నాథుడికి రుద్రాభిషేకం చేశారు. హోమంలో పాల్గొన్నారు.
గోరఖ్‌పూర్ అర్బన్ నియోజకవర్గం బీజేపీకి కంచుకోట. 1989 తరువాత ఒక్కసారి మాత్రమే ఆ పార్టీ ఇక్కడ ఓడిపోయింది. రాధా మోహన్ దాస్ అగర్వాల్.. గోరఖ్‌పూర్ స్థానానికి ప్రస్తుతం ప్రాతినిథ్యాన్ని వహిస్తున్నారు. ఆయనకు బదులుగా యోగి ఆదిత్యనాథ్.. ఈ స్థానం నుంచి బరిలో దిగారు. దశాబ్దాల కాలం పాటు బీజేపీకి కంచుకోటగా ఉంటూ వస్తోండటం, అంతకుముందు గోరఖ్‌పూర్ లోక్‌సభ స్థానం నుంచి యోగి అయిదుసార్లు విజయం సాధించడం వంటి పరిణామాలన్నీ కలిసి వస్తాయని బీజేపీ భావిస్తోంది.
యోగి ఆదిత్యనాథ్ భారీ మెజారిటీతో విజయం సాధిస్తారని అమిత్ షా ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. నామినేషన్ పత్రాలను దాఖలు చేసిన అనంతరం ఆయన కొద్దిసేపు విలేకరులతో మాట్లాడారు. ఉత్తర ప్రదేశ్‌ను మాఫియా నుంచి విముక్తిని చేయడంలో ముఖ్యమంత్రిగా యోగి కీలక పాత్ర పోషించారని చెప్పారు. 25 సంవత్సరాల తరువాత ఉత్తర ప్రదేశ్‌లో శాంతిభద్రతలను కాపాడగలిగామని పేర్కొన్నారు. తాము అధికారంలోకి వస్తామనడానికి అనేక కారణాలు ఉన్నాయని అమిత్ షా వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications