ఓటు వేసిన వారికి అదిరిపోయే ఆఫర్: భారీ డిస్కౌంట్: ఉత్తర ప్రదేశ్‌లో నాలుగో విడత పోలింగ్
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో నాలుగో విడత పోలింగ్ కొద్దిసేపటి కిందటే ఆరంభమైంది. మొత్తం 59 నియోజకవర్గాలకు పోలింగ్ సాయంత్రం వరకూ కొనసాగుతుంది. 624 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఫిలిభిత్, లఖీంపూర్ ఖేరీ, సీతాపూర్, హర్దోయ్, ఉన్నవ్, లక్నో, రాయ్‌బరేలీ, బండా, ఫతేపూర్ జిల్లాల్లో పోలింగ్ ఉంటుంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరి నిల్చున్నారు.
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు కట్టుదిట్టమైన భద్రత చర్యలను తీసుకున్నారు. సమస్యాత్మ, సున్నిత ప్రాంతాల్లో అదనపు పోలీసు బలగాలను మోహరింపజేశారు. అత్యంత సున్నిత ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వెబ్ కాస్టింగ్ పర్యవేక్షణలో పోలింగ్ కొనసాగుతోంది. ఈ దశలో లఖింపూర్ ఖేరీ జిల్లా కూడా ఉండటం వల్ల అందరి దృష్టీ అటు వైపే నిలిచింది.

ఇప్పటిదాకా ఉత్తర ప్రదేశ్‌లో మూడు దశల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఈ నెల 10, 14, 20వ తేదీల్లో మొత్తం 172 స్థానాల్లో పోలింగ్ ప్రక్రియ పూర్తయింది. కాగా- ఈ మూడు దశల్లో కూడా పోలింగ్ శాతం ఆశించిన స్థాయిలో లేకపోవడంతో అధికారులు పునరాలోచనలో పడ్డారు. పోలింగ్ శాతాన్ని పెంచడానికి చర్యలు తీసుకున్నారు. పోలింగ్ పర్సెంటేజీని వందకు పెంచేలా, ఓటు వేయడానికి ఓటర్లను ప్రోత్సహించేలా ఆఫర్లను ప్రకటించారు.
ఈ విషయంలో లక్నో జిల్లా కలెక్టర్.. ఆసక్తికరమైన ప్రకటన చేశారు. ఓటు వేసిన వారికి పెట్రోల్, డీజిల్ ధరలో రెండుశాతం రాయితీలను ఇస్తామని ప్రకటించారు. ఓటు వేసినట్టుగా వేలి మీద ఇంకు గుర్తును చూపించితే చాలు- పెట్రోల్/డీజిల్ ధరలో రెండు శాతం రాయితీలను ఇవ్వాలని డీలర్లకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రెండు శాతం రాయితీలను ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామని లక్నో హజ్రత్ గంజ్‌లో గల తల్వార్ పెట్రోల్ పంప్ యాజమాన్యం తెలిపింది. ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ ఆఫర్ ఉంటుందని తెలిపింది.

అలాగే- లక్నోలోని ఓ ప్రైవేట్ కళాశాల యాజమాన్యం ఏకంగా 10 అదనపు మార్కులను ఇస్తామని ప్రకటించింది. తమ ఓటు హక్కును వినియోగించుకున్న వారి పిల్లలకు 10 అదనపు మార్కులను రివార్డ్‌గా ఇస్తామని లక్నోలో క్రైస్ట్ చర్చ్ కళాశాల ప్రిన్సిపల్ రాకేష్ కుమార్ చెప్పారు. ఓట్ల శాతం 100కు పెరగాలన్నదే తమ ఉద్దేశమని అన్నారు. నాలుగో విడత పోలింగ్ సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications