ఎస్పీ అధికారంలోకి వస్తే దేశమంతా ఉగ్రవాదం విస్తరిస్తుంది: అఖిలేష్ యాదవ్ పై అమిత్ షా ఎటాక్
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న హోంమంత్రి అమిత్ షా సమాజ్‌వాదీ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సమాజ్‌వాదీ పార్టీ అధికారంలోకి వస్తే ఉగ్రవాదం దేశమంతా వ్యాప్తి అవుతుందని, ఉగ్రవాదులు దేశమంతటా విస్తరించే ప్రమాదముందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Recommended Video

యూపీలో బాహుబలులు లేరు.. బజరంగబలి మాత్రమే ఉంది: అమిత్ షా
సైకిల్ ప్రభుత్వం (సమాజ్‌వాదీ పార్టీ చిహ్నం) అధికారంలోకి వస్తే, మళ్ళీ దారుణ పరిస్థితులు వస్తాయని. ఆకలితో కరువులో 2,000 మంది రైతుల ప్రాణాలు తీస్తారని బండా జిల్లాలోని తింద్వారీ అసెంబ్లీ ప్రాంతంలో జరిగిన బహిరంగ కార్యక్రమంలో అమిత్ షా ఆరోపణలు గుప్పించారు. రాయబరేలిలో నిర్వహించిన మరొక ప్రసంగంలో, ఉత్తరప్రదేశ్‌లో బాహుబలిలు లేరు ... రాష్ట్రంలో బజరంగబలి మాత్రమే ఉంది అని అమిత్ షా పేర్కొన్నారు. 'ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్ ల పాలనలో పేదలు' మరింత నిరుపేదలుగా మారారని మండిపడ్డారు. పేదల మంచి కోసమే తమ ప్రభుత్వం ఉందని అమిత్ షా వెల్లడించారు.

ఆ పార్టీలు కులతత్వ రాజకీయాలు, కుటుంబ పాలన తప్ప చేసిందేముంది
ఉత్తరప్రదేశ్‌లో అత్త-మేనల్లుడి ప్రభుత్వం చాలా ఏళ్లు కొనసాగిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. వీరి పాలనలో అలకలు, బుజ్జగింపులు, కులతత్వం, కుటుంబ పాలన తప్ప చేసిందేమీ లేదు అని వెల్లడించారు. రాయ్ బరేలీ గాంధీ కుటుంబానికి కేంద్రంగా ఉన్నప్పటికీ బీజేపీ పాలన రాకముందు రాయ్‌బరేలీలో కరెంటు ఉందా? అని ప్రశ్నించారు. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం 22 నుండి 24 గంటలు కరెంటు అందజేస్తుందని హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు.

యూపీ శాంతిభద్రతలపై అఖిలేష్ యాదవ్ వ్యాఖ్యలపై కౌంటర్
పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందని పేర్కొన్న అమిత్ షా రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి పై అఖిలేష్ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. యూపీలోని బీజేపీ ప్రభుత్వం దోపిడీని 72 శాతానికి తగ్గించిందని, దొంగతనాలు 62 శాతానికి తగ్గాయని పేర్కొన్నారు. 31% హంతకులు, 29% కిడ్నాప్, 50% అత్యాచారం కేసులు ఉన్నాయని, గతంతో పోలిస్తే ఇది చాలా తక్కువ అని బిజెపి అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ లో వెల్లడించారు.

బీజేపీ గెలిస్తే ఇచ్చిన ప్రతి హామీ నేరవేరుస్తాం
ర్యాలీలలో ప్రసంగిస్తున్న అమిత్ షా బిజెపి నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతి సంవత్సరం రెండు ఉచిత గ్యాస్ సిలిండర్లను అందజేస్తామని హామీ ఇచ్చారు. "బిజెపి అధికారంలోకి వస్తే, హోలీ రోజున , దీపావళి రోజున రెండు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందజేస్తామని, ఆడపిల్లలకు చదువు కోసం స్కూటీని కూడా అందిస్తామని హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఈ ఎన్నికలలో మళ్ళీ బీజేపీకి పట్టం కడితే బీజేపీ ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications