ఘోరం.. భర్తను మంచానికి కట్టేసి తగలబెట్టిన భార్య!
నేటి ఆధునిక సమాజంలో క్షణిక సుఖాల కోసం, అక్రమ సంబంధాల వ్యామోహంలో పడి పవిత్రమైన బంధాలను నడిరోడ్డుపై బలిపీఠం ఎక్కిస్తున్నారు. కట్టుకున్నభర్తను కడతేర్చడానికి కూడా వెనుకాడనంతగా మనుషుల్లో మృగత్వం పెరిగిపోతోంది. నమ్మకం, ప్రేమానురాగాల స్థానంలో వంచన, క్రూరత్వం చోటుచేసుకుంటున్నాయి. ఈ అక్రమ బంధాల ఉచ్చులో పడి ఎన్నో పచ్చని సంసారాలు బూడిదవుతుంటే, మరికొన్ని కుటుంబాలు కోర్టులు, జైళ్ల చుట్టూ తిరుగుతూ నరకం అనుభవిస్తున్నాయి. కన్నపిల్లల భవిష్యత్తును సైతం గాలికొదిలేసి, మానవత్వాన్ని మంటగలుపుతున్నారు.
అలాంటి ఘటనే తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని సిద్ధార్థ్ నగర్ జిల్లాలో వెలుగు చూసింది. తన వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడనే కోపంతో ఓ మహిళ, ఆమె ప్రియుడు కలిసి భర్తను మంచానికి కట్టేసి సజీవ దహనం చేయడానికి ప్రయత్నించారు. ఈ ఘోరానికి పాల్పడిన భార్య పూజా గౌతమ్, ఆమె ప్రియుడు ఫిరోజ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మే 21న జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

బావనంటూ రెండేళ్లుగా గుట్టుచూ చప్పుడు కాకుండా..
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. సిద్ధార్థ్‌నగర్ జిల్లా రెహ్రా గ్రామానికి చెందిన లాల్జీ గౌతమ్ (28)కు ఎనిమిదేళ్ల క్రితం పూజాతో వివాహం జరిగింది. వీరికి ఏడేళ్లు, నాలుగేళ్ల వయసున్న ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే గత రెండేళ్లుగా పూజాకు ఫిరోజ్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం నడుస్తోంది. లాల్జీ గౌతమ్‌కు అనుమానం రాకుండా ఉండేందుకు ఫిరోజ్ ఆ ఇంటికి పూజకు 'బావ' వరస అవుతానంటూ నమ్మిస్తూ తరచూ వచ్చి వెళ్లేవాడు.
అసలు నిజం తెలవడంతో గొడవ
అయితే మే 21న ఫిరోజ్ అసలు బంధువే కాదనే నిజం భర్త లాల్జీ గౌతమ్‌కు తెలిసింది. పూజాతో అతనికి ఎలాంటి బంధుత్వం లేదని తెలియడంతో ఆ రోజు దంపతుల మధ్య తీవ్రమైన ఘర్షణ జరిగింది. తమ గుట్టు ఎక్కడ రట్టవుతుందోననే భయంతో పూజా, ఫిరోజ్ కలిసి లాల్జీని వదిలించుకోవాలని ఓ కిరాతక ప్లాన్ వేశారు. ఆ రాత్రి లాల్జీ గౌతమ్ నిద్రపోతున్న సమయంలో ఇద్దరూ కలిసి అతనిని మంచానికి కదలకుండా గట్టిగా కట్టేశారు. ఆపై అతనిపై ఆయిల్ పోసి నిప్పంటించారు.
నిందితులు అరెస్ట్.. బాధితుడి పరిస్థితి విషమం
లాల్జీ గౌతమ్ మంటల్లో కాలుతూ గట్టిగా కేకలు వేయడంతో, పక్కనే ఉన్న కుటుంబ సభ్యులు పరుగెత్తుకుంటూ వచ్చి మంటలను ఆర్పివేశారు. కానీ, అప్పటికే లాల్జీ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం అతను బస్తీలోని మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో అత్యవసర చికిత్స పొందుతున్నాడని, అతని పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని పోలీసులు వెల్లడించారు. లాల్జీ తండ్రి ఘమ్మాల్ ప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మంగళవారం స్థానిక బస్టాండ్ వద్ద నిందితులిద్దరినీ అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.












Click it and Unblock the Notifications