యూపీ స్ధానిక పోరులో బీజేపీ జైత్రయాత్ర-కార్పోరేషన్లలో క్లీన్ స్వీప్-పంచాయతీల్లోనూ హవా..
ఉత్తర్ ప్రదేశ్ లో ఈ నెలలో రెండు విడతలుగా జరిగిన స్ధానిక సంస్ధల ఎన్నికల్లో బీజేపీ జయకేతనం ఎగురవేసింది. సీఎం యోగీ ఆదిత్యనాథ్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ఎన్నికల్లో అనుకున్నట్లుగానే ఓబీసీ కోటా అమలు చేయడంతో పాటు తనదైన వ్యూహాలు రచించారు. ఈ ఎన్నికల ఫలితాలు ఇవాళ వెలువడుతున్నాయి. ఇందులో ఎన్నికలు జరిగిన అన్ని కార్పోరేషన్లను క్లీన్ స్వీప్ చేసిన కాషాయ పార్టీ.. పంచాయతీల్లోనూ దూసుకుపోతోంది.
ఉత్తర్ ప్రదేశ్ లో తాజాగా ఎన్నికలు నిర్వహించిన 17 కార్పోరేషన్లలో అన్నింటిలోనూ బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. దీంతో ఈ 17 కార్పోరేషన్ల మేయర్ పదవుల్నీ బీజేపీ చేజిక్కించుకోబోతోంది. అలాగే నగర పంచాయతీలు, నగర నిగమ్, నగర పాలిక పరిషత్ లలోనూ బీజేపీ హవా కొనసాగుతోంది. బీజేపీ గెల్చుకున్న కార్పోరేషన్లలో ఝాన్సీ, అయోధ్య, బరేలీ, సహరాన్‌పూర్, ఘజియాబాద్, మథుర, మొరాదాబాద్‌తో పాటు మరికొన్ని ఉన్నాయి.

యూపీ నగర పాలికల్లో 199 సీట్లకు ఎన్నికలు జరిగాయి. వీటిలో బీజేపీ 98 గెల్చుకుంది. సమాజ్ వాదీ పార్టీకి 38, బీఎస్పీకి 18, కాంగ్రెస్ కు 6 దక్కాయి. ఈ సీట్లలో ఛైర్మన్ పదవుల్ని ఆయా పార్టీలు దక్కించుబోతున్నాయి. అలాగే వీటిలో సభ్యుల పదవుల్లో మొత్తం 5327 ఉండగా.. వీటిలో ఇప్పటివరకూ 952 సీట్లకు ఫలితాలు వెలువడ్డాయి. ఇందులోనూ బీజేపీ 215 దక్కించుకుని ఆధిక్యంలో కొనసాగుతోంది. సమాజ్ వాదీ పార్టీ 71, బీఎస్పీ31, కాంగ్రెస్ కు 21 దక్కాయి.
యూపీ స్ధానిక సంస్ధల ఎన్నికల్లో బీజేపీ విజయదుందుభి మోగించడంపై సీఎం యోగీ ఆదిత్యనాథ్ స్పందించారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి పట్టుదలతో పాటుపడుతోందన్నారు. ప్రధాని మోదీ మార్గదర్శకత్వంతో ఉత్తరప్రదేశ్‌లో స్థిరమైన పురోగతి సాధించేందుకు కట్టుబడి ఉన్నామని సీఎం యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు. యూపీ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో విజయంపై సిఎం యోగి ఆదిత్యనాథ్, యూపీ బీజేపీ అధ్యక్షుడు చౌదరి భూపేంద్ర సింగ్‌లను కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభినందించారు.












Click it and Unblock the Notifications