వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆంధ్రప్రదేశ్‌లో యురేనియం తవ్వకాలు: 'పొలాలు బీడువారుతున్నాయి... మనుషులకు వింత రోగాలొస్తున్నాయి'

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
కడప యురేనియం ప్రాజెక్టు

యురేనియం కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సంస్థ తన కార్యకలాపాలు విస్తరించే ప్రయత్నాలు ప్రారంభించింది. కడప జిల్లాలోని పులివెందుల నియోజకవర్గంలో యురేనియం తవ్వకాల సామర్థ్యాన్ని ఇంకా పెంచేందుకు కూడా ప్రయత్నాలు మొదలయ్యాయి.

అందుకు అనుగుణంగా ఈనెల 6వ తేదీన ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని నిర్ణయించారు. అయితే, దీనిపై అభ్యంతరం వ్యక్తంచేస్తూ మానవ హక్కుల కార్యకర్త కాకుమాను జయశ్రీ హైకోర్టులో పిటిషన్ వేయగా, న్యాయస్థానం స్టే ఇచ్చింది. స్టేను తొలగించాలన్న యూసీఐఎల్ అభ్యర్థనను తోసిపుచ్చింది. దాంతో, ప్రజాభిప్రాయ సేకరణ నిరవధికంగా వాయిదా పడింది.

అయితే, ఇప్పటికే ఉన్న గనులతో అవస్థలు పడుతున్నామని, కొత్త సమస్యలు తీసుకొచ్చే ప్రయత్నాలను అడ్డుకుంటామని స్థానికులు చెబుతున్నారు. పర్యావరణ నియంత్రణ మండలి షోకాజ్ నోటీసు ఇచ్చి, చర్యలు కూడా తీసుకోకుండా ఎలా విస్తరణ చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు.

ఆందోళన చేస్తున్న స్థానికుల సమస్యలన్నీ పరిష్కరిస్తామని యూసీఐఎల్ చెబుతోంది.

కడప యురేనియం ప్రాజెక్టు

వైఎస్సార్ హయంలో ప్రారంభం

కడప జిల్లాలో వివిధ రకాల ఖనిజ వనరులున్నాయి. అందులో ముగ్గురాయి (బెరైటీస్), సున్నపురాయి (లైం స్టోన్ ), రాతినార (అస్బెస్టోస్), కణికరాయి (క్వార్ట్జ్), స్టీయైట్, యురేనియం, గ్రానైట్, కడప నాపరాయి (నాప స్లాబ్స్ ) ఉన్నాయి.

దీంతో యూసీఐఎల్ ఆధ్వర్యంలో కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని వేముల మండలం తుమ్మలపల్లిలో పరిశ్రమ ఏర్పాటు కోసం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఆయన సొంత నియోజవర్గంలో యురేనియం తవ్వకాలకు అంగీకరించడం పట్ల పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు.

2006లో యురేనియం మైనింగ్ కోసం సన్నాహాలు చేసిన సమయంలో తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమైంది. ప్రజాభిప్రాయసేకరణ సందర్భంగా రాళ్లదాడి కూడా జరగడంతో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. అయినప్పటికీ చివరకు ప్రభుత్వం పట్టుదలతో పరిశ్రమ ఏర్పాటుకి ముందుకెళ్లింది.

తుమ్మలపల్లి, కేకే కొట్టాల, మబ్బుచింతలపల్లి, రాచకుంటపల్లి, భూమయ్యగారిపల్లె గ్రామాల రైతులు చివరకు తమ భూములు అప్పగించేందుకు సిద్ధం కావడంతో 1,820 ఎకరాల్లో తవ్వకాలను ప్రారంభించారు. రూ.1,106 కోట్ల వ్యయంతో 2007లో ప్లాంటు నిర్మాణం మొదలైంది. 2013 ఏప్రిల్ 20న అధికారికంగా యురేనియం ఉత్పత్తి ప్రారంభించారు.

కడప యురేనియం ప్రాజెక్టు

'పొలాలు బీడుగా మారుతున్నాయి’

ఎనిమిదేళ్లుగా తుమ్మలపల్లి యూసీఐఎల్ యూనిట్ నుంచి ఉత్పత్తి జరుగుతోంది.

దాని ప్రభావం సమీప గ్రామాల ప్రజలు, పంటలు, భూగర్భ జలాలపై పడిందని అనేక మంది చెబుతున్నారు. ఆరోగ్య సమస్యలతో సమమతం అవుతున్నామని స్థానికులు వాపోతున్నారు. పంటల దిగుబడి పడిపోయిందని, తాగునీరు కలుషితమై అనేక సమస్యలు వస్తున్నాయని చెబుతున్నారు.

ఇటీవల కొన్ని ప్రాంతాల్లో భూమిలో పగుళ్లు రావడానికి కూడా యురేనియం ప్లాంట్ ప్రధాన కారణమని ఆరోపిస్తున్నారు. తమకు తొలి దశ ప్లాంట్ నిర్మాణంలో భాగంగా ప్రకటించిన నష్టపరిహారానికి అనుగుణంగా ఉద్యోగ హామీలు కూడా నెరవేరలేదని చెబుతున్నారు.

''యూసీఐఎల్ మైనింగ్ ప్రారంభించిన తర్వాత భూగర్భ జలాలు అడుగంటాయి. ఒకప్పుడు 300 అడుగులకే బోర్లు పడేవి. ఇప్పుడు 800 అడుగుల లోతులో తవ్వినా బోర్లు పడటం లేదు. రోజుకి 20 టన్నులు పైబడిన పేలుడు పదార్థాలు ఉపయోగించి మైనింగ్ చేస్తున్నారు. సమీపంలో పలు పొలాల్లో భూమి బీటలు వారింది. నీటి సమస్య ఏర్పడుతుందని వైఎస్సార్ ప్రభుత్వంలోనే గుర్తించారు. అలాంటి పరిస్థితి వస్తే యూసీఐఎల్‌దే బాధ్యత అని నాటి ముఖ్యమంత్రి చెప్పారు. టెయిల్ పాండ్ మూలంగా బోరు నీరు కూడా కలుషితం అయిపోతోంది. పంటల దిగుబడి పడిపోయింది. అనేక మంది పొలాలను బీడులుగా వదిలేశారు’’ అని మాజీ సర్పంచ్ చాపాటి శ్రీనాథ్ రెడ్డి బీబీసీతో చెప్పారు.

''ఆరోగ్య సమస్యలు కూడా వస్తున్నాయి. మహిళలకు గర్భస్రావాలు అవుతున్నాయి. క్యాన్సర్, కంటి జబ్బులు, చర్మ వ్యాధులు కూడా అత్యధికుల్లో ఉన్నాయి. ఇవన్నీ 2006లోనే ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన సమస్యలు. అన్నింటినీ పరిష్కరిస్తామని, ప్రజా జీవనానికి ఆటంకం రాకుండా చూస్తామని నాడు చెప్పారు. కానీ నేడు భిన్నంగా సాగుతోంది. పైగా ఇప్పుడు సామర్థ్యం పెంచితే రేడియేషన్, నీటి కాలుష్యం మరింత పెరుగుతాయి’’ అని ఆయన అన్నారు.

కడప యురేనియం ప్రాజెక్టు

'ఎవరికి చెప్పుకోవాలి?’

యురేనియం తవ్వకాలకు ముందు పరిస్థితి వేరు, ఇప్పుడు వేరు అన్నట్టుగా ఉందన్నది అత్యధికుల అభిప్రాయం. పంట నష్టం, భూగర్భ జలాలతో పాటుగా ఆరోగ్య సమస్యలతో అంతా సతమతం అవుతున్నారని పలు గ్రామాల్లో స్థానికులు బీబీసీకి తెలిపారు.

అంతు చిక్కని సమస్యలతో కొందరు, చర్మ, క్యాన్సర్ సంబంధిత సమస్యలతో ఎక్కువ మంది సతమతం అవుతున్నారని అంటున్నారు. సమస్య ఉందని అందరికీ తెలిసినప్పటికీ యూసీఐఎల్ గానీ, ప్రబుత్వం గానీ తమను పట్టించుకోవడం లేదని కె కె కొట్టాల గ్రామానికి చెందిన శ్యామల బీబీసీతో అన్నారు.

''మాలో అందరికీ ఆరోగ్య సమస్యలున్నాయి. కొందరు చెప్పుకుంటున్నారు. చెబితే ఏమొస్తుందిలే అని ఎక్కువ మంది దాచిపెడుతున్నారు. అవి ముదిరి ఆసుపత్రిపాలు కావాల్సి వస్తోంది. ఈ రెండేళ్లలో హఠాత్తుగా ఆరోగ్య సమస్యలు వచ్చి, వయసులోనే చనిపోయిన వాళ్లు మా ఒక్క ఊళ్లోనే ఐదారుగురున్నారు. అయినా ఎవరూ ఏమీ చేయడం లేదు, ఊరికి వచ్చి ఏవో మాటలు చెప్పడమే తప్ప చేతలు లేవు. రెండేళ్లలో మా ఊరి సమస్యలు తీరుస్తామన్నారు. కానీ పట్టించుకున్న వాళ్ల లేరు. అందుకే మా వాళ్లు కూడా ఉంటే ఉంటాం, లేదంటే లేదన్నట్టుగా బతుకుతున్నారు’’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

కడప యురేనియం ప్రాజెక్టు

యూసీఐఎల్‌కు షోకాజ్ నోటీసు

కాలుష్యం, రేడియేషన్ సమస్యలను నివారించేందుకు యూసీఐఎల్ పలు చర్యలు తీసుకోవాల్సి ఉంది. కేంద్ర పర్యావరణ,అటవీ శాఖ నిబంధనల ప్రకారం 900 ఎకరాల్లో గ్రీన్ బెల్ట్ నిర్వహించాల్సి ఉంది.

అందుకు భిన్నంగా మైనింగ్, ప్లాంట్ నిర్వహణ జరుగుతున్నాయంటూ గతంలో వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ప్రధానికి లేఖ కూడా రాశారు. అనంతరం పార్లమెంట్ జీరో అవర్‌లో కూడా యూసీఐఎల్ ప్రభావిత ప్రాంత సమస్యలను ప్రస్తావించారు.

ఆ తర్వాత పర్యావరణ శాఖ అధికారులు పలు పరీక్షలు నిర్వహించారు. బోరు నీటిలో యురేనియం పాళ్లు అత్యధికంగా ఉన్నట్టు గుర్తించారు. దానికి కారకులుగా పరిగణిస్తూ యూసీఐఎల్‌కు 2019 ఆగస్టు 7న షోకాజ్ నోటీసు కూడా జారీ అయ్యింది.

''షోకాజ్ నోటీసు ఇచ్చిన తర్వాత కూడా యూసీఐఎల్ ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. ఏడు గ్రామాల ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారు. అర్హులైన భూ నిర్వాసితులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఇచ్చిన హామీలు అమలు చేయలేదు. భూములు కోల్పోయిన రైతులు, కూలీలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. భూమయ్యగారి పల్లెలో కూడా పలు బోర్లు పనికిరాకుండా పోయాయి. భూమి పొరలు కంపించడంతో నీటి దారులు మూసుకుపోవడం వల్ల ఇలాంటి పరిస్థితి వచ్చి ఉంటుందని నిపుణులు కూడా చెబుతున్నారు. రాచకంటపల్లె వాసులకి కూడా సమస్యలున్నాయి. వాటన్నింటినీ పరిష్కరించకుండా విస్తరణ ప్రయత్నాలు సమంజసం కాదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆలోచించాలి’’ అని అంటూ మాజీ సర్పంచ్ బి రాఘవేంద్ర రెడ్డి బీబీసీతో అన్నారు.

కడప యురేనియం ప్రాజెక్టు

'మూడు కమిటీలు ఏమయ్యాయి?’

తుమ్మలపల్లి వద్ద యూసీఐఎల్ ఉత్పత్తి సామర్థ్యం 9 లక్షల టన్నుల నుంచి 13.5 టన్నులకు పెంచుకోవడం కోసం జరుగుతున్న ప్రయత్నాలపై పలువురు పర్యావరణవేత్తలు కూడా నిరసన తెలుపుతున్నారు.

టెయిలింగ్ పాండులో వ్యర్థజలాలు ఇంకకుండా నిరోధించగల స్థాయిలో లైనింగ్ వేసిన దాఖలాలు లేవని ఇప్పటికే పీసీబీ కమిటీ నిర్ధారించింది. నీటి కాలుష్యానికి టెయిలింగ్ పాండులోని వ్యర్థజలాలు భూమిలోకి ఇంకి భూగర్భజలాల్లో కలవడం కూడా ఓ కారణమై ఉండవచ్చని కూడా ప్రకటించింది.

అదే సమయంలో బోర్ల నుంచి సేకరించిన నీటి నాణ్యత, నీటిమట్టాలకు సంబంధించి పూర్తి వివరాలతో కూడిన డేటా పీసీబీ దగ్గర గానీ ఇటు యూసీఐఎల్ దగ్గర గాని లేనందున నీటి కాలుష్యానికి గల కారణాలను కచ్చితంగా నిర్ధరించలేకపోయినట్లు తన నివేదికలో పేర్కొంది.

దీనిపై శాస్త్రవేత్త డాక్టర్ బాబూరావు పలుమార్లు ప్రభుత్వాలకు లేఖలు రాశారు. డేటా లేదనే సాకుతో బాధితుల సమస్యలు పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆయన అంటున్నారు.

''ప్రభుత్వం పోయిన ఏడాది మూడు కమిటీలను వేసింది. ఆ నివేదికల సారాంశం మాత్రం వెల్లడించలేదు. స్విమ్స్‌కు చెందిన ప్రొఫెసర్లతో వేసిన కమిటీ నివేదికలో కూడా అరొకర పరిశీలన జరిగింది. అయినా ఆ నివేదిక ప్రకారం పంటల పరిస్థితి గురించి 15 రోజుల్లో తేల్చాలని చెప్పారు. ప్రజలకు ఆరోగ్య సమస్యలు ఎందుకు వస్తున్నాయన్నది పరిశీలన కోసం చేసిన సూచనలు కూడా అమలు జరగలేదు. వ్యర్థజలాల మూలంగా పెరుగుతున్న కాలుష్య ప్రభావంపై స్పష్టత ఇవ్వలేదు. తొలుత గతంలో ఇచ్చిన రిపోర్టుల ఆధారంగా చర్యలు తీసుకుని, ఆ తర్వాత విస్తరణ కోసం ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లాల్సి ఉంది. కానీ అలా చేయడం లేదు’’ అని బాబూరావు అన్నారు.

''పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖకు చెందిన బృందం చెన్నై నుంచి వచ్చి పరిశీలించింది. ఆ కమిటీ రిపోర్టులో 9 రకాల నిబంధనల ఉల్లంఘనలను ప్రస్తావించారు. వాటి జోలికి కూడా పోలేదు. కాలుష్య నియంత్రణ మండలి షోకాజ్ నోటీసు ఇచ్చినా చర్యలు లేవు. టెయిలింగ్ పాండ్ వ్యర్థ జలాలు భూగర్భంల చేరకుండా ఎటువంటి చర్యలు లేవు. అయినా ఇప్పుడు విస్తరణ చేయడం నిబంధనలకు పూర్తి విరుద్ధం’’ అని ఆయన అభిప్రాయపడ్డారు.

కడప యురేనియం ప్రాజెక్టు

'ప్రజాభిప్రాయం ప్రకారమే నిర్ణయం’

యురేనియం గని విస్తరణ కోసం జనవరి 6న జరగబోతున్న ప్రజాభిప్రాయ సేకరణకు వ్యతిరేకంగా ఇప్పటికే పలువురు ఆందోళన బాట పట్టారు. ప్రభుత్వానికి వినతిపత్రాలు అందిస్తూ, నిరసన ప్రదర్శనలు కూడా చేపట్టారు.

ఇప్పటికే రైతుల నుంచి సేకరించిన భూములకు పరిహారం చెల్లించకుండా అదనంగా ప్రస్తుతం విస్తరణ పేరుతో మరో 420 ఎకరాల భూ సేకరణకు నోటిఫికేషన్ ఇవ్వడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సేకరించాల్సిన భూమిలో 70 శాతం భూములు రాచకుంటపల్లెకు చెందినవే ఉండడంతో తమకు పూర్తి స్థాయిలో పరిహారం, ఉద్యోగ హామీ వంటివి అమలు చేయాలని వారు కోరుతున్నారు.

మరోవైపు ప్రభుత్వం మాత్రం విస్తరణకు సానుకూలంగా ఉన్నట్టు కనిపిస్తోంది. దానికి అనుగుణంగా అడుగులు వేస్తోంది. ప్రజాభిప్రాయ సేకరణలో నిర్ణయానికి అనుగుణంగా తదుపరి చర్యలుంటాయని ఏపీ కాలుష్య నియంత్రణ బోర్డు అధికారులు చెబుతున్నారు.

యూసీఐఎల్ జనరల్ మేనేజర్ ఎం.ఎస్.రావు

'అన్ని చర్యలూ తీసుకుంటున్నాం’

యురేనియం సేకరణ పనుల విస్తరణకు అడ్డంకులు లేవని యూసీఐఎల్ జనరల్ మేనేజర్ ఎంఎస్ రావు అంటున్నారు. స్థానికుల సమస్యలను కూడా ప్రస్తావిస్తున్నామని, కాలుష్యానికి సంబంధించి సాగుతున్న ప్రచారం వాస్తవం కాదని ఆయన చెబుతున్నారు.

"యూసీఐఎల్ కారణంగా కాలుష్య సమస్య వచ్చిందన్నది వాస్తవం కాదు. సహజంగా ఈ ప్రాంతంలో ఉన్న యురేనియం నిల్వల మూలంగా భూగర్భ జలాల్లో కొంతమేరకు ప్రభావం ఉంటుంది. అది గతం నుంచీ ఉన్న సమస్యే. టెయిలింగ్ పాండ్ ద్వారా సమస్యలు ఉత్పన్నం కాకుండా అన్ని చర్యలు తీసుకున్నాం. పర్యవేక్షణ సక్రమంగా సాగుతోంది. ఎప్పటికప్పుడు అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బాడీ ద్వారా శాంపిల్స్ సేకరించి, పరీక్షలు చేస్తున్నారు. గ్రీన్ బెల్ట్ నిర్వహణ జరుగుతోంది’’ అని ఆయన చెప్పారు.

''నిత్యం వివిధ రకాల పరీక్షలు చేస్తూ స్థానికుల ఆరోగ్యం కోసం అన్ని జాగ్రత్తలు పాటిస్తున్నాం. నిర్ధారణ కాని ఆరోపణలకు యూసీఐఎల్ బాధ్యత వహించదు. స్థానిక ప్రజల్లో అవగాహన పెంచే ప్రయత్నం నిత్యం చేస్తున్నాం. విస్తరణకు అడ్డంకులు ఉండవనే భావిస్తున్నాం. అదనంగా సేకరించాల్సిన భూమి, దానికి పరిహారం సకాలంలో చెల్లిస్తాం. స్థానికులకు ఉపాధి కల్పన విషయంలో హామీ మేరకు చర్యలు తీసుకుంటున్నాం" అని వివరించారు.

ఇటీవల పులివెందుల పర్యటనకు వచ్చిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమ సమస్యపై స్పందించలేదని స్థానికులు వాపోతున్నారు. తన తండ్రి జోక్యంతో స్థాపించిన యూనిట్ ఇప్పుడు విస్తరణ జరుగుతున్న సమయంలో వస్తున్న సమస్యలను ఆయన పరిష్కరించాలని వారు కోరుతున్నారు.

ఇప్పటికే వైఎస్సార్సీపీ నేతలు విపక్షంలో ఉన్నప్పుడు ఈ అంశంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన విషయాన్ని వారు గుర్తుచేస్తున్నారు.

ఇక స్థానికుల డిమాండ్లను నెరవేర్చాలని ప్రభుత్వం తరపున ఒత్తిడి తెస్తామని ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అంటున్నారు. యూసీఐఎల్ పూర్తిగా నిబంధనలు పాటించేలా చూస్తామని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Uranium mining in Andhra Pradesh
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X