వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికా ఎన్నికల ఫలితాలు: అధ్యక్షుడు ఎవరైనా భారత్‌తో సంబంధాలు ఎలా ఉంటాయి?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
అమెరికా ఎన్నికలు, ట్రంప్, మోదీ

అమెరికా అధ్యక్ష పీఠం డోనల్డ్ ట్రంప్, జో బైడెన్‌లలో ఎవరికి దక్కినా, ఆ దేశంతో భారత్ సంబంధాల్లో వచ్చే మార్పులు పెద్దగా ఉండవని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. భారత్ విషయంలో డెమొక్రటిక్ పార్టీ, రిపబ్లికన్ పార్టీ అనుసరించే విదేశాంగ వైఖరిలో పెద్దగా తేడా లేకపోవడమే వారు ఇలా చెబుతుండటానికి కారణం.

ట్రంప్‌తో భారత ప్రధాని మోదీ దోస్తీ చూసినవారికి, బైడెన్ గెలిచినా అమెరికా.. భారత్‌తో అలాగే ఉంటుందా ఉన్న సందేహం రావొచ్చు.

అయితే, ఈ విషయమై విదేశాంగ శాఖలోని అధికారులు, నిపుణులు మరీ ఎక్కువ ఆలోచించడం లేదు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్న ఆసక్తి ఉంది గానీ, దాని వల్ల భారత్‌తో సంబంధాలు ఎలా మారతాయోనన్న బెంగ మాత్రం భారత విదేశాంగ శాఖలో కనిపించడం లేదు.

అమెరికా ఎన్నికలు

అధికారం మారినా, విదేశాంగ విధానానికి సంబంధించిన పరిస్థితులు మారిపోవు. అమెరికా ప్రాధాన్యాలు మారిపోవు.

విదేశాంగ విధానం అమలులో ట్రంప్, బైడెన్‌ల వైఖరులు భిన్నంగా ఉండొచ్చు. కానీ, వారి ఉద్దేశాలు ఒకేలా ఉంటాయి.

అంతర్జాతీయ వ్యవహారాల విషయంలో అందరి అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకుని జో బైడెన్ నిర్ణయాలు తీసుకుంటారని ఆయన తీరు గురించి తెలిసిన విశ్లేషకులు అంటున్నారు. ట్రంప్‌పై మాత్రం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటారన్న ఆరోపణ ఉంది.

ప్రస్తుతం అమెరికాకు అత్యంత ఆందోళన కలిగిస్తున్న అంశం చైనా. ఈ అభిప్రాయం రిపబ్లికన్ పార్టీ, డెమొక్రటిక్ పార్టీ రెండింటిలోనూ ఉంది. ఈ ఎన్నికల్లో ట్రంప్, బైడెన్‌ల్లో ఎవరు అధికారంలోకి వచ్చినా, చైనా అంతర్జాతీయ పెత్తనాన్ని తగ్గించేందుకే కృషి చేస్తారు. చైనాతో 'టారిఫ్ యుద్ధాన్ని' కొనసాగిస్తారు.

జో బైడెన్, అమెరికా ఎన్నికలు

చైనా మాత్రం వైట్‌హౌస్‌లో ట్రంప్ ఉండాలని కోరుకుంటుండొచ్చని భారత మాజీ దౌత్యవేత్త పినాక్ రంజన్ చక్రవర్తి అన్నారు.

''ట్రంప్ విషయంలో చైనా మరీ అసంతృప్తితో ఉందని నేను అనుకోవడం లేదు. విభేదాలు ఉన్నా, ట్రంప్ డీల్ మేకర్ అని చైనాకు తెలుసు. ట్రంప్‌తో వాళ్లు ఒప్పందాలు చేసుకోగలరు'' అని ఆయన అభిప్రాయపడ్డారు.

బైడెన్ వచ్చినా అమెరికా, చైనా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతాయని, ఈ విషయం భారత్‌ పరిగణనలోకి తీసుకోవడం ముఖ్యమని విశ్లేషకులు అంటున్నారు.

చైనాతో భారత్‌కు కూడా వివాదాలు ఉన్నాయి. తూర్పు లద్దాఖ్‌లో చైనా దుందుడుకు వైఖరి ప్రదర్శిస్తోంది. ఆ దేశ సైనికులు భారత భూభాగంలోకి చొరబడ్డారన్న ఆరోపణలు కూడా వచ్చాయి.

అమెరికా ఎన్నికలు, ట్రంప్, జిన్‌పింగ్

'అమెరికాకు భారత్ అవసరం’

చైనాకు వ్యతిరేకంగా తమ దేశంతో చేతులు కలపాలని ట్రంప్ భారత్‌ను కూడా ఆహ్వానించారు.

అమెరికాతో భారత్ సాన్నిహిత్యం పెరిగింది. అయితే, చైనాను ఎదుర్కొంనేందుకు భారత్ అనుసరిస్తున్న వ్యూహం మాత్రం ట్రంప్ తీరుకు భిన్నంగా ఉంది.

''చైనా విషయమై భారత్, అమెరికా మధ్య అంగీకారం ఉంది. కానీ, కొంత కాలం క్రితం భారత విదేశాంగ మంత్రి జయ్‌శంకర్ తాము అమెరికా కళ్లద్దాల నుంచి చైనాను చూడబోమని ఆ దేశానికి స్పష్టం చేశారు'' అని మాజీ దౌత్యవేత్త సురేంద్ర కుమార్ బీబీసీతో అన్నారు.

''చైనాపై అమెరికాలోని రెండు పార్టీలకూ ద్వేషం ఉంది. చైనాతో టారిఫ్ యుద్ధం చేయడమే కాదు, దాని అంతర్జాతీయ పెత్తనాన్ని తగ్గించడం అమెరికా లక్ష్యం. అంతర్జాతీయ శక్తిగా తాము ఉన్న స్థానాన్ని చైనా భర్తీ చేయకుండా అడ్డుకోవాలని అమెరికా అనుకుంటోంది. అడ్డుకోలేకపోయినా, ఆలస్యమైతే చేయొచ్చు. భారత్‌కు ఈ ఉద్దేశం లేదు. మన దేశ సరిహద్దుల్లో శాంతి ఉండాలని, పొరుగు దేశాలతో బలమైన సంబంధాలు ఉండాలని భారత్ ఆశిస్తోంది'' అని ఆయన అన్నారు.

సరిహద్దు ఉద్రిక్తతల గురించి మాట్లాడినప్పుడు ప్రధాని మోదీ నేరుగా చైనా పేరు ప్రస్తావించకుండా ఉండటానికి ఇదే కారణమై ఉండొచ్చు. ఈ విషయమై ఆయన విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. చైనా పొరుగు దేశమని, దానితో చిరకాల ఉద్రిక్తతలు తలెత్తేలా చేసుకోవడం మంచిది కాదని మోదీ ప్రభుత్వం భావిస్తోంది.

చైనాతో సాన్నిహిత్యం భారత్‌కు మంచిదని ప్రభుత్వం భావిస్తే, అమెరికాలో ఎవరు అధ్యక్షుడైనా వచ్చే తేడా ఏమీ ఉండదని మాజీ దౌత్యవేత్త, ముంబయిలోని 'గేట్‌వే హౌస్' మేధో మథన సంస్థకు చెందిన నీలమ్ దేవ్ అభిప్రాయపడ్డారు.

''ఎవరు అధికారంలోకి వస్తారన్నదానితో సంబంధం లేకుండా, అమెరికాతో మంచి సంబంధాలు కొనసాగించడం అవసరం. అలా అని చైనాతో వైరం పెంచుకోకూడదు'' అని స్వీడన్‌లోని ఉప్సాలా యూనివర్సిటీ ప్రొఫెసర్ అశోక్ స్వైన్ అన్నారు.

''చైనాపై ఒత్తిడి పెంచేందుకు అమెరికాకు భారత్ అవసరం. ట్రంప్‌తో మోదీకి మంచి సంబంధాలు ఉన్నాయి. గత ఫిబ్రవరిలో గుజరాత్‌లోని ఓ స్టేడియంలో ట్రంప్ గౌరవార్థం భారీ కార్యక్రమాన్ని మోదీ ఏర్పాటు చేశారు. అమెరికా, భారత్ మధ్య సంబంధాలు మునుపెన్నడూ లేనంత బలంగా ఉన్నాయని అప్పుడు ట్రంప్ అన్నారు'' అని వివేకానంద ఫౌండేషన్ అనే మేధో మథన సంస్థకు చెందిన ఎ.సూర్యప్రకాశ్ అన్నారు.

అమెరికా ఎన్నికలు, ట్రంప్

20 ఏళ్లుగా భారత్, అమెరికా సంబంధాలు మెరుగుపడుతూ వస్తున్నాయని నీలమ్ దేవ్ అభిప్రాయపడ్డారు.

ప్రచ్ఛన్న యుద్ధ కాలం నుంచి భారత్ అలీన విధానాన్ని అనుసరిస్తూ వచ్చింది. కానీ, 2000లో అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ భారత్‌లో ఓ చరిత్రాత్మక పర్యటన చేశారు. అమెరికా వైపు భారత్‌ను ఆకర్షించే ప్రయత్నం చేశారు.

క్లింటన్ పర్యటన ఆరు రోజులపాటు సాగింది. అమెరికా అధ్యక్షుల భారత పర్యటనల్లో ఇదే సుదీర్ఘమైంది. ఈ పరిణామం భారత్, అమెరికా సంబంధాల్లో కీలక మలుపు. క్లింటన్‌ది డెమొక్రటిక్ పార్టీ.

క్లింటన్ తర్వాత అమెరికా అధ్యక్ష పదవి చేపట్టిన రిపబ్లికన్ నేత జార్జ్ బుష్ కూడా భారత్‌లో పర్యటించారు. కీలకమైన అణు ఒప్పదం చేసుకున్నారు. బుష్ తర్వాత అధ్యక్ష పదవి చేపట్టిన డెమొక్రటిక్ పార్టీ నేత బరాక్ ఒబామా భారత్‌లో రెండు సార్లు పర్యటించారు.

కశ్మీర్ విషయంలో...

జో బైడెన్ గెలిస్తే, భారత సంతతికి చెందిన కమలా హారిస్ ఉపాధ్యక్ష పదవి చేపట్టనున్నారు. అయితే, ఆమె ఇదివరకు కశ్మీర్‌లో మానవహక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నట్లు వచ్చిన ఆరోపణల విషయమై భారత ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించేలా మాట్లాడారు.

కమలా హారిస్ తల్లి చెన్నైలో పుట్టారు. ఆమె తండ్రి జమైకా మూలాలు కలిగినవారు.

కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని భారత్ రద్దు చేసిన తర్వాత కమలా హారిస్ భారత ప్రభుత్వాన్ని విమర్శిస్తూ మాట్లాడారు.

''మేం గమనిస్తున్నాం. కశ్మీర్‌లో పరిస్థితి మారితే, జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఈ ప్రపంచంలో కశ్మీరీలు ఒంటరివారు కాదని మేం గుర్తుచేయాలనుకుంటున్నాం'' అని గత ఏడాది అక్టోబర్‌లో కమలా వ్యాఖ్యానించారు.

కమలా హ్యారిస్, అమెరికా ఎన్నికలు

అమెరికా కాంగ్రెస్ సభ్యురాలు ప్రమీలా జయ్‌పాల్ గతంలో అమెరికా ప్రతినిధుల సభలో కశ్మీర్ అంశమై భారత్‌కు వ్యతిరేకంగా తీర్మానం ప్రవేశపెట్టారు. దీంతో ఆమె పాల్గొనే ఓ సమావేశంలో పాల్గొనేందుకు భారత విదేశాంగ మంత్రి ఎస్.జయ్‌శంకర్ నిరాకరించారు. ఈ సమయంలో ప్రమీలాకు కమలా హారిస్ మద్దతు తెలిపారు.

ఇటు మోదీ ప్రభుత్వం తెచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని స్వయంగా జో బైడెన్ విమర్శించారు.

అయితే, ఈ అంశాలపై ఆందోళనపడాల్సిన అవసరం లేదని నీలమ్ దేవ్ అంటున్నారు.

''కశ్మీర్ అంశంపై డెమొక్రటిక్ పార్టీ నేతలు మాట్లాడటం నిజమే. అయితే, ఇదివరకు డెమొక్రటిక్ పార్టీ వాళ్లు దేశ అధ్యక్షులుగా ఉన్న సమయంలోనూ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. రెండు దేశాల మధ్య సంబంధాలపై అవి చూపే ప్రభావమేమీ లేదు'' అని ఆమె అభిప్రాయపడ్డారు.

భారత్, అమెరికాల మధ్య ఆర్థిక, సైనిక, రాజకీయ, దౌత్య పరమైన సంబంధాలు చాలా లోతుగా ఉన్నాయి. సంబంధాలను ఇంకా మెరుగుపరుచుకునేందుకు రెండు దేశాలు 50 వర్కింగ్ గ్రూప్స్‌ను ఏర్పాటు చేసుకున్నాయి. రాబోయే రోజుల్లో ఈ గ్రూప్స్ సమావేశాలు జరుగుతూ ఉంటాయని, రెండు దేశాల మధ్య విభేదాలను తొలగించుకునేందుకు ఓ వ్యవస్థ ఉందని భారత విదేశాంగశాఖ తెలిపింది.

బంధాలు బలోపేతమవ్వడం వల్ల భారత్, అమెరికా రెండింటికీ ఉపయోగమే. అందుకే, అమెరికా అధ్యక్ష పదవి ఎవరు చేపట్టినా, వాటిని మరింత మెరుగుపరుచుకోవడంపైనే దృష్టి పెడతారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
US president Relations with India
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X