భారత్ లోని యూఎస్ ఉద్యోగులకు, భారత్ వెళ్ళే మహిళలకు యూఎస్ షాకింగ్ హెచ్చరిక
భారతదేశంలో ఒంటరిగా ప్రయాణించే తమ పౌరులు, ముఖ్యంగా మహిళలు జాగ్రత్తగా ఉండాలని యూఎస్ హెచ్చరికలు జారీ చేసింది. భారతదేశానికి వచ్చే అమెరికన్లకు అమెరికా ప్రభుత్వం జారీ చేసిన ట్రావెల్ అడ్వైజరీ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అమెరికా విదేశాంగ శాఖ లెవెల్ 2 ట్రావెల్ అడ్వైజరీని విడుదల చేసింది. భారతదేశంలో అత్యాచారాలు మరియు ఉగ్రదాడులు పెరుగుతున్నాయని, ఈ నేపథ్యంలో ఈ హెచ్చరికలు జారీ చేస్తున్నట్టు పేర్కొనడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
భారత్ వెళ్ళే అమెరికన్ లకు, యూఎస్ మహిళలకు షాకింగ్ హెచ్చరిక
భారతదేశానికి వెళ్లే అమెరికన్లు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అమెరికా విదేశాంగ శాఖ చెప్పడం ప్రతి ఒక్కరిని విస్మయానికి గురిచేసింది. జూన్ 16వ తేదీన జారీ చేసిన ఈ హెచ్చరిక ప్రకారం భారతదేశంలో వేగంగా పెరుగుతున్న నేరాలలో అత్యాచారాలు ఒకటని పేర్కొంది. భారతదేశంలోని పర్యాటక ప్రదేశాలు, మార్కెట్లు, రవాణా కేంద్రాలు, ప్రభుత్వ భవనాలపై ఉగ్ర దాడులు జరుగుతున్నాయని, హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయని అమెరికా విదేశాంగ శాఖ పేర్కొంది.

భారత్ లో అమెరికా ప్రభుత్వ ఉద్యోగుల ప్రయాణాలపై ఆంక్షలు
ముఖ్యంగా యూఎస్ మహిళలు ఒంటరిగా ప్రయాణించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. అంతేకాకుండా, కొన్ని ప్రాంతాల్లో అమెరికా ప్రభుత్వ ఉద్యోగుల ప్రయాణాలపై ఆంక్షలు విధించింది. తూర్పు మహారాష్ట్ర, ఉత్తర తెలంగాణ, పశ్చిమ బెంగాల్ ప్రాంతాలకు వెళ్లాలంటే ప్రత్యేక అనుమతి అవసరమని స్పష్టం చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో అత్యవసర సేవల అందుబాటు పరిమితంగా ఉందని పేర్కొంది.
ఇవి ఉపయోగిస్తే జైలుశిక్ష
భారతదేశంలో శాటిలైట్ ఫోన్‌లు లేదా జీపీఎస్ పరికరాలను కలిగి ఉండటం చట్టరీత్యా నేరమని అమెరికా తన పౌరులకు తెలియజేసింది. వాటిని వినియోగించడం వల్ల 2,00,000 డాలర్ల వరకు జరిమానా లేదా మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇదే సమయంలో జమ్మూ కాశ్మీర్, భారత పాకిస్తాన్ సరిహద్దు, తూర్పు, మధ్య భారతదేశం ఈ ప్రాంతాలకు వెళ్లాలంటే అత్యంత అప్రమత్తత అవసరమని పేర్కొంది.
ఇమిగ్రేషన్ సమస్యలు వచ్చేలా అలా చెయ్యొద్దు
అమెరికా ఉద్యోగులు రాష్ట్రాల రాజధానులు మినహాయించి ఇతర ప్రాంతాలకు వెళ్లాలంటే కచ్చితంగా అనుమతి తీసుకోవాలని పేర్కొంది. భూమార్గం నుంచి భారత నేపాల్ సరిహద్దు దాటడం వల్ల ఇమిగ్రేషన్ సమస్యలు, డిటెన్షన్ పరిమాణాలు ఎదురయ్యే ప్రమాదం ఉన్న కారణంగా వాటిని నివారించవలసినదిగా, ఆ విధంగా ప్రయాణించకూడదని సూచించింది. మణిపూర్, అసోం మరియు త్రిపుర వంటి ఈశాన్య రాష్ట్రాల్లో భద్రతా పరిస్థితులు అస్థిరంగా ఉన్నాయని తెలిపింది.
ఈ ట్రావెల్ అడ్వైజరీ తో భారత్ పై అమెరికా ఆలోచనా విధానంలో మార్పు
ఈ ట్రావెల్ అడ్వైజరీ ద్వారా భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు సురక్షితం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు అమెరికా భారతదేశంపై ఆలోచిస్తున్న విధానంలో మార్పు తాజాగా ఈ ట్రావెల్ అడ్వైజరీ తో స్పష్టంగా కనిపిస్తుంది. ఒకపక్క భారత్ మిత్ర దేశం అంటూనే, మరోపక్క పాకిస్తాన్ కు స్నేహ హస్తం అందించే పనిలో ఉన్న యూఎస్ ముందు ముందు భారతదేశం పైన ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుందో అన్నది, ఎలాంటి ప్రకటనలు చేస్తుందో అన్నది తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications