యోగీపై మంత్రుల తిరుగుబాటు.. ధరమ్ సింగ్ సైనీ రాజీనామా.. కాషాయంలో కలవరం..
ఉత్తరప్రదేశ్ బీజేపీలో ఒక్కొక్కరు తిరుగుబావుట ఎగరవేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వరుసగా కమలం పార్టీకి ఎమ్మెల్యేలు రాం రాం చెబుతున్నారు. ఇక పార్టీలో ఉండలేం అంటూ రాజీనామాలు చేస్తున్నారు. యోగీ పాలనలో ఎన్నో అవమానాలు పడ్డాం.. ఇక పడలేం అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు మంత్రులు రాజీనామా చేయగా.. తాజాగా మరో మంత్రి ధరమ్ సింగ్ సైనీ రాజీనామా చేశారు.

బీజేపీలో రాజీనామాల పర్వం..
యూపీలో యోగీ ఆధిత్య నాథ్ కేబినెట్‌లోని మంత్రిగా పనిచేసిన స్వామి ప్రసాద్ మౌర్యతో ప్రారంభమైన రాజీనామాల పర్వం కొనసాగుతోంది. కాషాయ పార్టీకి గుడై చెబుతున్నారు. బీజేపీ పార్టీని నుంచి పెద్ద మొత్తంలోనే రాజీనామాలు ఉంటాయని రాజీనామా చేసినరోజే మౌర్య తెలిపారు. రోజుకు ఇద్దరు ముగ్గురు చొప్పున బయటకి వస్తారని పేర్కొన్నారు. ఆయన చెప్పినట్లుగానే ఇప్పుడు గత మూడు రోజుల్లోనే 9 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారు. మంత్రులు సైతం కాషాయ పార్టీని వీడుతున్నారు. యోగీ సర్కార్ పై తిరుగుబావుట ఎగురవేస్తున్నారు. రాజీనామాల బాట పడుతున్నారు.

మంత్రి ధరమ్ సింగ్ సైనీ బీజేపీకి రాజీనామా
తాజాగా మరో మంత్రి ధరమ్ సింగ్ సైనీ బీజేపీకి రాజీనామా చేశారు. ఈయన రాజీనామాతో మంత్రులు సంఖ్య మూడుకు చేరింది ఇప్పటి వరకు మొత్తం తొమ్మిది మంది ఎమ్మెల్యేలు బీజేపీని వీడారు. బుధవారం రోజునే ధరమ్ సింగ్ సైనీ తనకు ప్రభుత్వం కేటాయించిన భద్రతను తిరిగిపంపించారు. అప్పుడే బీజేపీని విడిచిపెట్టబోతున్నాడనే ఊహాగానాలకు దారితీసింది. ఇప్పటికే బీజేపీకి ఇద్దరు మంత్రులు రాజీనామా చేశారు. దళితులు, వెనుకబడిన వారు, రైతులు, నిరుద్యోగ యువత, చిరువ్యాపారుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిందని అందుకే బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు వాళ్లు ప్రకటించారు..

సమాజ్ వాదీ పార్టీలో చేరికలు
కమలం పార్టీని వీడిన వారంతా సమాజ్ వాదీ పార్టీలో చేరనున్నట్లు సమాచారం. ఇంకా మరికొంత మంది ఎమ్మెల్యే , మంత్రులు బీజేపీని వీడనున్నట్లు ధరమ్ సింగ్ సైనీ పేర్కొన్నారు. ప్రతిరోజూ యోగి ఆదిత్యనాథ్ క్యాబినెట్ నుండి ఒకరి నుండి ఇద్దరు మంత్రులు వైదొలుగుతారని సుహెల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ చీఫ్ ఓం ప్రకాష్ రాజ్‌భర్ జోస్యం చెప్పారు. జనవరి 20 నాటికి ఈ సంఖ్య 18కి పెరుగుతుందని పేర్కొన్నారు. ఒక పక్క ఎగ్జిట్ పోల్స్ మళీ బీజేపీ అధికారంలోకి వస్తుందని సర్వేలు చెబుతున్నాయి. కానీ మరో నెలలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న సమయంలో వరుసగా మంత్రులు, ఎమ్మెల్యే రాజీనామాలు చేస్తున్నారు. ఇది బీజేపీని కలవరపెడుతోంది. మరి ఎన్నికల్లో గెలుపుకోసం కమలనాథులు ఎలాంటి వ్యూహాలు అమలు చేయబోతున్నారో చూడాలి ..












Click it and Unblock the Notifications