వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికలు: దిల్లీ పీఠానికి దారి యూపీ మీదుగానే ఎందుకు వెళ్తుంది?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

పెద్ద పెద్ద పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు లేని ఉత్తర్‌ప్రదేశ్‌లో రాజకీయాలే అతిపెద్ద పరిశ్రమ అని అంటుంటారు.

ఒక్కరోజు మాత్రమే అధికారంలో కొనసాగిన ముఖ్యమంత్రి అర్ధరాత్రి ప్రమాణస్వీకారం, మరుసటి రోజు రాజీనామా, ఎమ్మెల్యేలు మైకులను రాళ్లలాగా ఉపయోగించుకోవడం లాంటి ఘటనలకు ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ సాక్షి.

యూపీ గడ్డపై దాదాపు రెండు దశాబ్దాల పాటు జాతీయ పార్టీలు నానా ఇబ్బందులు పడ్డాయి. భారతదేశంలో సంకీర్ణ రాజకీయాల తొలి ప్రయోగం ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగింది.

రైసీనా హిల్స్‌కు వెళ్లే రహదారి లఖ్‌నవూ గుండా వెళుతుందని ఒక పాత రాజకీయ సామెత ఉంది. సౌత్ బ్లాక్‌లో ప్రధానమంత్రులుగా పని చేసిన ఒక మహిళ, 14 మంది పురుషుల్లో 8 మంది ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందినవారు కావడమే ఈ నానుడికి బలం.

ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీని కూడా వీరికి జోడిస్తే ఆ సంఖ్య 9 అవుతుంది. గుజరాత్ నుంచి వచ్చిన మోదీని యూపీ లెక్కలోకి తీసుకోవడం వెనక ఉన్న కారణం ఆయన వారణాసి నుంచి లోక్‌సభకు ఎన్నికవడమే.

మోదీ తలుచుకుంటే గుజరాత్ నుంచి పోటీ చేసి గెలవగలరు. కానీ, భారతదేశ రాజకీయాల్లో ఉత్తర్‌ప్రదేశ్‌ కు ఉన్న ప్రాముఖ్యం బహుశా మరే ఇతర రాష్ట్రానికీ ఉండదనే ఆలోచన ఆయనకు కూడా ఉంది.

అందుకే సింబాలిక్‌గా ఆయన యూపీ నుంచి ఎంపీ అయ్యారు.

ఉత్తర్‌ప్రదేశ్

అత్యధిక జనాభా

దేశంలోనే అతిపెద్ద అసెంబ్లీ కలిగి ఉన్న ఈ రాష్ట్రం, లోక్‌సభకు 80 మంది ఎంపీలను పంపుతుంది. భారతదేశ జనాభాలో ఏడవ వంతు మంది జనాభా ఇక్కడ నివసిస్తుంటారు.

ఇది ఒక స్వతంత్ర దేశంగా ఉంటే, చైనా, ఇండియా, అమెరికా, ఇండోనేషియా, బ్రెజిల్ తర్వాత జనాభా పరంగా ప్రపంచంలో ఆరో స్థానంలో ఉంటుంది.

అయితే, ఇదంతా కేవలం జనాభా గురించి మాత్రమే కాదు.

''ఉత్తర్‌ప్రదేశ్‌కు త్రివేణి సంగమం, కాశీ, మధుర, అయోధ్యలాంటివన్నీ పెట్టనికోటలు. ఇవన్నీ ఇస్లాం పూర్వ సంస్కృతికి చెందినవి. ఒక రకంగా చెప్పాలంటే ఇది భారతదేశ రాజకీయాల సమ్మేళనం. ఇక్కడి నుంచి 80 మంది సభ్యులు పార్లమెంటుకు వెళ్లడం ముఖ్యం కాదు. ఈ భూమి 5 వేల ఏళ్ల 'నాగరికత' కలిగి ఉందన్నది ముఖ్యం’’ అని సుప్రసిద్ధ కాలమిస్ట్, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ మాజీ ఎడిటర్ సయీద్ నఖ్వీ అన్నారు.

హిందీ హార్ట్‌ల్యాండ్‌కు కేంద్ర బిందువుగా ఉన్న యూపీలో ఎన్నికల ఫలితాలు దాని పరిసర ప్రాంతాలను కూడా ప్రభావితం చేస్తాయి.

''ఒకటి, ప్రజాస్వామ్యంలో సంఖ్యల ప్రాముఖ్యం మనకందరికీ తెలుసు. రెండవది, ప్రధానమంత్రులు ఎక్కువమంది ఇక్కడి నుంచే వస్తుంటారు. 80 లోక్‌సభ సీట్లు మాత్రమే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాలైన బిహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాజకీయాలను కూడా ఈ రాష్ట్రం ప్రభావితం చేస్తుంది. అతి పెద్ద ప్రాంతీయ పార్టీలైన సమాజ్‌వాదీ, బహుజన్ సమాజ్ పార్టీలు కూడా ఇక్కడే ఉన్నాయి. దీని కారణంగా ప్రతిపక్ష రాజకీయాలలో కూడా ఈ రాష్ట్రానికి ప్రాముఖ్యత ఉంటుంది’’ అని జీబీ పంత్ సోషల్ సైన్స్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన ప్రొఫెసర్ బద్రీ నారాయణ్ అన్నారు.

సయీద్ నక్వీతో రేహాన్ ఫజల్

మారిన ట్రెండ్

1989 వరకు యూపీలో అధిక స్థానాలు గెలుచుకున్న పార్టీ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది.

ఈ ట్రెండ్‌ను 1991లో పీవీ నరసింహారావు మార్చారు. అప్పట్లో 84 సీట్లలో 5 సీట్లు మాత్రమే కాంగ్రెస్ గెలిచింది. అయినా, పీవీ ప్రధాని అయ్యారు.

భారతీయ జనతా పార్టీ రాజకీయాల్లో ఉత్తర్‌ప్రదేశ్ ఎప్పుడూ ఒక ఇరుసు లాంటిది. రామమందిరం ఉద్యమంతో ఉత్తర్‌ ప్రదేశ్ రాజకీయాలలో ఆధిపత్యం చెలాయించింది.

1991, 1996, 1998లో వరుసగా మూడు లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ యూపీ నుంచి 50కి పైగా సీట్లను గెలుచుకుంది.

ఈ కారణంగా 1996, 1998లో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం బీజేపీకి దక్కింది. 1998 ఎన్నికలలో యూపీలో బీజేపీ కేవలం 29 సీట్లు మాత్రమే గెలుచుకోగలిగింది.

కానీ, మిత్రపక్షాల మెరుగైన పనితీరు కారణంగా, అది కేంద్రంలో పూర్తి కాలపు ప్రభుత్వాన్ని నడిపింది.

అయోధ్యలో రామమందిరం నిర్మించాలని 1990 నవంబర్ 20న బైఠాయించిన అప్పటి బీజేపీ అధ్యక్షుడు లాల్ కృష్ణ అడ్వాణీ

బీజేపీకి పట్టం

2004, 2009 ఎన్నికలలో బీజేపీ ఇక్కడ సరైన ఫలితాలను రాబట్టుకోలేక పవర్ రేసులో కాంగ్రెస్‌కన్నా వెనుకబడి పోయింది. 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అద్భుత విజయం మరోసారి ఉత్తర్‌ప్రదేశ్ ద్వారా సాధ్యమైంది.

ఉత్తర్‌ప్రదేశ్ శాసనసభలో 403 మంది సభ్యులు ఉన్నారు. ఇది దేశంలోనే అతిపెద్ద అసెంబ్లీ. దాదాపు రెండు దశాబ్దాల పాటు హంగ్ అసెంబ్లీ ఇచ్చిన తర్వాత, 2007లో రాష్ట్ర ప్రజలు తొలిసారిగా బహుజన సమాజ్ పార్టీకి పూర్తి మెజారిటీ ఇవ్వడంతో ఈ ధోరణి మారిపోయింది.

ఆ తర్వాత 2012 అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీకి అధికార పగ్గాలు అప్పగించగా, 2017లో రాష్ట్రంలో అట్టడుగున ఉన్న భారతీయ జనతా పార్టీకి మూడొంతుల మెజారిటీ వచ్చింది.

ఈ ఎన్నికల్లో విశేషం ఏంటంటే, దశబ్ధాలుగా ఒకరినొకరు ద్వేషించుకుంటూ వస్తున్న ఎస్పీ, బీఎస్పీలు బీజేపీని ఓడించడానికి 2019లో చేతులు కలిపాయి. కానీ, ఫలితం దక్కలేదు.

ఉత్తర్‌ప్రదేశ్ గడ్డ నుంచి అనేక ఎన్నికల నినాదాలు కూడా పుట్టుకొచ్చాయి. 90లలో 'రోటీ కప్డా ఔర్ మకాన్’ అనే మూడు పదాల నినాదం ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో తీవ్ర ప్రభావం చూపింది.

21వ శతాబ్దం మొదటి దశాబ్దంలో ఈ నినాదం 'బిజిలీ సడక్, పానీ'గా మారింది.

తరువాతి దశాబ్దంలో 'విద్య, విజ్జానం, అభివృద్ధి' నినాదం కాగా, 2014 లోక్‌సభ ఎన్నికల సమయంలో నరేంద్ర మోదీ 'చదవు, ఉపాధి, వైద్యం’ అనే కొత్త నినాదాన్ని కనిపెట్టారు.

బ్రాహ్మణులను ఆకట్టుకోవడానికి మాయావతి ఏకంగా తన ఎన్నికల గుర్తును ''ఇది ఏనుగు కాదు, గణేశ్. బ్రహ్మ విష్ణు, మహేశ్’’ అన్నారు.

మాయావతి, అఖిలేశ్

అసెంబ్లీ రాజకీయాలు

1951లో జరిగిన మొదటి అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తర్‌ప్రదేశ్ శాసనసభలో 347 స్థానాలు ఉన్నాయి. ఇందులో ఇద్దరేసి ఎమ్మెల్యేలు ఎన్నికైన స్థానాలు 83 ఉన్నాయి.

ఉత్తర్‌ప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రి గోవింద్ వల్లభ్ పంత్. ఆ తర్వాత సంపూర్ణానంద్, చంద్రభాను గుప్తా, సుచేతా కృప్లానీ లాంటి నేతలు రాష్ట్ర పగ్గాలు చేపట్టారు.

1967లో జరిగిన ఎన్నికలు తొలిసారిగా కాంగ్రెస్‌కు పూర్తి మెజారిటీ ఇవ్వలేదు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ బలం 199 సీట్లు మాత్రమే.

చరణ్ సింగ్ కాంగ్రెస్‌కు రాజీనామా చేసి భారతీయ క్రాంతి దళ్ అనే కొత్త పార్టీని స్థాపించారు. సోషలిస్టులు, భారతీయ జనసంఘ్ సహాయంతో ఉత్తర్‌ప్రదేశ్‌లో మొదటి కాంగ్రెసేతర ముఖ్యమంత్రి అయ్యారు.

1974లో, కాంగ్రెస్ కేవలం అసెంబ్లీ ఎన్నికలలో గెలుపొందింది. హేమవతి నందన్ బహుగుణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. కానీ, ఇందిరా గాంధీతో విభేదాల కారణంగా ఆయన రాజీనామా చేయవలసి వచ్చింది. ఎన్డీ తివారి తదుపరి ముఖ్యమంత్రి అయ్యారు.

1977లో జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రధాని మొరార్జీ దేశాయ్ బర్తరఫ్ చేశారు.

ఇందిరా గాంధీ

1978లో జరిగిన ఆజంగఢ్ లోక్‌సభ ఉపఎన్నిక, ఇందిరాగాంధీకి మొదట చిక్కమగళూరు నుంచి, ఆ తర్వాత 1980 లోక్‌సభ ఎన్నికల్లో తిరిగి రావడానికి మార్గం సుగమం చేసింది.

1980లో విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు. బందిపోట్లు ఆయన సోదరుడు జస్టిస్ చంద్రశేఖర్ ప్రతాప్ సింగ్‌ను చంపినప్పుడు, ఆయన తన పదవికి రాజీనామా చేశారు.

కల్యాణ్ సింగ్

ఇందిరా గాంధీ హత్య తర్వాత, రాజీవ్ గాంధీ 1985లో వీర్ బహదూర్ సింగ్‌ను యూపీ ముఖ్యమంత్రిని చేశారు. ఆ తర్వాత దాదాపు 33 ఏళ్లుగా ఉత్తర్‌ప్రదేశ్‌ రాజకీయాల్లో కాంగ్రెస్‌ ప్రభ మసకబారింది.

1989లో ములాయం సింగ్ యాదవ్ కాలం ప్రారంభమైంది. ఆయన బీజేపీ బయటి నుంచి మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.

ఉత్తర్‌ప్రదేశ్

మలుపు తిప్పిన రామమందిరం

అయితే, రథయాత్ర సందర్భంగా లాల్ కృష్ణ అడ్వాణీని లాలూ యాదవ్ అరెస్టు చేయించినప్పుడు, కేంద్రంలోని వీపీ సింగ్ ప్రభుత్వానికి, యూపీ లోని ములాయం సింగ్ ప్రభుత్వానికి బీజేపీ తన మద్దతును ఉపసంహరించుకుంది.

కేంద్రంలో కాంగ్రెస్ సహాయంతో చంద్రశేఖర్ ప్రధానమంత్రి అయ్యారు. అయితే, ఆ తర్వాత కొన్నాళ్లకు కాంగ్రెస్ మద్ధతు ఉపసంహరించుకోవడంతో ఆయన ప్రభుత్వం కూడా కూలిపోయింది.

రామమందిర ఉద్యమం ప్రారంభమైన తర్వాత, బీజేపీ నేత కల్యాణ్‌ సింగ్ 221 సీట్లు గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే, బాబ్రీ మసీదు కూల్చివేతతో ఆయన ప్రభుత్వాన్ని రద్దు చేశారు.

ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ములాయం సింగ్ బహుజన్ సమాజ్ పార్టీతో చేతులు కలిపి బీజేపీని అధికారానికి దూరంగా ఉంచారు.

ఆ తర్వాత బీజేపీ మాయావతికి మద్దతిచ్చి ఆమె ముఖ్యమంత్రి కావడానికి మార్గం సుగమం చేసింది.

1996లో బీజేపీ మరోసారి పూర్తి మెజారిటీ సాధించలేకపోయింది. దీంతో మాయావతితో ఒప్పందం చేసుకుని, మొదటి రెండున్నర సంవత్సరాలు బీఎస్పీ, తర్వాతి రెండున్నర సంవత్సరాలు బీజేపీ అధికారాన్ని పంచుకోవాలని నిర్ణయించాయి.

కానీ, భారతీయ జనతా పార్టీ వంతు రాగానే బహుజన్ సమాజ్ పార్టీ మద్దతు ఉపసంహరించుకుంది.

మాయావతి

రాబోయే ఎన్నికలు ఇచ్చే సందేశం ఏంటి?

2007లో మాయావతి, 2012లో సమాజ్‌వాదీ పార్టీ సంపూర్ణ మెజారిటీ సాధించాయి. 2017 ఎన్నికల్లో బీజేపీ మరోసారి పుంజుకుని 312 సీట్లు గెలుచుకుంది.

ఈ విజయం 2019 లోక్‌సభ ఎన్నికల్లో నరేంద్ర మోదీ విజయానికి బాటలు వేసింది.

వచ్చే కొద్ది నెలలు ఏడు దశల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు ఉత్తర్‌ప్రదేశ్‌ లో ఏ పార్టీ అధికారంలో ఉండబోతుందో నిర్ణయిస్తాయి.

మోదీ

అలాగే, 2024లో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో నరేంద్ర మోదీ దిల్లీలో మళ్లీ అధికారాన్ని చేజిక్కించుకోగలరా లేదా అనేదానిపై కూడా పూర్తి సంకేతాలను ఇస్తాయి.

అంతేకాదు, రాబోయే కొద్దిరోజుల్లో రాజ్యసభ స్వరూపం ఎలా ఉంటుందో, 2022 జూలైలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికల్లో నరేంద్ర మోదీ తనకు నచ్చిన అభ్యర్థిని రాష్ట్రపతి భవన్‌కు పంపగలరా అనే విషయాన్ని కూడా ఈ ఎన్నికలు నిర్ణయిస్తాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Uttar Pradesh Elections: Why the way to Delhi throne solely dependent on UP
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X