నకిలీ బ్యాంకు నడుపుతున్న వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు
లక్నో: నకిలీ నగదును చూశాం, నకిలీ వస్తువులను చూశాం. కానీ, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో ఏకంగా ఒక నకిలీ బ్యాంకును ఓ వ్యక్తి నడుపుతున్నాడు .కర్ణాటక బ్యాంకుకు చెందిన బ్రాంచీ పేరుతో ఓ వ్యక్తి యూపీలో బ్యాంకును దర్జాగా నడుపుతున్నాడు. ఎట్టకేలకు అసలు విషయం వెలుగు చూడడంతో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని బాలియా జిల్లాలో యులాయం నగర్ ఫెప్రాలో కర్ణాటక బ్యాంకు బ్రాంచీని పోలీసులు గుర్తించారు. అసలు ఇక్కడ బ్రాంచీ ఉన్నట్టుగా కూడ కర్ణాటక బ్యాంకు అధికారులకు తెలియదు.

ఉత్తర్‌ప్రదేశ్‌లోని బదౌన్‌కు చెందిన అఫాఖ్ అహ్మద్ అనే వ్యక్తి ఈ బ్యాంకుకు మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. ముంబయికి చెందిన వినోద్ కుమార్ కంబాలిగా పేరు మార్చుకుని బ్యాంకు నడిపిస్తున్నాడు.
ఈ మేరకు తప్పుడు ధృవీకరణ పత్రాలను కూడ సృష్టించారు. బ్యాంకు కర్ణాటకకు చెందిన స్టాంపులు, పేపర్లను సృష్టించారు. వీరి మాటలను నమ్మిన స్థానికులు ఈ బ్యాంకులో ఖాతాలను తెరిచారు.. ఇప్పటికే సుమారు 15 మంది ఖాతాదారులు ఈ బ్యాంకులో తమ ఖాతాలను ప్రారంభించారు.
కర్ణాటక బ్యాంకు వారణాసి బ్రాంచీ అధికారి హితేంద్ర కృష్ణ, బిబిహెచ్ ఉపాధ్యాయ బుధవారం నాడు బాలియాకు చేరుకొని కర్ణాటక బ్యాంకులో సోదాలు నిర్వహించారు.దీంతో అసలు విషయం వెలుగు చూసింది.
తప్పుడు ధృవీకరణ పత్రాలతో బ్యాంకు బ్రాంచీనే నిర్వహిస్తున్న విషయాన్ని వారు గుర్తించారు. వెంటనే వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. బ్యాంకులో ఉన్న రికార్డులను పరిశీలించారు. తప్పుడు రికార్డులుగా గుర్తించారు. నకిలీ బ్యాంకు మేనేజర్‌ను అరెస్ట్ చేశారు. అతడి వద్ద ఉన్న పాస్‌బుక్‌లు, మూడు కంప్యూటర్లు, ఓ ల్యాప్‌టాప్, ఫర్నీచర్‌లను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు
నకిలీ బ్యాంకు మేనేజర్‌పై ఇప్పటికే రెండు కేసులు నమోదయ్యాయని పోలీసులు గుర్తించారు. అంతేకాదు స్థానిక ఖాతాదారుల నుండి రూ.1.37 లక్షలను వసూలు చేశాడని పోలీసులు చెప్పారు.












Click it and Unblock the Notifications