జ్ఞానవాపి మసీదు కేసులో ట్విస్ట్-శివలింగంపై శాస్త్రీయ విచారణకు వారణాసి కోర్టు నిరాకరణ
ఉత్తర్ ప్రదేశ్ లోని జ్ఞానవాపి మసీదులో గతంలో నిర్వహించిన సర్వేలో బయటపడిన శివలింగంపై శాస్త్రీయ పరిశోధన నిర్వహించాలని హిందూ వర్గం దాఖలు చేసిన పిటిషన్ ను వారణాసి కోర్టు ఇవాళ తోసిపుచ్చింది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈ పిటిషన్ ను అనుమతించలేమని వారణాసి కోర్టు నిస్సహాయత వ్యక్తం చేసింది.
జ్ఞానవాపి మసీదులో గతంలో వారణాసి కోర్టు ఆదేశాలతో జరిగిన సర్వేలో శివలింగం వంటి రూపం బయటపడినట్లు అధికారులు నివేదిక ఇచ్చారు. అయితే దాన్ని మసీదుకు చెందిన అంజుమన్ కమిటీ దీన్ని ఓ ఫౌంటేన్ గా తెలిపింది. సర్వేలో బయటపడింది శివలింగం కాదని ఫౌంటేన్ మాత్రమేనని వాదిస్తోంది. దీంతో హిందూ వర్గం వేసిన పిటిషన్ పై ఇవాళ మసీదు నిర్వాహక కమిటీ వాదనలు విన్న వారణాసి కోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది. దీనికి గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు కూడా కారణమైనట్లు తెలుస్తోంది.

గతంలో సుప్రీంకోర్టు జ్ఞానవాపి మసీదులో సర్వే పూర్తయిన తర్వాత అక్కడ ఎలాంటి మార్పులు చోటు చేసుకోకుండా చూడాలని వారణాసి జిల్లా మెజిస్ట్రేట్ ను ఆదేశించింది. అయితే హిందూ వర్గం మాత్రం బయటపడిన శివలింగం ప్రతిమపై శాస్త్రీయ విచారణ జరిపితే ఆధారాలు బయటపడతాయని వాదిస్తోంది. కానీ సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఇప్పుడు శివలింగంపై విచారణకు ఆదేశిస్తే అక్కడ మార్పులు జరిగే అవకాశం ఉండటంతో వారణాసికోర్టు హిందూ వర్గాల పిటిషన్ ను తోసిపుచ్చినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications