ఉత్తరప్రదేశ్ సీఎం అభ్యర్థిగా వరుణ్ గాంధీ?
న్యూఢిల్లీ: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన బీజేపీ ఆ తప్పుని 2017లో ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్‌లో పునరావృతం కాకుండా జాగ్రత్త పడుతోంది. దేశంలోనే అత్యంత పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ ఎన్నికలు బీజేపీకి ఎంతో కీలకం. అంతేకాదు ఎక్కువ మంది ఎంపీ స్థానాలను కైవసం చేసుకున్న రాష్ట్రంగా ఉత్తర ప్రదశ్ ఉంది.
బీహార్‌తో పోలిస్తే యూపీలో బీజేపీకి బలం బాగానే ఉంది. అయితే, బీహార్‌లో మాదిరిగా సీఎం అభ్యర్థిని ప్రకటించకుండా ఎన్నికల బరిలోకి దిగితే ఓటమి తప్పదనే భావన అటు పార్టీతో పాటు ఆర్ఎస్ఎస్‌లో కూడా వ్యక్తమవుతోంది. మరోవైపు సంక్షేమ కార్యక్రమాలతో యూపీ సీఎంగా సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేశ్ యాదవ్ దూసుకెళుతున్నారు.
మరోవైపు మాజీ సీఎం, బీఎస్పీ అధినేత్రి మాయావతి రూపంలో బీజేపీ గట్టి పోటీని ఎదుర్కొవాల్సి ఉంటుందని బీజేపీ నేతలు లెక్కలేస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా ఉత్తరప్రదేశ్‌లో కొద్దిపాటి ప్రభావం చూపొచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీల నియోజకవర్గాలు ఇందులో ఉండటమేనని అంటున్నారు.

ఈ క్రమంలో వీరందరినీ నిలువరించి ఎన్నికల్లో సత్తా చాటాలంటే, ముందుగానే సీఎం అభ్యర్థి పేరును ప్రకటించాలని బీజేపీ నేతలు దాదాపుగా నిర్ణయించిట్టుగా తెలుస్తోంది. దీంతో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ తరుపున సీఎం అభ్యర్ధిగా మేనకా గాంధీ కుమారుడు, సుల్తాన్ పూర్ ఎంపీ వరుణ్ గాంధీ అయితే బాగుంటుందని అగ్రనేతలు తెలిపారట.
యువకులైన అఖిలేశ్, రాహుల్ గాంధీలను వరుణ్ గాందీతో ఎదుర్కొంటే బాగుంటుందనే కోణంలో పార్టీ అగ్రనేతలు భావిస్తున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. మరి కొందరైతే వరుణ్ గాంధీని మించిన ప్రత్యామ్నాయంలేదని కూడా చెబుతున్నారు. దీంతో యూపీ ఎన్నికల్లో బీజేపీ సీఎం అభ్యర్థిగా వరుణ్ గాంధీ రంగంలోకి దిగనున్నారన్న ఊహాగానాలు ఆ పార్టీలో జోరుగా వినిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications