ఢిల్లీలో ప్రయాణం: కారు దిగి మెట్రో రైలు ఎక్కిన వెంకయ్య
న్యూఢిల్లీ: కేంద్రపట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు సోమవారం ఉదయం హైదరాబాద్ నుంచి ఢిల్లీలో దిగగానే కారు ఎక్కడానికి బదులు ఎయిర్‌పోర్ట్ మెట్రో రైలు ఎక్కారు. ఈ రైలులోనే ఆయన కన్నాట్‌ప్లేస్ సమీపంలోని శివాజీ స్టేడియం స్టేషన్ వరకు ప్రయాణించి అక్కడి నుంచి కొద్ది దూరంలో ఉన్న తన కార్యాలయానికి కారులో చేరుకున్నారు.
మార్గమధ్యంలో ఆయన ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ ఎండీ మంజూసింగ్, సంబంధిత అధికారులు, ప్రయాణికులతో మెట్రోద్వారా లభిస్తున్న ప్రయోజనాల గురించి చర్చించారు. రద్దీని తట్టుకోవడానికి ఎంతో ఉపయోగపడుతున్న ఎయిర్‌పోర్ట్ మెట్రో రైలు నాణ్యమైన సేవలందిస్తున్నదని అధికారులు అన్నారు.

చార్జీలు తగ్గించి, రాకపోకల వేళలు పెంచాలని, స్టేషన్ల నుంచి ఇతర ముఖ్యమైన ప్రాంతాలకు బస్సు సౌకర్యం కల్పించాలని ప్రయాణికులు వెంకయ్యను కోరారు. కాగా మెట్రో రైల్వే ఆధునిక భారతదేశానికి ప్రతీకగా మారిందని వెంకయ్య అభివర్ణించారు. ఈ రైలులో ప్రయాణించడం ఎంతో సౌకర్యవంతంగా ఉన్నదని, భవిష్యత్తులోనూ తాను విమానాశ్రయానికి ఈ మెట్రోలోనే ప్రయాణిస్తానని చెప్పారు.
ఢిల్లీ నుంచి హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌లను మెట్రోతో అనుసంధానం చేసేందుకు కేంద్రం ప్రాధాన్యతనిస్తుందని చెప్పారు.












Click it and Unblock the Notifications