'జగన్ తప్పుడు సమాచారం, అతనితో జాగ్రత్త ఉండండి'
భువనేశ్వర్: పది రోజుల క్రితం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌ను కలిసి విభజనపై తప్పుడు సమాచారం ఇచ్చారని కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వి హనుమంత రావు అన్నారు. విహెచ్ బృందం శనివారం ఒరిస్సా మంత్రిని కలిసింది. తెలంగాణకు మద్దతు పలకాలని కోరారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
అదే సమయంలో జగన్‌తో అప్రమత్తంగా ఉండాలని విహెచ్ నేతృత్వంలోని కాంగ్రెస్ నేతల బృందం నవీన్ పట్నాయక్‌కు సూచించిందట. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం కోసం నవీన్ మద్దతును కోరేందుకు జగన్ ఇటీవల ఒడిసా వెళ్లిన విషయం తెలిసిందే. దీంతో వీహెచ్ నేతృత్వంలో మల్లు రవి, కోదండ రెడ్డి, సంతోష్ కుమార్ తదితరులు నవీన్‌ను కలిసేందుకు శుక్రవారం భువనేశ్వర్ వెళ్లారు.

నవీన్ ఎన్నికల ప్రచారంలో ఉండడంతో మంత్రి కల్పతార్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. రాష్ట్ర విభజనకు బిజూ జనతాదళ్ తమ మద్దతును ప్రకటించాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జగన్‌కు సంబంధించిన అనేక అంశాలతో పాటు తెలంగాణకు సంబంధించిన విషయాలనూ వారి దృష్టికి తీసుకెళ్లినట్లు విహెచ్ చెప్పారు.
జగన్‌తో జాగ్రత్తగా ఉండాలని సూచించామన్నారు. 2004 ఎన్నికల సందర్భంగా డిక్లరేషన్‌లో జగన్ తన ఆస్తుల విలువ కేవలం రూ.9.2 లక్షలు మాత్రమేనని, మరి 2011 నాటికి ఆయన ఆస్తులు రూ.365 కోట్లకు చేరాయని చెప్పామన్నారు. ఏడేళ్ల కాలంలో ఇంత పెద్దమొత్తంలో ఆస్తులు ఎలా సమకూరాయో గమనించాలని కోరినట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications