అయోధ్య రామాలయానికి విరాళాల పేరిట క్యూఆర్ కోడ్ మోసం: వీహెచ్‌పీ హెచ్చరిక
న్యూఢిల్లీ: యావత్ భారతావని ఎదురుచూస్తున్న అయోధ్య రామ మందిరం ప్రారంభానికి ముస్తాబవుతున్న వేళ కొందరు మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. రామాలయానికి విరాళాల పేరుతో భక్తులను దోచుకునేందుకు కొన్ని ముఠాలు యత్నిస్తున్నాయి. ఇందుకోసం సైబర్ నేరగాళ్లు సోషల్ మీడియాలో క్యూఆర్ కోడ్, ఇతర విధానాలను అనుసరిస్తున్నట్లు విశ్వహిందూ పరిషత్ (VHP) హెచ్చరించింది.
అయోధ్యలో రామమందిర నిర్మాణ పనులను శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ పర్యవేక్షిస్తోంది. విరాళాలు సేకరించేందుకు మాత్రం ఎవ్వరికీ అధికారం ఇవ్వలేదని వీహెచ్‌పీ అధికార ప్రతినిధి వినోద్ బన్సల్ తెలిపారు. అయితే, సోషల్ మీడియాలో మాత్రం రామాలయం పేరుతో తప్పుడు పేజీలు సృష్టిస్తున్నట్లు గుర్తించామన్నారు. ఆలయ ప్రారంభోత్సవం పేరు చెప్పి ప్రజలను లూటీ చేసేందుకు సైబర్ నేరగాళ్లు ప్రయత్నిస్తున్నారని తెలిపారు.

క్యూఆర్ కోడ్, ఫోన్ యూపీఐల ద్వారా ఆలయానికి విరాళాలు ఇవ్వాలని అడుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని చెప్పారు. ఈ తరహాలోనే ఓ మోసపూరిత పేజీని ఉదహరిస్తూ ట్విట్టర్ (ఎక్స్)లో పోస్టు చేశారు. ఇలాంటి విషయంలో భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇదే విషయంపై ఉత్తరప్రదేశ్, ఢిల్లీ పోలీసులతోపాటు కేంద్ర హోంశాఖకు లేఖ రాశామని వీహెచ్‌పీ ప్రతినిధి వినోద్ బన్సల్ పేర్కొన్నారు.
सावधान..!!
— विनोद बंसल Vinod Bansal (@vinod_bansal) December 31, 2023
श्री राम जन्मभूमि तीर्थ क्षेत्र के नाम से फर्जी आईडी बना कर कुछ लोग पैसा ठगी का प्रयास कर रहे हैं। @HMOIndia @CPDelhi @dgpup @Uppolice को ऐसे लोगों के विरूद्ध विलम्ब कार्यवाही करनी चहिए। @ShriRamTeerth has not authorised any body to collect funds for this occasion. pic.twitter.com/YHhgTBXEKi
ప్రజలు ఇటువంటి మోసాలకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సందేశం విడుదల చేశారు. చారిత్రక అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం ఎంతో సంతోషకరమైందని.. ఈ సమయంలో అనేక మందికి ఆహ్వానాలు పంపుతున్నట్లు పేర్కొన్నారు. కాగా, జనవరి 22న జరిగే అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి ప్రధాని మోడీ తో సహా రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు హాజరవుతున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications