Bangalore Airport: ప్రయాణీకురాలిని నిండా ముంచిన స్కామర్స్.. ఏకంగా ఎయిర్‌పోర్టులోనే మకాం
Lounge Scam: టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ దానివల్ల తలెత్తే ఇబ్బందులూ అదే స్థాయిలో ఉంటున్నాయి. గతంలో దొంగలు ఇంటిలో, మనుషుల వద్ద నుంచి సొమ్ము దోచుకునేవారు. కానీ ఇప్పుడు క్షణాల వ్యవధిలో సాంకేతికత సాయంలో మోసం చేసి మరీ లూటీ చేస్తున్నారు. చదువుకోనివారే మోసానికి గురవుతున్నారు అనుకుంటే మాత్రం పొరపాటే. భారీ ఎత్తున వ్యాపారాలు చేస్తున్న బిజినెస్ టైకూన్లను సైతం సునాయాసంగా బురిడీ కొట్టించిన దాఖలాలు కోకొల్లలు.
తాజాగా బెంగుళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో భార్గవి మణి అనే ప్రయాణీకురాలికి చేదు అనుభవం ఎదురైంది. లాంజ్ యాక్సెస్‌కు సంబంధించి మోసపోయి 87 వేలకు పైగా పోగొట్టుకున్నారు. స్కామర్లు ఉపయోగించే మోసపూరిత వ్యూహాల గురించి అవగాహన పెంచాలని భావించి తనకు ఎదురైన సంఘటనను సోషల్ మీడియాలో పంచుకున్నారు.

తన క్రెడిట్ కార్డు కనిపించకపోవడంతో దాని ఫోటోను సిబ్బందికి అందించి విమానాశ్రయ లాంజ్‌లోకి ప్రవేశించడానికి ప్రయత్నించినట్లు మణి ఆ వైరల్ వీడియోలో వివరించారు. సాంప్రదాయ ధృవీకరణ పద్ధతులకు బదులుగా లాంజ్ సిబ్బంది 'లాంజ్ పాస్' అనే యాప్‌ను డౌన్‌లోడ్ చేసినట్లు చెప్పారు. భద్రతా ప్రయోజనాల కోసం ముఖాన్ని స్కాన్ చేయాలని సూచించారని, దీంతో నమ్మి మోసపోయానని ఆవేదన వ్యక్తం చేశారు.
అనంతరం తాను ఫోన్ కాల్స్‌ను స్వీకరించలేకపోయినట్లు తెలిసిందని మణి పేర్కొన్నారు. నెట్‌వర్క్ సమస్యలే కారణమని మొదట భావించినట్లు చెప్పారు. అనంతరం అపరిచితులు తన కాల్స్‌కు సమాధానం ఇస్తున్నారని గుర్తించడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారినట్లు వెల్లడించారు. తన క్రెడిట్ కార్డ్‌పై 87 వేలకు పైగా విలువైన అనధికారిక లావాదేవీలు జరగ్గా, ఆ మొత్తం ఓ ఫోన్‌పే ఖాతాకు బదిలీ చేయబడిందని తేలినట్లు స్పష్టం చేశారు.
కాగా డౌన్‌లోడ్ చేసిన యాప్ మాల్‌వేర్ ప్రోగ్రామ్ అని ఆమె అనుమానిస్తున్నారు. స్కామర్‌లు తన ఫోన్‌ను యాక్సెస్ చేయడానికి, కాల్స్ దారి మళ్లించడానికి మరియు ఆన్‌లైన్ లావాదేవీల కోసం ఉపయోగించే వన్-టైమ్ పాస్‌వర్డ్‌లను (OTPలు) అడ్డగించడానికి అనుమతిస్తుందని భావిస్తున్నారు. మణి ఈ సంఘటనను సైబర్ క్రైమ్ విభాగానికి నివేదించారు. ఆమె బ్యాంకును అప్రమత్తం చేయడంతో పాటు తదుపరి నష్టాలను నివారించడానికి క్రెడిట్ కార్డును బ్లాక్ చేశారు.












Click it and Unblock the Notifications