viral video: రాజ్యసభలో అనూహ్యం -రూల్స్ బుక్‌తోనే దాడి -సాగు చట్టాలపై రగడ -రైతులకు బీజేపీ కౌంటర్
మరో మూడు రోజుల్లో వర్షాకాల సమావేశాలు ముగియనున్నా పార్లమెంటులో సీన్ ఏ మాత్రం మారలేదు సరికదా, అనుమానిత దాడుల పర్వం అసాదారణ స్థాయికి చేరింది. వ్యవసాయ చట్టాలు, రైతుల నిరసనలు, పెగాసస్ నిఘా కుట్ర తదితర అంశాలపై కేంద్రం సరైన సమాదానం ఇవ్వకుండా పారిపోతోందని ఆరోపిస్తోన్న ప్రతిపక్షాలు ఇవాళ కూడా సభలో రచ్చకు దిగాయి. కాంగ్రెస్ ఎంపీ ప్రతాప్ సింగ్ బజ్వా టేబుల్ పైకెక్కి గలాభా చేస్తూ, మందపాటి రూల్స్ బుక్ ను చైర్మన్ సీటుకేసి విసిరిన ఘటన సంచలనంగా మారింది..
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు సాగు చట్టాలను ఉపసంహరించుకోవాలంటూ రాజ్యసభలో విపక్ష ఎంపీలు నిరసన చేపట్టారు. మంగళవారం నాటి సభలో సాగు చట్టాలపై వివరణ ఇచ్చేందుకు కేంద్రం ప్రయత్నించగా, అడ్డుకున్న విపక్ష ఎంపీలు మొత్తం చట్టాలను వెంటనే రద్దు చేయాలంటూ గలాటాకు దిగారు. రాజ్యసభ చైర్మన్ పోడియానికి ఎదురుగా గుమ్మికూడిన విపక్ష ఎంపీలు 'జై జవాన్.. జై కిసాన్' అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ క్రమంలో..

వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలంటూ విపక్ష ఎంపీలు రాజ్యసభలో గలాటాకు దిగిన సమయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన సభ్యుడు ప్రతాప్ సింగ్ బజ్వా అనూహ్య చర్యకు పాల్పడ్డారు. సహచరులతో కలిసి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూనే బజ్వా టేబుల్ పైకి ఎక్కి మరింత గట్టిగా నినాదాలు చేశారు. ఆయనను ఉత్సాహపరుస్తున్నట్లుగా చుట్టూ ఉన్న విపక్ష ఎంపీలంతా జై జవాన్, జై కిసాన్ నినాదాలు చేశారు. అంతలోనే ఆ టేబుల్ పైనున్న పార్లమెంట్ రూల్స్ బుక్ ను చేతుల్లోకి తీసుకున్న ఎంపీ బజ్వా.. దానిని చైర్మన్ సీటుపైకి గట్టిగా విసిరేశారు..
#WATCH | Delhi: Opposition MPs created ruckus, raised slogans of 'Jai Jawan, Jai Kisan', demanding withdrawal of the three farm laws, in Rajya Sabha earlier today
— ANI (@ANI) August 10, 2021
(Video source: a parliamentarian) pic.twitter.com/jrFKcIUI2O
అసలే బరువుగా ఉండే రూల్స్ బుక్ ను బలంగా చైర్మన్ వైపు విసరడాన్ని అధికార బీజేపీ దాడిగా అభివర్ణించింది. ప్రతాప్ బజ్వాతోపాటు రచ్చకు దిగిన ఇంకొందరు ఎంపీలపైనా చర్యలు చేపట్టే దిశగా అధికార బీజేపీ యోచిస్తున్నది. సాగు చట్టాలపై విపక్ష ఎంపీలు ఇవాళ సభలో వ్యవహరించిన తీరును కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తీవ్రంగా ఖండించారు.
''వ్యవసాయ చట్టాలపై విపక్షాలు లేవనెత్తే ఎలాంటి ప్రశ్నలకైనా సమాధానాలు చెబుతామని, అన్ని అనుమానాలు నివృత్తి చేస్తామని పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి మేం స్పష్టంగా చెబుతున్నాం. అందులో భాగంగానే ఇవాళ రాజ్యసభలో వ్యవసాయంపై చర్చకు ప్రభుత్వమే ముందుకొచ్చింది. కానీ చర్చను ముందుకు సాగనీయకుండా కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ, తృణమూల్ కాంగ్రెస్, తదితర పార్టీల సభ్యులు గొడవకు దిగారు. అప్రజాస్వామిక వైఖరిని ప్రదర్శిస్తూ రభస చేశారు. మోదీ సర్కారు కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ విధానాలతోనే రైతులు అభివృద్ధి చెందుతున్నారనే వాస్తవాన్ని విపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయి..'' అని మంత్రి తోమర్ మండిపడ్డారు.

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన నాటి నుంచే సాగు చట్టాలపై కేంద్రాన్ని నిలదీయాలని విపక్ష నేతలు నిర్ణయించుకున్నారు. అనుకున్నట్లుగానే సమావేశాలు ప్రారంభమైన నాటి నుంచి సాగు చట్టాలను వెనక్కి తీసుకోవాలంటూ నిరసన చేపడుతూనే ఉన్నారు. అయితే మోదీ ప్రభుత్వం ఇవన్నీ పట్టించుకోకుండా తమ బిల్లుల్ని పాస్ చేసుకుంటూ పోతోంది. మరోవైపు సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దులో నవంబర్‌లో రైతులు చేపట్టిన ఆందోళన కొనసాగుతూనే ఉంది. ఇదిలా ఉంటే,
పార్లమెంట్ సమావేశాలకు సమాంతరంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద రైతులు నిర్వహించిన 'కిసాన్ సంసద్' సోమవారంతో ముగిసింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రైతులంతా తిరిగి ఢిల్లీ శివారుల్లోని తమ నిసరన శిబిరాలకు వెళ్లిపోయారు. తొమ్మిది నెలలుగా నిరసనలు కొనసాగిస్తున్నా కేంద్రం పట్టించుకోక పోవడం, కనీసం చర్చలకు కూడా రాకపోవడాన్ని రైతు సంఘాలు తీవ్రంగా పరిగణిస్తున్నాయి. బీజేపీకి రైతుల దెబ్బ రుచి చూపిస్తామని ఇదివరకే ప్రకటించిన రైతు సంఘాలు ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కమలదళానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించడం తెలిసిందే. రాబోయే ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లోనూ బీజేపీని దెబ్బతీసేలా లక్నో కేంద్రంగానే ఢిల్లీ తరహా శిబిరాలను ఏర్పాటు చేసి ఉద్యమాన్ని కొనసాగిస్తామని రైతు సంఘాల నేత రాకేశ్ టికాయత్ ప్రకటించగా, వారికి కౌంటర్ ఇచ్చే పనిని బీజేపీ వేగవంతం చేసింది..
సాగు చట్టాల విషయంలో రైతు సంఘాలు కొనసాగిస్తున్న ఉద్యమానికి పోటీగా బీజేపీ కౌంటర్ ఉద్యమానికి సిద్ధమైంది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను ప్రభావితం చేసేలా వేదికగా రైతుల కార్యాచరణ ప్రకటించడంతో అప్రమత్తమైన బీజేపీ.. తన కిసాన్ మోర్ఛా ద్వారా పెద్ద కార్యక్రమాలను ప్రకటించింది. ఆగస్టు 16 నుంచి 26 వరకు యూపీలో చెరకు పండే ప్రాంతాల్లో రైతులను సంఘతిటం చేయాలని, ఉద్యమకారుల తరహాలోనే కిసాన్ పంచాయితీలు నిర్వహించాలని బీజేపీ తన శ్రేణులకు నిర్దేశించింది. లక్నో కేంద్రంగా శిబిరాన్ని ఏర్పాటు చేస్తామన్న రాకేశ్ టికాయత్ ప్రకటన నేపథ్యంలో అదే లక్నోలో భారీ కిసాన్ పంచాయితీ నిర్వహించాలని బీజేపీ నిర్ణయించుకుంది. ఈనెల 22 నుంచి 25 వరకు, అంటే మూడు రోజులపాటు లక్నోలో బీజేపీ కిసాన్ మోర్ఛా ఆధ్వర్యంలో కిసాన్ పంచాయితీ జరుగనుంది. ఈ కార్యక్రమాల ద్వారా సాగు చట్టాలపై పోరాడుతోన్న రైతులకు గట్టి కౌంటర్ ఇవ్వాలని బీజేపీ భావిస్తున్నది.












Click it and Unblock the Notifications