41 మంది మృతి... TVK చీఫ్ విజయ్ సంచలన నిర్ణయం
ప్రముఖ తమిళ నటుడు, తమిళగ వెట్రి కళగం (TVK) అధ్యక్షుడు విజయ్.. తమిళనాడులోని కరూర్ లో నిర్వహించిన ర్యాలీలో భారీ తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ తొక్కిసలాటలో మొత్తం 41 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. ఈ క్రమంలో TVK చీఫ్ విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రెండు వారాల పాటు రాష్ట్రవ్యాప్త పర్యటనలు వాయిదా వేసుకున్నారు. అటు వచ్చేవారం పోలీసుల అనుమతితో ఆయన బాధితులను పరామర్శిస్తారని టీవీకే పార్టీ స్పష్టం చేసింది. వచ్చే ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.
అయితే సెప్టెంబర్ 28న సాయంత్రం కరూర్ లో విజయ్ నిర్వహించిన ర్యాలీలో తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. కరూర్ కార్నర్ మీటింగ్ కు పోలీసులు 10 వేల మందికే అనుమతి ఇచ్చారు. కానీ అక్కడికి 2 లక్షల మందికిపైగా టీవీకే కార్యకర్తలు, విజయ్ ఫ్యాన్స్ వచ్చారు. అంతమందికి సరపడా స్థలం లేక తొక్కిసలాట జరిగినట్లు ప్రాథమికంగా అధికారులు నిర్ధారించారు. ఈ క్రమంలో టీవీకే చీఫ్ విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని తన అధికారిక ఎక్స్ ఖాతా నుంచి పోస్టు చేశారు.
"తొక్కిసలాట ఘటనలో కుటుంబసభ్యులను కోల్పోయిన బాధ, దుఃఖం నెలకొన్న నేపథ్యంలో వచ్చే రెండు వారాల పాటు బహిరంగ సభ కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నాం. పర్యటనలకు సంబంధించిన కొత్త షెడ్యూల్‌ను తర్వాత ప్రకటిస్తాం." టీవీకే పార్టీ పేర్కొంది. మరోవైపు ఈ తొక్కిసలాట ఘటనపై ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేశారు. కరూర్ జిల్లాకు చెందిన పలువురు నేతలను అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. ఇదే విషయంపై విజయ్ స్పందిస్తూ.. సీఎం స్టాలిన్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. కావాలంటే నన్ను ఏమైనా చేసుకోండి.. కానీ కార్యకర్తల జోలికి మాత్రం వెళ్లొద్దని స్పష్టం చేశారు.

ఇక కరూర్ తొక్కిసలాటలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 10 లక్షల చొప్పున సాయం చేస్తామని సీఎం స్టాలిన్ ఇటీవల వెల్లడించారు. తీవ్రంగా గాయపడిన వారికి రూ. 1 లక్ష పరిహారం అందించనున్నట్లు తెలిపారు. అటు టీవీకే అధ్యక్షుడు విజయ్ కూడా సాయం ప్రకటించారు. మృతి చెందిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరి చొప్పున రూ. 20 లక్షలు అందిస్తామని స్పష్టం చేశారు. " నా గుండె బద్దలైంది.. దుఃఖంతో నేను విలవిలలాడుతున్నాను. కరూర్ లో ప్రాణాలు కోల్పోయిన సోదరులు, సోదరీమణుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. గాయాలైన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను" అని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.












Click it and Unblock the Notifications