• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారతదేశం సరిహదుల్లో 'గూఢచారుల గ్రామం'.. ఎలాంటి రుజువులూ, గుర్తింపు లేని ‘గూఢచారులు’

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
గూఢచారులు

డేనియల్ మసీహ్, తాను ఒక భారతీయ గూఢచారినని అంటున్నారు. పాకిస్తాన్‌లో గూఢచర్యం చేశానని, అక్కడ అరెస్ట్ అయి, చిత్రహింసలు అనుభవించినప్పటికీ భారత ప్రభుత్వం తన సేవలకు ఎలాంటి అధికారిక గుర్తింపు ఇవ్వలేదు సరి కదా, పరిహారం కూడా అందించలేదని చెబుతున్నారు.

భారత సరిహద్దు ప్రాంతంలో నివసిస్తున్న డేనియల్‌ మసీహ్‌, ఎనిమిదిసార్లు పాకిస్తాన్ వెళ్లి నిఘా సమాచారాన్ని సేకరించానని చెబుతున్నారు.

ఈ అంశంపై వ్యాఖ్యానించాల్సిందిగా బీబీసీ భారత ప్రభుత్వాన్ని కోరింది. కానీ, ఎలాంటి స్పందనా రాలేదు.

ఎనిమిదోసారి భారత సరిహద్దు దాటి పాకిస్తాన్ చేరుకున్నప్పుడు తనను అరెస్ట్‌ చేశారని డేనియల్‌ మసీహ్‌ చెప్పారు. తాను కేవలం ఒక స్మగ్లర్‌నని పాకిస్తాన్ అధికారులకు సాకు చెప్పినా, అది పనికిరాలేదని, గూఢచర్యం నేరానికి మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించారని తెలిపారు.

పాకిస్తాన్‌లోని వివిధ జైళ్లలో నాలుగు సంవత్సరాలు గడిపిన తరువాత, చివరకు విడుదలైనప్పుడు ఒక గూఢచారిగా సగర్వంగా స్వదేశానికి చేరుకున్నానని అన్నారు.

కానీ, ఆయన్ను పాకిస్తాన్‌కు పంపిన భారత గూఢచార సంస్థ, తరువాత మాట మార్చిందని ఆరోపిస్తున్నారు.

డేనియల్ మసీహ్ ఇప్పుడు సైకిల్ రిక్షా నడుపుతున్నారు. ఆయన భార్య పనిమనిషిగా చేస్తున్నారు.

డేనియల్ జైలులో ఉన్నప్పుడు, ఆయన తల్లికి గుర్తు తెలియని చిరునామా నుంచి నెలకు 500 రూపాయలు అందేవని, అయితే ఆయన విడుదలైన తరువాత డబ్బులు రావడం ఆగిపోయిందని ఆయన చెప్పారు.

రిస్క్‌తో కూడిన 'గూఢచారి' పని చేసినందుకు ఇన్నాళ్ల తరువాత కూడా డేనియల్, భారత ప్రభుత్వం నుంచి ప్రతిఫలం ఆశిస్తున్నారు.

గూఢచర్యం

డేనియల్ ఒక్కరే కాదు, ఇలాంటి గూఢచారులు చాలామందే ఉన్నారు

భారత సరిహదుల్లో ఉన్న తన గ్రామం 'గూఢచారుల గ్రామం'గా ప్రసిద్ధి చెందిందని, ఇక్కడ నుండి అనేకమంది భారతదేశం కోసం గూఢచర్యం చేయడానికి పాకిస్తాన్‌కు వెళ్లారని, అందులో చాలా మంది గూఢచారులకు ఎలాంటి పరిహారం అందలేదని డేనియల్ చెప్పారు.

అయితే, భారత సరిహద్దు గ్రామలలోని ప్రజలు దేశం కోసం గూఢచర్యం చేయడం, నిఘా సంస్థలతో కలిసి పనిచేయడం కొత్తేం కాదని నిపుణులు అంటున్నారు.

డేనియల్ లాగే దేశం కోసం గూఢచర్యం చేశామని చెప్పినవారిలో ఇప్పుడు చాలామంది బతికి లేరు. ఉన్నవాళ్లు మీడియాతో దూరం పాటిస్తున్నారు.

కానీ, డేనియల్ తన కష్టాలను బహిరంగంగా చెప్పుకున్నారు. డానియల్ నివసిస్తున్న గ్రామం, ఇతర భారతీయ గ్రామాలలాంటిదే. పాత ఇళ్లు, అసంపూర్తిగా వదిలేసిన భవనాలు, ఇరుకైన వీధులు, అందులోనే మోటార్ సైకిళ్లు నడుపుతున్న శబ్దాలు. అక్కడా, ఇక్కడా కనిపించే నిరుద్యోగ యువకులు.

తమ డిమాండ్లు చాలా నిరాడంబరమైనవని, తమ పనికి ప్రతిఫలం, దేశానికి సేవలు అందించామన్న గుర్తింపు.. ఇంతకన్నా ఎక్కువ కోరుకోవట్లేదని డేనియల్ అన్నారు.

ఇటీవల, సుప్రీంకోర్టు ముందు ఇలాంటిది ఒక కేసు వచ్చింది. 1970వ దశకంలో భారతదేశానికి చెందిన ఒక గూఢచార సంస్థ తనను పాకిస్తాన్ పంపిందని, అక్కడ తాను పట్టుబడ్డానని, 14 ఏళ్ల జైలుశిక్ష పడిందని ఒక వ్యక్తి పిటిషన్ పెట్టుకున్నారు. ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెబుతూ, భారత ప్రభుత్వం ఆ వ్యక్తికి రూ. 10 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది.

గూఢచారులు

డేనియల్ మసీహ్ గూఢచర్యం కథ

డేనియల్ గూఢచర్య ప్రస్థానం 1992 సంవత్సరంలో ప్రారంభమైంది. ఒక సాయంత్రం డేనియల్, తెలిసిన వ్యక్తితో కూర్చుని మందు తాగుతున్నారు. ఒక భారత గూఢచార సంస్థ కోసం పని చేయడానికి పాకిస్తాన్‌కు వెళతారా? అని ఆ వ్యక్తి అడిగారు. వెంటనే డేనియల్ ఒప్పుకున్నారు.

అప్పటికి ఆయన ఆర్థిక పరిస్థితి అంత బాగాలేదు. పాకిస్తాన్ వెళ్లి ఈ పని చేస్తే వేల రూపాయల ప్రతిఫలం దక్కుతుందని ఆయనకు ఆశచూపారు. దాంతో, వెంటనే ఈ పనికి ఒప్పుకున్నారు.

ఆ వ్యక్తి, డేనియల్‌కు గూఢచార సంస్థలతో సంబంధం ఉన్న మరొక వ్యక్తిని పరిచయం చేశారు. ఆయన డేనియల్‌కు మద్యంతో ఆతిధ్యం ఇచ్చారు. ఈ పనిలో బాగా డబ్బులు వస్తాయని చెప్పి, తియ్యటి కలలు చూపించారు.

తరువాత, డేనియల్‌కు ప్రాథమిక శిక్షణ ఇచ్చారు. కొద్ది రోజుల తరువాత, ఆయన్ను ఒక 'మిషన్' కోసం తీసుకున్నారు.

"గూఢచార సంస్థ హ్యాండ్లర్లు నన్ను ఒక కారులో సరిహద్దుకు తీసుకెళ్లారు. తరువాత, రావి నదికి చేరుకున్నాం. అక్కడ నన్ను పడవలో ఎక్కించారు. పాకిస్తాన్ సరిహద్దుల్లో భద్రతా దళాల గస్తీ ముగిసిన తరువాత, అవకాశం దొరికిన వెంటనే సరిహద్దు దాటేశాను. మొదటిసారి వాళ్లు తోడొచ్చారు. రెండోసారి ఒక్కడినే వెళ్లాను. అలా వెళ్తూ, వస్తూ ఉన్నాను. మొత్తం ఎనిమిదిసార్లు పాకిస్తాన్ వెళ్లాను" అంటూ తన ప్రయాణాన్ని వివరించారు డేనియల్.

పాకిస్తాన్‌లో ఒక పరిచయస్తుడి ఇంట్లో బస చేసేవారు. ఆయన కూడా భారతదేశం కోసం పనిచేసేవారని, తనకు అప్పగించిన పనులను పూర్తిచేయడంలో సహాయపడేవారని డేనియల్ చెప్పారు.

"మాకు ఏ పని అప్పగించినా, దాన్ని పూర్తి చేసుకుని తిరిగి వచ్చేవాళ్లం. రైల్వే టైమ్ టేబుల్, ఏదైనా వంతెన ఫొటో, లేదా సైన్యం గుర్తులు మొదలైనవి సేకరించి తీసుకుని రమ్మనేవారు. అప్పట్లో ఇంటర్నెట్ ఇంత విరివిగా లభ్యమయేది కాదు. సందేశాలు పంపించడానికి ఆధునిక ఉపకరణాలు ఉండేవి కాదు. మా హ్యాండ్లర్లకు సమాచారం అందించడానికి మా దగ్గర ఒక కోడ్ ఉండేది. దాని సహాయంతో రాత్రి పూట మేం సరిహద్దులు దాటి భారతదేశానికి తిరిగి వచ్చేవాళ్లం. లేదంటే హ్యాండ్లర్లకు తెలిసేలా దూరం నుండి సిగరెట్ వెలిగించేవాళ్లం. లేకపోతే గట్టిగా అరిచేవాళ్లం. వాళ్లు 'ఎవరు?' అని అడిగేవాళ్లు. 'కళాకారులం’ అని జవాబిచ్చేవాళ్లం. ఇదే మా కోడ్" అని డేనియల్ చెప్పారు.

ఒకసారి డేనియల్‌కు పాకిస్తాన్ నుంచి ఒక రిటైర్డ్ సైనికుడిని భారత్‌కు తీసుకొచ్చే పని అప్పగించారు.

"రిటైర్డ్ సైనికుడిని తీసుకురాలేకపోయాను. కానీ, ఒక సాధారణ పౌరుడిని తీసుకువచ్చాను. మళ్లీ అతడిని వెనక్కి విడిచిపెట్టి వచ్చాను కూడా."

ఈ పని ప్రమాదాలతో కూడుకున్నదని డేనియల్ చెప్పారు.

"ఒకసారి సరిహద్దు దాటుతుండగా దాదాపు దొరికిపోయాననే అనుకున్నా. ఒక గోధుమ పొలం గుండా వెళుతుండగా, పాకిస్తానీ రేంజర్లు దగ్గరగా రావడం కనిపించింది. పరిస్థితి అనుకూలించలేదు. కానీ, అప్పుడే పాకిస్తానీ రేంజర్లు ఒక పొరపాటు చేశారు. వాళ్లు బిగ్గరగా పాడుతున్నారు. దాంతో, వాళ్లు ఎంత దూరంలో ఉన్నారో నాకు తెలిసిపోయింది. వాళ్లు నన్ను చూడకముందే దాక్కోగలిగాను. వాళ్లు నా పక్క నుంచే వెళ్లారు. కానీ, నన్ను కనిపెట్టలేకపోయారు."

అయితే, చివరిసారి డేనియల్‌కు అదృష్టం కలిసిరాలేదు. ఎనిమిదోసారి సరిహద్దులు దాటేందుకు ప్రయత్నిస్తుండగా అరెస్ట్ చేశారు. తాను ఒక మద్యం స్మగ్లర్‌నని అబద్ధం చెప్పినా, పనికిరాలేదు. తనను చిత్రహింసలు పెట్టినా, చలించలేదని డేనియల్ చెప్పారు. చివరికి, గూఢచర్యం ఆరోపణలతో ఆయనకు శిక్ష పడింది.

గూఢచర్యం

భారత, పాకిస్తాన్ల మధ్య గూఢచర్యం

భారత్‌, పాకిస్తాన్ల మధ్య గూఢచర్యం కొత్తేమీ కాదు. నిఘా సమాచారాన్ని సేకరించడానికి గూఢచారులను సరిహద్దులు దాటించడం ఎప్పటి నుంచో జరుగుతున్నదే.

అయితే, టెక్నాలజీ పెరగడంతో ఈ పనికి మనుషులపై ఆధారపడడం కొంత తగ్గింది. కానీ, గూఢచారుల ఉనికి ఇప్పటికీ ప్రాముఖ్యం సంతరించుకున్నదే.

ఈ రెండు దేశాల మధ్య ఉన్న సాంస్కృతిక సారూప్యం, వేషభాషలు గూఢచర్యాన్ని సులభతరం చేస్తాయి.

చండీగఢ్‌కు చెందిన న్యాయవాది రంజన్ లఖన్‌పాల్ భారతదేశం, పాకిస్తాన్‌ల నుంచి వచ్చిన అనేకమంది గూఢచారుల విడుదల కోసం భారతదేశంలోని కోర్టులలో పోరాటం చేశారు.

"ఈ రెండు దేశాల్లోనూ గూఢచారులను అటు నుంచి ఇటు, ఇటి నుంచి అటు పంపడం సర్వసాధారాణమైన విషయం" అని ఆయన చెప్పారు.

"పాకిస్తాన్ నుంచి కూడా గూఢచారులు వస్తుంటారు. భారత్ నుంచి వెళుతుంటారు. ఎవరి పని వాళ్లు చేసుకుంటారు. కొంతమంది పట్టుబడతారు. 20-30 ఏళ్లు జైల్లో మగ్గుతారు. ఆ తరువాత, వాళ్లను తమ దేశాలకు పంపిస్తారు. రెండు దేశాల్లోనూ ఈ వ్యవహారం ఇలాగే జరుగుతుంది" అని రంజన్ లఖన్‌పాల్ వివరించారు.

గూఢచర్యం

'ఇప్పటికీ ఆ జెండాపై ఆ రక్తపు మరకలు అలాగే ఉన్నాయి'

2013లో పాకిస్తాన్ జైలులో మరణించిన సరబ్‌జీత్ సింగ్‌ను భారత గూఢచారిగా గుర్తించారు. భారత ప్రభుత్వం ఆయన కుటుంబానికి తగిన పరిహారం అందించింది.

"సరబ్‌జీత్ చనిపోయాక చాలా డబ్బు ఇచ్చారు. ఆర్థిక సహాయం అందించారు. మాకు రూ. 15 వేలు తప్ప ఇంకేమి ఇవ్వలేదు" అని డేనియల్ ఆరోపించారు.

డేనియల్ ఇంటి పక్కనే నివసిస్తున్న సురేంద్ర పాల్ సింగ్ తండ్రి కార్గిల్ యుద్ధ సమయంలో గూఢచారిగా పనిచేశారు.

"నా తండ్రి సత్పాల్ సింగ్ 14 ఏళ్లపాటు గూఢచార సంస్థలలో పనిచేశారు. 1999 కార్గిల్ యుద్ధం జరుగుతున్నప్పుడు, ఆయన చివరిసారిగా పాకిస్తాన్ వెళ్లారు. ఆ సమయంలో ఆయన త్వరగా పాకిస్తాన్ వెళ్లి, వెనక్కు వచ్చేయాల్సి ఉండగా, సరిహద్దుల్లో పట్టుబడ్డారు. కొన్ని రోజుల తరువాత మా నాన్న మృతదేహం వెనక్కి వచ్చింది. సరిహద్దుల వద్ద మా నాన్న మృతదేహాన్ని మాకు అప్పగిస్తున్నప్పుడు, భారత జెండాలో ఆయన్ను చుట్టి ఉంచారు. ఆయన శరీరంపై రక్తం మరకలు ఉన్నాయి. ఇప్పటికీ ఆ జెండాపై ఆ రక్తంపు మరకలు అలాగే ఉన్నాయి. ప్రభుత్వం నుంచి సాయం అందేవరకు ఆ జెండాను నేను అలాగే ఉంచుతా. అది మా నాన్న చివరి గుర్తు" అని సురేంద్ర పాల్ చెప్పారు.

తన తండ్రి జీవించి ఉన్నప్పుడు, యూనిఫాం వేసుకున్న వ్యక్తుల తమ ఇంటికి వచ్చి బహుమతులు అందించేవారని చెప్పారు.

"ఒకసారి మా అక్క పెళ్లికి కట్నం తెచ్చి ఇచ్చారు. వాళ్లు రహస్యంగా గది తలుపులు మూసుకుని మా నాన్నతో మాట్లాడేవారు. కానీ, మా నాన్న చనిపోయాక మా ఇంటికి ఎవరూ రాలేదు" అని సురేంద్ర పాల్ చెప్పారు.

అప్పటికి సురేంద్ర పాల్ పాఠశాలలో చదువుకుంటున్నారు. తండ్రి చనిపోవడంతో చదువు మానేయాల్సి వచ్చింది. ప్రభుత్వం నుంచి పరిహారం పొందడానికి ఆయన చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఆయన అన్ని ఏజెన్సీల కార్యాలయాల చుట్టూ తిరిగారు. కానీ, వరెవరూ ఆయన తండ్రిని గూఢచారిగా గుర్తించలేదు. దిల్లీ, ముంబై, అమృతసర్‌లోని అధికారుల దృష్టిని ఆకర్షించడానికి ఆయన చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి.

"ఆ తరువాత మా అమ్మ, నా చెల్లెళ్లు ఇద్దరూ పొట్టకూటి కోసం పట్టణానికి వెళ్లి, ఇళ్లల్లో పనిమనుషులుగా కుదిరారు" అని సురేంద్ర పాల్ చెప్పారు.

గూఢచర్యం

సాక్ష్యంగా చూపించేందుకు ఎలాంటి పత్రాలు ఉండవు

సరిహద్దు జిల్లా ఫిరోజ్‌పూర్‌కు చెందిన గౌరవ్ భాస్కర్ మాజీ గూఢచారుల కొరకు ఒక అడ్వకసీ బృందాన్ని నడుపుతున్నారు.

ఆయన తండ్రి ఒక కవి. 1970లలో గూఢచర్యం ఆరోపణలపై పాకిస్తాన్‌లో జైలు శిక్ష అనుభవించారు. సిమ్లా ఒప్పందాల ప్రకారం, కవి హరివంశ్ రాయ్ బచ్చన్ విజ్ఞప్తి మేరకు ఆయనను విడుదల చేశారు.

ఇలాంటి గూఢచారుల వద్ద సాక్ష్యంగా చూపించేందుకు ఎలాంటి పత్రాలు ఉండవని గౌరవ్ భాస్కర్ అంటారు.

"వీళ్లని పనిలోకి ఎవరు తీసుకుననరో వాళ్లు ట్రాన్స్ఫర్ అయిపోయి ఉంటారు లేదా ఈ లోకాన్నే విడిచిపెట్టి వెళ్లిపోయుంటారు. వాళ్లకు వారసులు ఎవరూ ఉండరు. ఏ సంస్థ నుంచి దేశానికి సేవలు అందించారో, అందులో వాళ్ల తల్లిదండ్రులో, బంధువులో ఉండరు" అని ఆయన వివరించారు.

"వాళ్ల ఇళ్లు, బంగారం, వెండితో నింపమని కోరట్లేదు. ప్రాణాలతో మిగిలి ఉన్నవారికి లేదా వాళ్ల కుటుంబ సభ్యులకు మానవత్వంతో ఏదైనా ఒక ఉద్యోగం ఇవ్వాలను కోరుతున్నా. దాంతో, వాళ్లు కనీసం రెండు పూటలా తిండి తినగలుగుతారు" అని గౌరవ్ భాస్కర్ అంటున్నారు.

"నా యవ్వనమంతా గూఢచర్యంలో గడిచింది. అందుకు తగిన ప్రతిఫలం నాకు దక్కలేదు. ఈ పనిలో చేరడం వలన జీవితాలు నాశనం అయిపోతాయి, నాలాగ" అంటున్నారు డేనియల్ మసీహ్.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
'Village of spies' on India's borders.. 'Spies' without any evidence or identity
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X