నిమ్నకులస్తురాల్ని పెళ్లాడిన టెక్కీ, బహిష్కరణ: రూ.1 లక్ష ఇస్తే...
ముంబై: నిమ్న కులస్తురాలైన యువతిని పెళ్లి చేసుకున్నందుకు ఓ టెక్కీని, అతని కుటుంబాన్ని ఓ గ్రామం బహిష్కరించిన సంఘటన మహారాష్ట్రలో వెలుగు చూసింది. అయితే, ఈ ఆరోపణలను వారి కుల సంఘం ఖండిస్తోంది. సంజయ్ కాదమ్ (29) అనే సాఫ్టువేర్ ఇంజనీర్ దోంబివ్లీలో తన తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు.
అతను నేవీ ముంబైకి చెందిన శ్వేత గడ్కరీ (28) అనే యువతిని 2011లో పెళ్లి చేసుకున్నాడు. సంజయ్, శ్వేతలు నేవీ ముంబైలో కాలేజీలో చదివేవారు. వారి పరిచయం ప్రేమగా మారింది. అనంతరం ఇరు కుటుంబాల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు.
అయితే, తమను గ్రామానికి చెందిన వారు బహిష్కరించారని వారు ఆరోపిస్తున్నారు. తమతో సంబంధాలు తెంచుకోవాలని తమ బంధువుల పైన ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. తమ బహిష్కరణ పైన పలుమార్లు ప్రశ్నించిన తర్వాత.. మండలానికి చెందిన ప్రతినిధులు.. తమకు ఓ సందేశాన్ని పంపించారని చెప్పారు.

తాము రూ.1 లక్ష కడితే తాము తిరిగి రావొచ్చని చెప్పారని, కానీ వారు లిఖిత పూర్వక హామీ ఇవ్వడం లేదని ఆరోపించారు. వారి వైఖరితో అసంతృప్తికి లోనైన సంజయ్ గత శుక్రవారం మహారాష్ట్ర స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ (ఎంఎస్‌హెచ్ఆర్సీ)ని ఆశ్రయించాడు. అనంతరం శనివారం మండప పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
అయితే, అది తమ పరిధిలోకి రాదని, మీ గ్రామం వచ్చే పరిధి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. దీంతో అతను చిప్లున్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీని పరిధిలోకే సంజయ్ గ్రామం వస్తుంది.
అయితే, తమ పైన సంజయ్ కదమ్ చేసే ఆరోపణలు ఏమాత్రం వాస్తవం కాదని ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు చెబుతున్నారు. తాము సంజయ్‌ని లేదా వారి కుటుంబ సభ్యులను బహిష్కరించలేదని చెబుతున్నారు. వారి ఆరోపణలు విని తాము షాక్‌కు గురయ్యామని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications